UP Fire Accident: ఆ నర్సు వల్లే ఈ ఘోరం? | UP Jhansi Hospital Incident: Eyewitness Make Sensational Allegations | Sakshi
Sakshi News home page

యూపీ మెడికల్‌ కాలేజ్‌ ఘటన: ఆ నర్సు వల్లే ఈ ఘోరం?.. ప్రత్యక్ష సాక్షి సంచలన ఆరోపణ!

Published Sat, Nov 16 2024 12:07 PM | Last Updated on Sat, Nov 16 2024 12:52 PM

UP Jhansi Hospital Incident: Eyewitness Make Sensational Allegations

తీవ్ర విషాదంగా యూపీ ఝాన్సీ అగ్నిప్రమాద ఘటన 

షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చన్న డిప్యూటీ సీఎం

నర్సు అగ్గిపుల్ల వెలిగించిందన్న ప్రత్యక్ష సాక్షి

ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే 16 మంది పసికందులు

సోషల్‌మీడియాలో ప్రమాద సమయంలోని దృశ్యాలు వైరల్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్‌ వైద్య కళాశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం.. పది మంది పసికందుల్ని బలిగొనడం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారణం ఏంటన్నది తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. శనివారం సాయంత్రంకల్లా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. 

ఘటనకు షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోపు విస్తుపోయే విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆక్సిజన్‌ సిలిండర్‌ పైప్‌ను కనెక్ట్‌ చేస్తున్న సమయంలో ఓ నర్సు నిర్లక్ష్యంగా అగ్గిపుల్ల వెలిగించినట్లు తెలిపిన ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం దర్యాప్తు తర్వాతే కారణంపై ప్రకటన చేస్తామని అంటున్నారు. 

ఆపద్భాందవుడిలా భగవాన్‌ దాస్‌!
హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్‌ దాస్‌ తన కొడుకును ఇదే ఆస్పత్రిలో చేర్చాడు. ప్రమాదం నుంచి తన కొడుకుతో పాటు మరికొందరు చిన్నారులను దాస్‌ రక్షించాడని పక్కన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ‘‘ఆ నర్సు అగ్గిపుల్ల వెలగించగానే..  ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. అక్కడంతా మంటలు అంటుకున్నాయి’’ అని దాస్‌ చెబుతున్నాడు.  ప్రమాదం జరిగిన వెంటనే దాస్‌ ఓ గుడ్డలో నలుగురు పసికందుల్ని చుట్టి.. తన వీపుకి కట్టుకుని బయటకు తీసుకొచ్చాడని అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. అగ్ని కీలలు ఎగసి పడ్డాక.. ఆస్పత్రిలోని సేఫ్టీ అలారంలు మోగకపోవడంతో చిన్నారుల తరలిపు ఆలస్యం అయ్యిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అయితే.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేష్‌ పాథక్‌..  బాధితులకు న్యాయం జరిగి తీరుతుందని  చెబుతున్నారు. సిలిండర్‌ కాన్‌సెంట్రేటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారని, ఒకవేళ మానవ తప్పిదం జరిగి ఉంటే ఎవరినీ వదలబోమని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారాయన. ఘటనపై మూడంచెల దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు.

నెట్టింట దయనీయమైన దృశ్యాలు
శుక్రవారం రాత్రి 10.30గం.-10.45గం. మధ్య ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి చిన్నపిల్లల వార్డులో (neonatal intensive care unit..NICU) అగ్నిప్రమాదం సంభవించింది. ఆ వెంటనే అక్కడ బీతావహ వాతావరణం నెలకొంది. పసికందుల్ని రక్షించేందుకు ఆస్పత్రి సిబ్బందితో పాటు తల్లిదండ్రులు పరుగులు తీసిన దృశ్యాలు, ఆ పసికందుల మృతదేహాల వద్ద రోదిస్తున్న దృశ్యాలు..  ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

ఈ ఘటనలో నవజాత శిశువులు 10 మంది సజీవ దహనం కాగా, మరో 16 మంది ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 54 మంది ఆ వార్డులో చికిత్స పొందుతుండగా.. అందులో 44 మంది నవజాత శిశువులే కావడం గమనార్హం.

ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం, గాయపడ్డవాళ్లకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ఘటనపై నివేదికను 12 గంటల్లో సమర్పించాలని డీజీపీ ఆదేశించారాయన. మరోవైపు.. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement