ప్రముఖ నటుడు నాగార్జున బుల్లితెరపై మెరవనున్నారు. 28 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షో ద్వారా డ్రాయింగ్ రూమ్‌లో వీక్షకులను పలకరించనున్నారు. జూన్ మొదటివారం నుంచి ‘మా’ టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఇప్పటికే విజయవంతమైన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఫార్ములాతోనే ఈ గేమ్ షో రూపొందుతోంది. రూపొందుతోంది. ఇప్పటి వరకు తెలుగు చానల్స్‌లో వచ్చిన గేమ్ షోలకు భిన్నంగా, ప్రయోజనాత్మకంగా ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ను నిర్మిస్తున్నట్లు ‘మా’ టీవీ యాజమాన్యం నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ షో పరిచయ కార్యక్రమంలో ‘మా’ టి.వి. చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ, ‘‘సమాజంలో, ముఖ్యంగా గత నాలుగైదేళ్ళలో చాలా బాధలు పడ్డాం. ప్రతికూల భావనలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో మానవీయంగా ఉంటూ, మారుమూల ప్రాంతపు మనిషి కూడా జీవితంలో గెలుపు సాధించి, మరెంతో మందికి ప్రేరణనివ్వడం కోసమే ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేపట్టాం’’ అని పేర్కొన్నారు.
ఈ గేమ్ షోకు నాగార్జునను హోస్ట్‌గా ఎంచుకోవడంపై ఆయన వివరణనిస్తూ, ‘‘చాలా ఏళ్ళుగా నాగ్ నాకు స్నేహితుడు, సన్నిహితుడు. అయితే, ఈ షోకు దాదాపు 37 - 38 మంది స్టార్లను అనుకున్నా, చివరకు నాగార్జునే సరైన వ్యక్తి అని నిర్ధారణకు వచ్చాం. ఆ రకంగా ఆ వడపోతలన్నీ దాటుకొని నాగార్జున ఈ హోస్ట్ హోదాను తనకు తాను సంపాదించుకున్నారే తప్ప మాకు మేము ఇచ్చింది కాదు’’ అని చెప్పారు. ‘ఆరేళ్ళ క్రితం ‘మా’ టి.వి.ని చేపట్టిన మేము ఓ సవాలుగా తీసుకొని, ఈ ‘మట్టిలోని మాణిక్యాన్ని’ సానబెట్టి, అందమైన రత్నంగా తీర్చిదిద్దాం. ఇవాళ తెలుగులోని సర్వజన వినోదాత్మక టీవీ చానళ్ళ (జి.ఇ.సి)లలో నంబర్ వన్ స్థానానికి తీసుకురాగలిగాం. దీనికి మా సంస్థలో పని చేసిన, చేస్తున్న ఉద్యోగుల కృషే కారణం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘కొద్ది నెలలుగా ప్రథమస్థానంలో నిలిచిన ‘మా’ చానల్‌ను ఆ స్థానంలో సుస్థిరంగా నిలబెట్టేందుకు చేస్తున్న విశిష్టమైన కార్యక్రమమే ఈ తాజా గేమ్ షో. ఈ ఆరేళ్ళలో ‘మా’ టి.వి. నిర్వహణలో నేర్చుకున్న మేనేజ్‌మెంట్ పాఠాలను అవ్యవస్థీకృతంగా ఉన్న మన సినీ రంగంలో కూడా అమలు చేయాలని భావిస్తున్నాను’’ అని ‘మా’ టి.వి. బోర్డు డెరైక్టర్లలో ఒకరైన నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ -‘‘ఇంతకాలం సినిమాలతో మిమ్మల్ని అలరించిన నేను బుల్లితెరవైపు ఎందుకు దృష్టిసారించాను? అనే ప్రశ్న మీ అందరికీ కలగొచ్చు.
సామాన్యులతో సహా ప్రతి ఒక్కరికీ కలలుంటాయి. వాటిని నిజం చేసుకోవాలని ఉంటుంది. దాన్ని నెరవేర్చడానికే నేను ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారాను. అయితే... ఈ భారాన్ని మోయడం అంత తేలికైన విషయం కాదు. నిద్రపోతుంటే కలలో కూడా ప్రశ్నలు, సమాధానానే వినిపిస్తున్నాయి’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అమల, ఈ గేమ్ షో రూపకర్తల బృందమైన సిద్దార్ధబసు, అనిత బసు, షెనాయ్ తదితరులు పాల్గొన్నారు.
‘ఇది నాకు కూడా ఓ సవాల్’ - నాగార్జున
కార్యక్రమంలో భాగంగా విలేకరులు సంధించిన ప్రశ్నలకు నాగార్జున చెప్పిన సమాధానాల్లో కొన్ని...
ఇది నాకు కొత్త అవతారం. అయితే.. ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ ద్వారా అమితాబ్ వేసిన ముద్ర చెరిగిపోయేది కాదు. ఆయన అంత కాకపోయినా... ఆయన దరిదాపులకు వెళ్లేలా ప్రయత్నం చేస్తా. ఈ కార్యక్రమం ఓ విధంగా నాకు కూడా సవాల్. దీన్ని చేయడం అంత తేలికైన విషయం కాదని ఒప్పుకున్న తర్వాత తెలిసింది. ప్రస్తుతం ప్రాక్టీస్‌లో ఉన్నా.
ప్రముఖుల కన్నా... సామాన్యులకే ఈ కార్యక్రమం విషయంలో పెద్ద పీట వేయడం జరుగుతుంది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మేం సూచించే టోల్ ఫ్రీ నంబర్‌ల ద్వారా, ఇంటర్‌నెట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాం. అడపాదడపా సెలబ్రిటీలు కూడా పాల్గొంటారు. అయితే... అదంతా చారిటీలో భాగం మాత్రమే.
ఈ కార్యక్రమం నాకు ప్లస్ అవుతుందా, నేను ఈ కార్యక్రమానికి ప్లస్ అవుతానా అంటే... అది పరస్పరం ఉపయోగకరం. చేసేవాణ్ణి, చూసేవాణ్ణి కూడా పూర్తిగా లీనం చేసుకునే కార్యక్రమం ఇది. దీని ద్వారా నా సొంత శైలిని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తా.నాన్నకు అమితాబ్ అంటే చాలా ఇష్టం. చాలా విషయాల్లో ఆయనను మెచ్చుకునేవారు. ఈ రోజు మన మధ్య లేకపోయినా... పై నుంచి నాన్న ఆశీస్సులు నాకు ఉంటాయి. టీవీలో ఈ గేమ్ షో ప్రసారం ఎప్పుడు మొదలవుతుందా అని నేను కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను.
అమితాబ్ బాటలో... బుల్లితెరపై నాగ్
Published Fri, Apr 18 2014 11:29 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
Advertisement