అమెరికా బాటలో సౌదీ అరేబియా
సాక్షి, ముంబయి : భారత ప్రొఫెషనల్స్ ఎంట్రీపై అమెరికా వీసా ఆంక్షలు విధిస్తే..తాజాగా సౌదీ అరేబియా నూతన నితాకత్ మార్గదర్శకాలతో భారత్ నుంచి వలసలకు బ్రేక్ వేస్తున్నది. సౌదీ తాజా నిబంధనలతో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కేవలం కొన్ని ప్రముఖ సంస్థలు హైగ్రేడ్ పోస్టుల్లో మాత్రమే భారతీయులకు చోటు దక్కుతుంది. ఇతరులు మై గ్రాంట్ ఉద్యోగులుగా వీసాలు నమోదు చేసుకునేందుకు పలు అవరోధాలు ఎదురవనున్నాయి.
2016 నాటికి సౌదీ అరేబియాలో 25 లక్షల మంది భారతీయులు పనిచేస్తుండగా వారి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. 2016లో సౌదీలో కేవలం 1.65 లక్షల ఇమిగ్రేషన్ క్లియరెన్స్ చోటుచేసుకున్నాయి. ఇవి అంతకుముందు ఏడాది కంటే 46 శాతం తక్కువ కావడం గమనార్హం. సౌదీ అరేబియాకు భారత్‌లో అత్యధికంగా యూపీ, పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ రాష్ట్రాల నుంచి వర్కర్లు తరలి వెళుతున్నారు. సౌదీఅరేబియా వాసులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత దక్కేలా అక్కడి ప్రభుత్వం ఇమిగ్రేషన్ పాలసీలో మార్పులు చేయడంతో భారత ఉద్యోగులకు ఇబ్బందికరమేనని భావిస్తున్నారు.
తాజా నిబంధనల ప్రకారం ప్లాటినమ్, హైగ్రీన్ క్యాటగిరీ సంస్థలకు మాత్రమే న్యూ బ్లాక్ వీసాల జారీకి అర్హులుగా నిర్దారించారు. భారత్ నుంచి సౌదీలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా నిర్మాణ, ఆతిథ్య రంగాల్లో పనిచేస్తున్నారు. ఈ రంగాలు ప్లాటినమ్, హైగ్రీన్ క్యాటగిరీలో ఉండే సంస్థలు అతితక్కువ కావడంతో భారత్ ఉద్యోగులు, కార్మికుల హైరింగ్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది.