అలా ఉందామా?
‘రామాయణ విషవృక్షం’ తర్వాత అదే తరహాలో ఉన్న విమర్శతో ‘ఇదండీ మహాభారతం’ అన్న గ్రంథాన్ని ఇటీవల ప్రచురించారు రంగనాయకమ్మగారు. ‘ఇది మరో విషవృక్షం’ అని కూడా అన్నారు. ఏ అంశం మీద విమర్శ రాయాలనుకున్నా, దాని మూలాన్ని పూర్తిగా తెలుసుకొని రాసే ఆమె పద్ధతి ఇందులోనూ కనిపిస్తుంది. సంస్కృత భారతాన్నీ, పురిపండా వచన భారతాన్నీ, గంగూలీ ఆంగ్లానువాదాన్నీ, అలాగే కవిత్రయ భారతాన్నీ చదివే ఈ విమర్శ చేశారు. దాన్తో విభేదం లేదు కానీ విభేదం విమర్శను గురించే ఉంటుంది.
నిజానికి, రంగనాయకమ్మగారు అనుసరించిన పద్ధతికి ‘విమర్శ’ అనే పదం సరైనది కాదనాలి. విమర్శలో విమర్శకుల స్వీయాభిప్రాయాలు కనిపించరాదనేది విమర్శకు సంబంధించిన ఒక విలువ. స్వీయాభిప్రాయాలు లేని విమర్శ ఉంటుందా అన్నది వేరే చర్చ. అది సూక్ష్మ దృష్టికి మాత్రమే కనిపించేది. రంగనాయకమ్మగారి పద్ధతి వేరు; వేరు కాదు అందుకు వ్యతిరేకం. స్థూల దృష్టికే కనిపించేది. సాక్షాత్తూ ఆమె బడితె చేత ధరించి, భారతాన్నీ, అందులోని పాత్రల్నీ కీలుకీలునా విరగ్గొట్టి, చెత్తకుప్పలో పడవేసినట్టు కనిపించే విమర్శ! ఆ కుప్ప మీద ‘భారతం చదవడం వ్యర్థం’ అన్న తీర్పును కూడా రాశారు.
వ్యర్థమని తెలిశాక, అంత శ్రమపడి పుస్తకం రాయడమూ, నష్టం భరించి ప్రచురించడమూ అవసరమా అన్న ప్రశ్నలకు మనకే సమాధానాలూ దొరుకుతాయి. వ్యర్థం అని ఆమెకు తెలిస్తే చాలా, అందరికీ తెలియాలి కదా! అందుకూ పుస్తకం తేవడం. అందులోనూ భారతం కథ అంతా ఎవరికీ తెలీదు. ‘‘మీకు భారతం కథ తెలుసా?’’ అని ఆమె చాలామందిని అడిగి చూశారు. వాళ్లు సినిమా చూశామనీ, అందులో ద్రౌపదికి బట్టలు విప్పుతారనీ చెప్పారు. ‘ఎలాంటివాళ్లను అడిగారో..’ అని అనిపిస్తుంది కానీ, మనకు మాత్రం భారతం అంతా తెలుసా? ఈ పనిలో దిగబడేవరకూ రంగనాయకమ్మగారికీ తెలీదు. తెలిశాక, రాయాలనుకోకుండానే, భరించలేక రాసేశారు.
భరించలేకపోవడానికి గల కారణాలను, పుస్తకం టైటిల్ కింద నాలుగు లైన్ల మేరకు వివరించారు. నిజమే, ఆమె చెప్పినవన్నీ భారతంలో ఉన్నవే. అందులో రంగనాయకమ్మగారి కల్పనలు కానీ, వక్రీకరణలు కానీ లేనేలేవు. ఆయా సందర్భాలను పురస్కరించుకొని, చేసిన వ్యాఖ్యలూ, తర్కమూ, చెప్పిన అభిప్రాయాలూ మాత్రమే ఆమెవి. భారతం గురించి తను చెప్పిన ఏ మాటా, ఏ అభివర్ణనా నిరాధారంగా అన్నవి కావనీ, ఆ సంగతి పుస్తకం చదివితే అర్థమవుతుందనీ కూడా హామీ ఇచ్చారు. ‘ఇదండీ మహాభారతం’ చదివాక, ఇందులో ఉన్నవి భారతంలో ఉన్నవే అని అనుకున్నప్పటికీ, రంగనాయకమ్మగారు అన్న ‘వ్యర్థం’ అన్న మాటతో ఏకీభవించలేము. ఎందుకు?
‘రామాయణ విషవృక్షం’ తర్వాత, భారతం మీద కూడా రాయండి. అనడిగినవాళ్లకు ‘ఒక మత గ్రంథాన్ని మార్క్సిస్టు దృక్పథంతో అర్థం చేసుకున్న తర్వాత, ఏ మత గ్రంథాన్నయినా అలాగే అర్థం చేసుకోవచ్చు’ అని చెబుతూ వచ్చినట్టు, రంగనాయకమ్మగారే అన్నారు. ఈ సందర్భంగా రామాయణాన్నీ భారతాన్నీ పూర్తిగా మత గ్రంథాలుగా భావించవచ్చా, కావ్యాలుగా భావించరాదా అన్న చిన్న ప్రశ్నలు పుట్టుకొస్తాయి. వాటి సంగతి తర్వాత చూద్దాం. ఆరెస్సెస్ వాళ్లో, వీహెచ్‌పీ వాళ్లో అయితే, ‘ఇతర మత గ్రంథాల మీద కూడా ఇలా రాయగలరా?’’ అనడుగుతారు. రామాయణం మీద, భారతం మీద విమర్శ రాయకూడదని మనం అనం. కనుక, దాన్నీ అలా ఉంచుదాం. కేవలం సందేహాలను వ్యక్తం చేద్దాం.
