సినీ కళా పూర్ణోదయ కర్తకు ఎనిమిది పదులు
ఎనభై రెండేళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో కొన్ని వందల మంది నిర్మాతలు, వేలకొద్దీ సినిమాలు వచ్చాయి. కానీ, జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమా కీర్తిని వ్యాపింపజేసిన నిబద్ధత గల నిర్మాతలు, సినిమాల సంఖ్య మాత్రం కొద్దే. ముఖ్యంగా, తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములా బాట పట్టిన 1970, ’80లలో అలాంటి అరుదైన మంచి చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకోవడం ఆషామాషీ విషయం కాదు. ‘శంకరాభరణం’ లాంటి ఆణిముత్యాలతో ఆ ఘనతను అందుకున్న అరుదైన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. కాకినాడ కాలేజీ రోజుల్లోనే ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ లాంటి నాటకాలు ప్రదర్శించి, హీరో అవుదామని సినీ రంగానికి వచ్చిన కళాప్రియుడు ఏడిద. డబ్బింగ్ కళాకారుడిగా, తరువాత చిన్నాచితకా వేషాల ఆర్టిస్టుగా ప్రయత్నించిన ఆయన నిర్మాతగా స్థిరపడినప్పుడూ ఆ కళాభిరుచిని వదులుకోకపోవడం విశేషం. నిర్మాతగా ఆయన తీసినవి పట్టుమని పది చిత్రాలే.
‘పూర్ణోదయా మూవీ క్రియేషన్స్’ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు సినిమా తల్లికి పదికాలాలు నిలిచే పట్టు చీరల్లాంటి సినిమాలు కట్టబెట్టారు. ఏ దేశం వెళ్ళినా, ఇవాళ తెలుగువారు సగర్వంగా చెప్పుకొనే ‘శంకరాభరణం’ (’80), ‘సాగర సంగమం’ (’83), ‘స్వాతిముత్యం’ (’86) లాంటి కళాఖండాలు నిర్మాతగా ఆయన అభిరుచిని పదుగురికీ పంచాయి. ప్రేక్షకుల అభిరుచిని పెంచాయి. మన సినిమాకు ప్రశంసలు, పురస్కారాలు తెచ్చాయి. నిర్మాతగా తాను ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించడానికి దర్శకుడు కె. విశ్వనాథ్, రచయిత జంధ్యాల లాంటి ఎంతోమంది సృజనశీలురు కారణమని ఆయన ఎప్పుడూ నిజాయితీగా నమ్రతతో చెబుతుంటారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సినీ అవార్డుల కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం చిత్ర నిర్మాణానికి దూరంగా విశ్రాంతి జీవితం గడుపుతున్నారాయన. వయోభారం ఇబ్బంది పెడుతున్నా, చెన్నై, హైదరాబాద్‌ల మధ్య తిరుగుతూ, ఇప్పటికీ ముఖ్యమైన సినీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సినిమా పట్ల తరగని ఆయన ప్రేమకు దర్పణం. ఇవాళ్టితో 80 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఈ సినీ కళాపూర్ణోదయ కర్తకు శుభాకాంక్షలు.