దేవుడు మంచి అకౌంటెంట్! | I never expected this: Kota Srinivasa Rao | Sakshi
Sakshi News home page

దేవుడు మంచి అకౌంటెంట్!

Published Tue, Jan 27 2015 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

దేవుడు మంచి అకౌంటెంట్!

దేవుడు మంచి అకౌంటెంట్!

 హైదరాబాద్ శివారులోని కోకాపేటలోని భారీ సెట్ అది.అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న  తాజా సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందక్కడ.సోమవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్...  ‘పద్మశ్రీ’ పురస్కార విజేతగా ఆదివారం రాత్రి ప్రభుత్వం ప్రకటించిన కోట శ్రీనివాసరావును యూనిట్ సభ్యులంతా కలసి అభినందించారు. సత్కరించారు. ‘మా మావకి ఇది ఓ పదిహేనేళ్లకు సరిపడా కిక్ వచ్చింది’ అన్నారు రాజేంద్రప్రసాద్, కోటకు కేక్ తినిపిస్తూ. కోటను అభినందిస్తూ వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మరోపక్క ఎవరెవరో పూలబొకేలు పంపిస్తున్నారు. ఇంటి నుంచి  వచ్చిన ఉసిరికాయ పచ్చడి, వగైరాలతో భోజనం చేస్తూ కోట ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
 
  ‘పద్మశ్రీ’ పురస్కారం గెలుచుకున్నందుకు అభినందనలు సార్?
 ధన్యవాదాలండీ. ఈ అవార్డు రావడానికి కారకులైన నా దర్శక, నిర్మాతలకూ, సహనటులకూ, సాంకేతిక నిపుణులకూ, ప్రేక్షకులకూ - అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. పద్మశ్రీ రావడం ఓ పక్క థ్రిల్‌గా, మరోపక్క చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో విజయవాడ దగ్గర కంకిపాడులో నాటకాలతో మొదలైన ప్రస్థానం ఇక్కడకు చేరుకున్నందుకు ఏదో సాధించానని కించిత్ గర్వంగానూ ఉంది.
 
  ఈ స్థాయికి చేరుకోవడానికి మీకు తోడ్పడిన అంశాలు ఏమిటనుకుంటున్నారు?
 నేను నటనను వృత్తిగానే భావించాను కానీ, ఏనాడూ వ్యాపారంగా చూడలేదు. నటించినందుకు డబ్బులు తీసుకున్నాను కానీ, మరీ విచ్చలవిడిగా వసూలు చేయలేదు. సిన్సియారిటీనే నా కెరీర్‌కు శ్రీరామరక్ష. అప్పుడూ, ఇప్పుడూ శ్రద్ధగానే పనిచేశా, పనిచేస్తాను కూడా!
 
 గుమ్మడికాయంత ప్రతిభతోపాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని మీరే చాలాసార్లు చెబుతుంటారు. మరి మీ విషయంలో?
ఎవరికైనా అదే అప్లై అవుతుంది. ‘పద్మశ్రీ’ రాగానే చాలామంది నాకు ఫోన్లు చేసి ‘మీకెప్పుడో రావాలి... ఇప్పటికే చాలా ఆలస్యమైంది’’ అన్నారు. మనం అనుకుంటే అన్నీ జరిగిపోతాయా చెప్పండి. దేనికైనా ప్రాప్తం ఉండాలి. మనకెప్పుడు ప్రాప్తమో, ఎంత ప్రాప్తమో... అంతే! దేవుడు చాలా గొప్ప అకౌంటెంట్. ఆయనకు ఏ లెక్క ఎప్పుడు వేయాలో, ఎక్కడ ఎంత సరిపెట్టాలో బాగా తెలుసు. అయినా అవార్డులతో వ్యక్తుల ప్రతిభను ఎలా కొలవగలం! అలా అనుకుంటే... మహా నటుడు ఎన్టీఆర్‌కు ఏ నంది అవార్డు వచ్చిందని!!
 
