రేడియో హోదా పెరిగింది! | Rose to the position of the radio | Sakshi
Sakshi News home page

రేడియో హోదా పెరిగింది!

Published Wed, Jan 28 2015 11:56 PM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM

రేడియో హోదా పెరిగింది! - Sakshi

రేడియో హోదా పెరిగింది!

మల్లాది సూరిబాబు, కర్ణాటక సంగీత విద్వాంసులు - ‘ఆకాశవాణి’ నిలయ కళాకారులు
 
అనుభూతి శబ్దాన్ని ఆశ్రయిస్తే మంచి పాట పుడుతుంది. సుస్వరంతో నిండిన ఆ శ్రావ్యమైన పాట సంస్కారవంతమైన హృదయాన్ని తట్టి లేపుతుంది. అప్పటికప్పుడు పాటను వ్రాయడం, అలా వచ్చిన పాటకు స్వరం కూడా తనే సమకూర్చుకుని పాడడం - ఈ మూడూ ఒకే వ్యక్తి వల్ల అయ్యే పనులు కాదు. రచన, సంగీతం, గానం - ఒకరే అయితే? మధురానుభూతుల్ని మాటలుగా మార్చి, వాటిని అందంగా పేర్చగల ప్రతిభామూర్తి మా రజనీ బాబాయ్. ‘‘హాయిలో నేల యెదకింత హింస... తీయ పాటలో బాధేల వంశీ...’’ అనే రజని పాటను నాలుగు దశాబ్దాల క్రితం ‘గజల్’గా ‘జనసమ్మోదిని’ రాగంలో ట్యూన్ చేసి, రజని గారికే వినిపించాను. గజల్ శైలిలో తన పాట విని ఆయన ఎంత పరవశించారో. ఈ పాటతో మా ఇద్దరి స్నేహం ఎంతో పెరిగింది. ఇవాళ్టికీ ఆయనకు ఈ పాట ఇంకా గుర్తే!
 రజనీ గారిది అదో సహజమైన, స్వతంత్రమైన సంగీతధార. ఆయన సంగీత విహంగం రెక్కలు చాపుకొని నాదప్రపంచంలో అందచందాలను వెతుక్కుంటూ, అటు మధ్య ప్రాచ్యం దాకా ఎగిరి రాగలదు. ఇటు హిందు స్థానీ, బెంగాలీ, జానపద రీతులతోనూ జత కట్టగలదు. జాతీయతకు (నేటివిటీ) దూరం కాకుండా నాద ప్రపంచంలో తనకో శైలిని ఏర్పరచుకున్నాడాయన.

 శాస్త్రీయ రాగాలు, వాటి స్వరూప స్వభావాలు, కోమలంగా ఉండే స్వరాలు, తీవ్రమైన స్వరాలు, పాటలోని మాటలకు ఏయే స్వరాన్ని ఎలా పాడితే భావాన్ని చెప్పగలమో అన్నీ తెలిసిన ‘సంగీతవేత్త’. ‘మనసౌనే ఓ రాధా...’, ‘మరు నిముసమే మనదో కాదో...’, ‘ఆశా నా ప్రాణసఖీ...’ లాంటి పాటలు ఓలేటి వెంకటేశ్వర్లు గారి కంఠంలో ఎన్ని హొయలు పోయాయో వింటే... రజని గారి ఊహాలోకాన్ని దర్శించవచ్చునని నాకనిపిస్తుంది.

నూతన రీతుల క్రియాశీలతకు సంప్రదాయ పరిధులు అడ్డు రాకూడదనే విధానాన్ని వెనుకటి తరంలోని రేడియో స్టేషన్ డెరైక్టర్లు పాటించారు కాబట్టే, ఈవేళ ‘ఆలిండియా రేడియో’ గౌరవం తరిగిపోకుండా అలా నిలబడింది. అటువంటి సంగీత, సాహిత్య మర్యాదలను నిలబెట్టినవారిలో శ్రీరజనీకాంతరావు ముందు వరుసలో ఉంటారు.

గమ్మత్తేమిటంటే, రచన, సంగీతం - రెండూ రజని గారి మనసులో నుంచి ఏకకాలంలో వచ్చేస్తాయి. రజని గారి వరసలు ఎవరూ, ఏమీ మార్చలేరు. వాటిని అవగాహన చేసుకుని పాడడం సామాన్య గాయకుడికి కష్టం. ‘రజని గారి గేయా లను స్వర సహితంగా అచ్చువేస్తే, భావితరాలకు ఆయన సంగీతజ్ఞత బోధపడుతుంద’ని బాల మురళీకృష్ణ గారోసారి నాతో అన్నారు. అంటే, రజని పాటల్లోని మజా ఏమిటో మనకర్థవుతుంది. పాటల్ని కంపోజ్ చేయడంలో రజనీది ఒక ప్రత్యేకమైన శైలి. ఎవరూ అనుకరించ లేని శైలి. ఎవరూ ఎదురుచూడని దారులు తొక్కుతూ, ఏదో కొత్తదనం  కనిపిస్తూనే ఉంటుంది.

విజయవాడలో 1970ల మొదట్లో ‘జై ఆంధ్రా’ ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ‘ఆకాశవాణి’లో ఏ కార్యకలాపాలూ జరగరాదని నిర్ణయించిన ఉద్యమకారులు స్టూడియో చుట్టూ మోహరించినప్పుడు, ఆ సమస్యను గ్రహస్థితికి ముడిపెట్టి, రజని గారు తయారు చేసిన ‘నవగ్రహ స్తుతి’ ఒక వినూత్న అనుభవం. ఈ కీర్తన ప్రసారమైన కొన్నాళ్ళకి ఉద్యమం కాస్త తగ్గింది.
 అలాగే, 1977లో దివిసీమ తుపానప్పుడు రజని ఒక పాట రాశారు. ‘నివాత శూన్య స్తంభం, నిష్పీడన మంథానం, జంఝా వాత సంరంభం, హంసవిధి విధానం...’ అనే పల్లవితో తుపాను బీభత్స సమయాన్ని ప్రతిబిం బిస్తూ సాగే ఆ పాటను ‘ఆకాశవాణి’లో ‘ఈ మాసపు పాట’గా పాడాను. నిజానికి, ఆ పాటలోని మాటలన్నీ చక్రవాక తుపానుకు సంబంధించిన సాంకేతిక పదాలకు చక్కటి తెలుగు మాటలు. ‘సైక్లోనిక్ సిలిండర్’కి అనువాదం ‘నివాత శూన్య స్తంభం’. సంక్లిష్టమైన మాటలు, తుపానుకు సంబంధించిన విషాదం అయినప్పటికీ... పాడడానికి అనువుగా ఉండే అద్భుతమైన గీతం అది. రేడియోకు ఒక ప్రత్యేకతను తెచ్చిన ఘనత - రజనీదే! ‘సంస్కృత పరిచయం’, ‘భక్తిరంజని’, ఓలేటి చేత ‘సంగీత శిక్షణ’, ‘ఈ మాసపు పాట’ వంటి కార్యక్రమాల రూపకల్పనకు ఆద్యుడు రజనీయే. రజని తన దగ్గర పనిచేసేవారిలోని ప్రతిభను గుర్తించి, కార్యక్రమాలను చేయించేవారు. అది చిన్న విషయం కాదు. ఆయనకున్న హోదా వల్లనే పేరు ప్రఖ్యా తులు వచ్చాయనుకుంటే పొరపాటు. ఆయన వల్ల రేడియో హోదా పెరిగిందనడం నిజం.

http://img.sakshi.net/images/cms/2015-01/61422469916_Unknown.jpg

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement