నాడు సౌందర్య.. నేడు శోభ
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనే నాడు సినీనటి సౌందర్య, నేడు వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మరణించారు. 2004 ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సౌందర్య (31).. ఆ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన బెంగళూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. అత్యధికంగా తెలుగు సినిమాల్లో నటించిన సౌందర్య, కొన్ని కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించడంతో మూడు రాష్ట్రాల్లోనూ ఆమెకు పెద్దసంఖ్యలో అభిమానులుండేవారు. ఆ అభిమానాన్ని ఓట్లరూపంలోకి మార్చుకోవాలని బీజేపీ కోరగా.. ఆమె ప్రచారం చేసేందుకు అంగీకరించి తన ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు శోభా నాగిరెడ్డి కూడా ఎన్నికల ప్రచార సంరంభం ముమ్మరంగా ఉన్న సమయంలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. చాలామంది నాయకురాళ్లలా తండ్రి చాటునో, భర్త చాటునో ఉండిపోకుండా తనకంటూ సొంతంగా నాయకత్వ లక్షణాలు సాధించి, రాయలసీమలోని మహిళా నేతల్లోనే ప్రత్యేక గుర్తింపు పొందిన శోభా నాగిరెడ్డి.. బుధవారం సాయంత్రం వైఎస్ షర్మిలతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆమె తిరుగులేని ఆధిక్యంతో గెలుస్తారని, మంచి ప్రాధాన్యం ఉన్న శాఖకు మంత్రిగా కూడా చేస్తారని కర్నూలు జిల్లావాసులు భావించారు. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం.. కేర్ ఆస్పత్రిలో కన్నుమూయడంతో అభిమానులు తల్లడిల్లిపోయారు.