 ఇన్ని దశాబ్దాల మీ నట జీవితాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తోంది?
 నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నాటకరంగంలో నాకు అన్నీ నేర్పిన తొమ్మిదిమంది గురువులను నేనెప్పటికీ మరిచిపోలేను. మా అన్నయ్య కోట నరసింహారావు, భావనాచారి, దేశ రాజు హనుమంతరావు, భానుప్రకాశ్, ఆయన తమ్ముడు శశాంక్, ఆదివిష్ణు, ఎల్బీ శ్రీరామ్, రత్నాసాగర్, కేజీ రామ్‌ప్రసాద్... ఈ తొమ్మండుగురు నాకు గురువులు. వీళ్లందరినీ గతంలో నేను ప్రత్యేకంగా సత్కరించాను కూడా!
 
  అప్పటి ‘ప్రతిఘటన’లో తెలంగాణ మాండలికం మొదలు ‘అత్తారింటికి దారేది’లో చిత్తూరు యాస దాకా... అన్ని మాండలికాలనూ అవలీలగా పండిస్తారు. ఆ పట్టు ఎలా చిక్కింది?
 ప్రత్యేకంగా నేర్చుకోవడమంటూ ఉండదు కానీ, శ్రద్ధగా గమనిస్తూ, పట్టుకుంటా. ఎవరైనా ప్రత్యేకమైన యాసలో మాట్లాడితే, వాళ్లతో కాసేపు మాట్లాడి గమనిస్తా. వాటిని మనసులో పెట్టుకొని, సమయం, సందర్భం, పాత్రను బట్టి, దర్శక, రచయితల సహకారంతో వాడుతుంటా. ‘అత్తారింటికి దారేది’లో చిత్తూరు మాండలికం కోసం త్రివిక్రమ్ ప్రత్యేకంగా నామిని రచనలను తెప్పించి, చదివించారు.
 
 పుస్తకాలు బాగానే చదువుతారా?
 అస్సలు లేదండీ. 35 ఏళ్ల నుంచి నటన తప్ప, నాకు వేరే పని లేదు. షూటింగులు లేకపోతే ఇల్లు. రామాయణ, భారతాలు కూడా ఆమూలాగ్రం చదవలేకపోయా.
 
  మీ తొలి నాటకం గుర్తుందా?
 ఎందుకు మర్చిపోతామండీ...! పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు రాసిన ‘ఆడది’ నాటకంలో శతభిషం పాత్ర నేనే చేశా. ఆ నాటకంలో ఒక్క స్త్రీ పాత్ర కూడా ఉండదు. గమ్మత్తేమిటంటే నా నక్షత్రం కూడా శతభిషమే.
 
  నటనలో సహజత్వం కోసం ఏమైనా కసరత్తులు చేస్తారా?
 రంగస్థలంపై నాటకాలు ఆడుతున్నప్పుడు కూడా నా గురువులు ఇలా యాక్ట్ చేయాలని నాకెప్పుడూ చేసి చూపించలేదు. ‘నాలుగు రోజులుగా నువ్వు ఆకలితో ఉన్నావనుకో! నువ్వైతే ఎలా యాక్ట్ చేస్తావో చేసి చూపించు’ అనేవారు. ఎందుకంటే ఎవరి భావోద్వేగాలు వాళ్లకు ఉంటాయి కదా! నేను మొదటి నుంచీ ఆ పంథానే అనుసరించా. అందుకే నా నటనలో అనుకరణ కాకుండా, సహజత్వం కనబడుతుందేమో!
 
 ప్రాణం ఖరీదు’ మొదలుకుని ఇప్పటికి అన్ని భాషల్లో కలిపి 800పై చిలుకు సినిమాలు చేశారు. ఇంకా చేయాలనుకునే పాత్ర ఏమైనా మిగిలి ఉందా?
 ఒకప్పుడు సినిమాల ప్రభావం మనుషులపై చాలా ఉండేది . ఎన్టీఆర్ ఫ్యాంట్, ఏఎన్నార్ కట్, శోభన్‌బాబు హెయిర్‌స్టైల్, వాణిశ్రీ చీర - జాకెట్... ఇలా అందరూ అనుసరించేవారు. అయితే, అప్పట్లో సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం, కౌబోయ్ - ఇలా ఏ తరహా అయినా ఆ పాత్రలకు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. కానీ, ఇప్పుడు నన్నడిగితే ప్రజల ప్రభావం, చుట్టుపక్కల సమాజం ప్రభావం  సినిమాలపై ఉంది. అప్పట్లో రాజకీయ నాయకుడంటే ఒక గెటప్ ఫాలో అయితే సరిపోయేది. ఇప్పుడలా కుదురుతుందా! అసెంబ్లీకి వెళ్లి చూడండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా... ఎన్ని రకాల వేషభాషలు కనిపిస్తాయో..? కాబట్టి, ఏ రోజుకు ఆ రోజు కొత్త రకంగా పాత్రను పోషించవచ్చు. అయినా, గెటప్స్, కేరెక్టర్ ఒక్క రోజులో తేలిగ్గా మర్చిపోతున్నప్పుడు ఇక డ్రీమ్ రోల్స్ ఏముంటాయ్!
 