భారతం కాలం నాటికి బ్రాహ్మణులూ, శూద్రులూ అలా ఉండేవారని సరిపెట్టుకోవచ్చు, అని రంగనాయకమ్మగారు అన్నదే. ఈ కాలంలో కూడా అలా ఉండటమేమిటి? బహుశా, ఈ ప్రశ్నే ఆమె ఈ పుస్తకం రాయడానికి కారణమై ఉండొచ్చు. బ్రాహ్మణులూ, శూద్రులూ అనేవాళ్లు ఇప్పటికీ ఉన్నారంటేనే ఆనాటి భావజాలం అంతో ఇంతో మార్పులతో ఇప్పటికీ ఉన్నట్టే కదా! పదిహేనేళ్ల పాటు మార్క్సిజం నేర్చుకుంటూ, నేర్పుతూ ఉండిన ఆమెకు ఈ సంగతి తెలీదా? ఆ నాటికి బ్రాహ్మణులూ, శూద్రులూ అలా ఉండేవారని సరిపెట్టుకున్నట్టే, ఆనాటి ఆ మూఢనమ్మకాలు నమ్మకాలుగా ఉండేవనో, నమ్మేందుకు వీలైన పరిస్థితులు ఉండేవనో ఎందుకు సరిపెట్టుకోకూడదు?
గణేశుడి విగ్రహాలు పాలు తాగడమూ, ఉత్తి చేతుల్లోంచి బంగారు గొలుసులు తీయడమూ, కక్కుకుంటూ నోట్లోంచి లింగాలు తీయడమూ, తన్ని కొట్టి రోగాలు నయం చేయడమూ, ఇప్పటికీ ఉండటమే కాక, నమ్ముతున్నవాళ్లూ ఉన్నారు కదా! ఈ నమ్మకాలే భారతంలోనూ కనిపించేవి. అయితే, వీటిని నమ్మాలనీ, విమర్శించరాదనీ కాదు. వాటిని ప్రధానంగా, ఆధారంగా చూసి, ‘భారతం చదవడం వ్యర్థం’ అన్న తీర్మానం చెయ్యవచ్చా? అవికాక, భారతంలో ఇంకేమీ లేవా?
ఇవీ సందేహాలు. భారతం ఒక కావ్యం. రామాయణమూ కావ్యమే. వాటిలో ఆధిపత్య వర్గం భావాలు అధికంగా కనిపిస్తాయి. వాటితో పాటు వాటికి ఎదురు తిరిగి చేసిన చిన్న చిన్న పోరాటాలూ, ప్రతిఘటనలూ తక్కువగానైనా కనిపిస్తాయి. వాటిని మొత్తంగా మతగ్రంథాలుగా భావించవచ్చా మార్క్సిస్టులు? వాటిని కావ్య దృష్టితో కనీసంగానైనా చూడలేదు రంగనాయకమ్మగారు. నన్నయ కవిత్వాన్నో, తిక్కన కవిత్వాన్నో ఇష్టపడుతున్నవాళ్లు భారతంలో ఉన్న వరాలనీ, శాపాలనీ జరగడానికి వీల్లేని సంఘటనల్నీ నమ్ముతున్నట్టా? ఆ మాటకొస్తే, నన్నయ తిక్కనలు కూడా నమ్మి రాశారని నమ్మలేం. ఎందుకంటే వాళ్లు మనుషులు. దేవతల్నీ, రాక్షసుల్నీ వాళ్లెప్పుడూ చూసి ఉండరు. నమ్మని వాటిని రాయడమెందుకు అన్న ప్రశ్న మళ్లీ మొదటికి తెస్తుంది.
‘‘కవిత్వం కుల భేదాల్ని తీసివెయ్యలేదు’’ అని రంగనాయకమ్మగారు అనడం మరింత ఆశ్చర్యకరం. కవిత్వమే కాదు, మొత్తం ప్రపంచ సాహిత్యమంతా కలిసినా సమాజంలో ఉన్న అంతరాలను తొలగించలేదు. మార్క్సిజం తెలీనివాళ్లు కూడా కవిత్వం ఆ పని చెయ్యగలదని అనుకోరు. అది చెయ్యగల పని వేరు. కర్ణుడి కవచంలాగా (ఇదీ మూఢనమ్మకమేనండోయ్) రంగనాయకమ్మగారి హృదయం కవిత్వం చొరరాని కవచంగా ఉంటే తప్ప అటువంటి అభిప్రాయం ఏర్పడి ఉండదనీ, కవిత్రయాన్ని కడగంటనైనా చూడకపోవడం జరిగేది కాదనీ అనిపిస్తుంది.
చివరగా చెప్పవలసింది ఇదీ. రంగనాయకమ్మ గారి ‘విమర్శ’ను అన్వయించి చూస్తే, మనకు ప్రాచీన సాహిత్యమంటూ మిగలదు. వేల ఏళ్లుగా ఉన్న సాహితీ వృక్షాలను విష వృక్షాలని నరికేస్తే ఏమవుతుంది? భారతం గురించి రంగనాయకమ్మ గారే చేసిన అభివర్ణనల్లో ఒక్కటైన ‘మొగ్గా పువ్వూ లేని, కాయా పండూ లేని మోడు’లుగా మనం మిగిలి ఉంటాం. అలా ఉందామా?
- పి.రామకృష్ణ