‘క్లై ఫై’తో ప్రళయమా ?
న్యూఢిల్లీ: క్లైమేట్ ఛేంజ్...భూతాపోన్నతి పెరిగి ప్రపంచంలో సంభవించే పెను మార్పులు. నేటి ‘వైఫై’ యుగంలో క్లైమేట్ ఛేంజ్‌ను ‘క్లైఫై’ అని పిలుస్తున్నారు. తైవాన్‌లోని బ్లాగర్ డాన్ బ్లూమ్ 2007లో ఈ పదాన్ని కాయిన్ చేశారు. ఇది 2013 నుంచి బాగా ప్రచారంలోకి వచ్చింది. బ్లాగ్‌లు, వార్తా పత్రికలు, నవలల్లో ఎప్పటి నుంచో భూతాపోన్నతి పెరగడం పట్ల చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఫిక్షన్ కథలు వెలువడుతున్నాయి. ఇదే అంశంపై దేశ, దేశాధినేతలు కూడా సుదీర్ఘకాలంగా సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
ఒక విధంగా చెప్పాలంటే బైబిల్‌లో పేర్కొన్న వరదలు కూడా భూతాపోన్నతి కారణంగానే అన్న సూత్రీకరణల కాలం నుంచే చర్చలు కొనసాగుతున్నాయి. అయినా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా ఉంది. రియోలో 1992లో ప్రపంచ దేశాల మధ్య భూతాపోన్నతి తగ్గించేందుకు ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. దానిలో ఏ అంశం కూడా నేడు అమలు కావడం లేదు. అందుకే సోమవారం పారిస్‌లో ప్రారంభమైన సదస్సు ప్రధానంగా నాటి ఒప్పందాన్నే సమీక్షిస్తోంది.
ఇంతకు ‘క్లై ఫై’ అంటే ఏమిటి? దాని పరిణామాలు ఎలా ఉంటాయి? వాటిని అడ్డుకోవడం ఎట్లా? నిరక్షరాస్యుల నుంచి అక్షరాస్యుల వరకు ఎక్కువ మందికి అంతు చిక్కని ప్రశ్నే! పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కార్బన ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరుగుతోందని, ఫలితంగా రుతుక్రమాలు గతి తప్పుతాయని, ఒక ప్రాంతంలో వర్షాలు అధికంగా పడి వరదలు సంభవిస్తే, మరో ప్రాంతంలో వర్షపు చినుకు కూడా పడకుండా దుర్భర కరువు పరిస్థితులు దాపురిస్తాయని, భూతాపోన్నతి కారణంగా ధ్రువాల్లో మంచు కొండలు కరిగిపోయి జల ప్రళయం వస్తుందని, భూపొరల్లో మార్పులు వచ్చి అగ్ని పర్వతాలు బద్ధలై ప్రళయ భీకరాన్నిసృష్టిస్తాయని, సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోతే ఏదో ఒకరోజు భూగోళంపై సమస్త జీవరాశి నశిస్తుందని స్థూలంగా సామాన్యులకున్న అవగాహన.
అందుకనే భూతాపోన్నతి పరిణామాలపై ఎన్నో హాలివుడ్ సినిమాలు, దాదాపు 150 నవలలు వచ్చాయి. 1976లో ‘హీట్’ అనే నవలను ఆర్థర్ హెర్జోగా రాశారు. ‘ది సన్ అండ్ ది సమ్మర్’ అనే నవలను జార్జ్ టర్నర్ 1987లో రాశారు. మ్యాగీ గీ, టీసీ బోయల్, అట్వూడ్, మైఖేల్ క్రిక్టాన్, బార్బర కింగ్‌సాల్వర్, ఐయాన్ మ్యాక్‌ఎవాన్, కిమ్ స్టాన్లే రాబిన్సన్, ఐజా త్రోజనోవ్, జీనెట్ వింటర్‌సన్ లాంటి రచియతలతోపాటు వర్ధమాన రచయితలు స్టీవెన్ ఆమ్‌స్టర్‌డామ్, ఎడన్ లెపుకీ, జాన్ రాసన్, నిథానియల్ రిచ్ లాంటి వారు పలు రచనలు చేశారు. వీరి రచనల కారణంగానైతేనేమీ, హాలివుడ్ సినిమాలు, పత్రికలు, ఇతర మీడియా మాధ్యమాల వల్లనైతేనేమీ భూతాపోన్నతిపై చర్చలు జరుగుతున్నా అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాల మధ్య సయోధ్య కుదరక భూతాపోన్నతి అరికట్టే చర్యలు ముందుకు సాగడం లేదు.
అమెరికా, చైనా లాంటి అగ్ర దేశాలే కర్బన ఉద్గారాలకు ఎక్కువ కారణమవుతున్నాయని, వాటితో సమానంగా చర్యల ప్రమాణాలను తమకు సూచిస్తే ఎట్లా ? అని వర్ధమాన దేశాలు ప్రశ్నిస్తూ వస్తున్నాయి. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్లనే భూతాపోన్నతి పెరగడం లేదు. అడవుల విస్తరణ తరిగి పోవడం, ఖనిజ సంపద కోసం గనుల తవ్వకాలు జరపడం, రాళ్లు, కంకర కోసం పర్వతాలను మట్టి కరిపించడం, నదీ జలాల ప్రవాహాన్ని భారీ డ్యామ్‌లతో అరికట్టడం, వాటిని ప్రకృతికి విరుద్ధంగా తరలించడం కూడా ప్రధాన కారణాలే.