  రాజకీయ రంగానికి దూరంగా ఉన్నారా?
 చిన్నప్పటి నుంచి నాలో కొంత ఆర్.ఎస్.ఎస్. భావజాలం, హిందూత్వ అభిమానం ఉండేవి. 1990లో బీజేపీలో చేరా. అప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నా. మిగతావాళ్లలాగా పార్టీలు మారలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ప్రస్తుతం కొంత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాను.
 
 మీకు ‘పద్మశ్రీ’ రావడానికి ఆ రాజకీయ నేపథ్యం ఏమైనా ఉపయోగపడిందంటారా?
 అలాగైతే ఈ పురస్కారం ఎప్పుడో వచ్చేది కదా!
 
  మన తెలుగు పరిశ్రమలో పద్మ పురస్కారాలు అందుకోవాల్సిన వాళ్లు... మీ కన్నా సీనియర్లు ఇంకా చాలామందే ఉన్నారేమో?
 అవును. నా కన్నా సీనియర్లయిన కైకాల సత్యనారాయణ, గిరిబాబు, గొల్లపూడి మారుతీరావు - ఇలా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. కానీ, ఒకరికి రావడం, రాకపోవడం మన చేతుల్లో లేదు కదా.
 
 నిర్మాణం, దర్శకత్వం చేయాలని ఎప్పుడైనా అనిపించిందా..?
 నాకొద్దు సార్. అవి నాకు తెలియని పనులు. చేతకానివి. అవి చేయడానికి చాలా విద్వత్తు కావాలి. ఒకవేళ నేనే ప్రొడక్షన్ చేస్తే, ‘కష్టపడి సంపాదించిన సొమ్మును ఎందుకిలా తగలేస్తున్నాడ’ని మీరే కామెంట్ చేస్తారు.
 
 ఇన్నేళ్ల అనుభవంతో చెప్పండి... తరువాతి తరానికి మీరిచ్చే సలహా?
 సాధన. అది ఉంటేనే ఏ రంగంలోనైనా మనం దీర్ఘకాలం నిలబడగలుగుతాం. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన...’ అని పెద్దలు ఊరకే అనలేదు కదా! అయినా ఇప్పుడు జనంలో సాధన తక్కువైంది, వాదన ఎక్కువైంది. ‘ఎడమవైపున నడవాలి’ అని చెప్పావనుకోండి ‘ఏం! కుడివైపున ఎందుకు నడవకూడదు?’ అని వాదిస్తారు.
 
 మీరు వ్యంగ్యాస్త్రాలు విసురుతారని, కొటేషన్స్ చెబుతారని ప్రతీతి. వాటిలో మీకు నచ్చిన మాట?
 ఆర్టిస్టులకూ, టెక్నీషియన్లకూ నేను తరచూ చెప్పే మాట ఒకటే... మనకు టైమొస్తే తీరిక టైమ్ ఉండదు. టైమ్ పోయిందా... మన బజారుకు కర్ప్యూ పెట్టినట్టే! ఒక్కడూ దగ్గరకు రాడు!
 
 నటుడిగా మీకంటూ తీరని కోరికలు ఏమైనా...?
 ఏమీ లేవు. ఒకటే కోరిక... చనిపోయే చివరి క్షణం వరకూ నటించాలి. రేపు మరణించినా నటునిగా చిరస్థాయిగా జీవించే ఉండాలి.
 
 మై టాప్ టెన్
  ప్రతిఘటన (1986)  అహ నా పెళ్ళంట (1987)
  శత్రువు (1990)   అలెగ్జాండర్ (1992)
  రక్షణ (1993)  గాయం (1993)
  హలో బ్రదర్ (1994)  పంజరం (1997)
  గణేశ్ (1998)  ఆడవారి మాటలకు
 అర్థాలే వేరులే (2007)
 
 - పులగం చిన్నారాయణ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement