కోతి భయంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి..
కోతి భయంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి..
Published Fri, Nov 4 2016 4:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
హైదరాబాద్: సైదాబాద్ కల్యాణ్‌నగర్ కాలనీకి చెందిన సత్యవతి తన ఇంట్లో వంట చేస్తుండగా ప్రధాన ద్వారం గుండా ఓ కోతి ఇంట్లోకి ప్రవేశించింది. నిశ్శబ్దంగా వంటింట్లోకి చేరి పనుల్లో నిమగ్నమైన సత్యవతి చేతిని పట్టుకుని కొరికేసింది. ఊహించని ఘటనతో భయపడిన ఆమె బయటకు పరుగులు తీసింది. చుట్టుపక్కల వారి సాయంతో వెంటనే ఆస్పత్రి వెళ్లి వైద్యం చేయించుకుంది. కోతి కరిచిన విషయాన్ని చెన్నైలో ఉండే కుమారుడికి ఫోన్‌లో తెలిపింది. వెంటనే అతను హైదరాబాద్ నుంచి వచ్చేయమని సలహా ఇచ్చి, రైలు టికెట్ బుక్ చేశాడు. ఈ మేరకు సత్యవతి చెన్నై వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన ఈ ఘటన వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం.
సైదాబాద్ మండల ప్రజలను కోతుల గుంపొకటి కొద్దిరోజులుగా కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఆ సమూహంలో ఉన్న రెండు కోతులు మతిస్థిమితం కోల్పోయి కనిపించిన వారినల్లా కరిచేస్తున్నాయి. ఉదయాన్నే పాల ప్యాకెట్లు, పేపర్ల కోసం.. వాకింగ్‌కు వెళ్లే వారితో పాటు స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా కోతుల బారిన పడి ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పిచ్చెక్కిన కోతులు ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తాయోనని భయం భయంగా గడుపుతున్నారు. సైదాబాద్ డివిజన్ వీకేదాగ్‌నగర్‌లో 20 మందిని, కల్యాణ్‌నగర్‌లో 30, ఎస్‌బీహెచ్ ఏ, బీ, సీ కాలనీలో 30 మంది కోతుల బారినపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోతి కాటుకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి రూ. వేలు ఖర్చు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. కోతులను పట్టుకోడానికి రంగంలోకి దిగిన జూ సిబ్బంది కల్యాణ్‌నగర్, వీకేదాగ్‌నగర్, సీ కాలనీలలో పార్కులు, ఇళ్లపైన జాలీలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు రెండు కోతులను పట్టుకున్నప్పటికీ మిగిలిన కోతుల జాడ మాత్రం తెలియలేదు.
Advertisement
Advertisement