నెత్తురోడిన రహదారి
♦ బంధువు కర్మకాండకు వెళ్లి వస్తూ కానరాని లోకాలకు..
♦ ప్రమాదంలో ఐదుగురు మృతి మృతులది నెల్లూరు జిల్లా
బంధువుల ఇంట్లో చావు... బాధల్లో పాలుపంచుకుని ఓదార్చి కర్మకాండల కార్యక్రమం ముగించి తిరుగుపయనం. అంతలోనే విషాదం. అద్దంకి సమీపంలో డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో ఇరవై అడుగుల ఎత్తుకు ఎగిరి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఐదుగురు తనువు చాలించారు. అంతా సాఫీగా సాగిఉంటే మరో రెండున్నర గంటల్లో వారి గమ్యస్థానమైన నెల్లూరు జిల్లా చేరుకునేవారు. నలుగురు ఘటన స్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేవారు కూడా లేకుండాపోయూరు. మూడు పదుల వయసు కూడా నిండని జ్యోతి అనే యువతి బస్సులో వచ్చి వెళ్లేటప్పుడు కూడా బస్సులో వెళ్దామనుకుని చివరి నిమిషంలో కారు ఎక్కి మృత్యుకౌగిలిలోకి చేరుకుంది.
అద్దంకి : బంధువు కర్మకాండకు వెళ్లి వస్తుండగా కారు బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిగా, మరో వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. ఈ విషాధ ఘటన గురువారం అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలోని శ్రీనివాసనగర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మృతుల బంధువుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా బోగుల మండలం జేపీ(జెక్కేపల్లి)గూడూరుకు చె ందిన 50 మంది, గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శ్రీరాంపురం గ్రామంలో తమ బంధువు కర్మకాండకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. రెండు కార్లు, మరికొందరు బస్సులో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు ఒక్కో కారులో ఐదుగురు చొప్పున, మిగిలిన వారు బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు.
బోల్తా కొట్టిన ముందు కారు
బయలుదేరిన రెండు కార్లలో ముందు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారు వేగంగా వస్తూ అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలోని శ్రీనివాసనగర్ సమీపంలో అదుపు తప్పింది. సుమారు 20 అడుగులు పైకి లేచి మార్జిన్‌లో పడింది. కారులో ప్రయాణిస్తున్న పేరం రమణమ్మ(55), గునపాటి వెంకటేశ్వరరెడ్డి(50), గునపాటి బుజ్జమ్మ(52),జ్యోతి(25)మృతదేహా లు కారు వెనుక అద్దంలో గుండా విసిరేసినట్లుగా అక్కడొకటి.. అక్కడొక్కటి పడ్డాయి.కారు నుజ్జునుజ్జయింది.కారులో ప్రయాణిస్తున్న ఐదో వ్యక్తి పేరం శ్రీనివాసరెడ్డికి తీవ్ర గాయాలు కాగా 108లో ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అతను కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
కారులో నేను వెళ్తా బాబాయ్.
మృత్యువు పిలిచిందో ఏమో..!! బస్సులో వెళ్లిన జ్యోతి, తిరిగి వచ్చే సమయంలో కారు ఎక్కుతున్న బాబాయి పాణ్యం వెంకయ్యకు అడ్డుపడింది. తాను కారు ఎక్కి విగత జీవిగా మారిందని బాబాయి వెంకన్న బోరున విలపించా రు.అక్క కూతరు జ్యోతి, తల్లి రమ్మణమ్మ ఇద్దరూ మరణించడంతో.. రమణమ్మ కుమారుడు వెంకటేశ్వరరెడ్డి విలపించిన తీరు చూపరులను కంటతపడి పెట్టించింది. ఈ విషాధ ఘటనలో కారు 20 అడుగుల ఎత్తుకు పైకి లేచి పడడాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ప్రమాద విషయం తెలియగానే అద్దంకిఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు,సీఐ బేతపూడి ప్రసాద్,దర్శి డీఎస్పీ శ్రీరాంబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంధువుల నుంచి వివరాలు సేకరించారు.