నీ దూకుడు సాటెవ్వరూ..!
‘ఈ నగరానికి ఏమైంది? ఒక వైపు నుసి... ఒక వైపు పొగ...’ తెలుగునాట థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేవారందరికీ సుపరిచితమైన ధూమపాన వ్యతిరేక ప్రచార ప్రకటన ఇది. ఇప్పుడు ప్రేక్షకులతో పాటు తెలుగు సినీపరిశ్రమ వర్గీయులందరి మదినీ తొలిచివేస్తున్న ప్రశ్న - ‘ఈ చలనచిత్ర సీమకు ఏమైంది? దాదాపుగా వారానికి ఒకరుగా వెంట వెంటనే ఎంతోమంది ప్రముఖులను పోగొట్టుకుంటున్నాం’ అని! సంగీత దర్శకుడు చక్రి , దర్శకుడు కె. బాలచందర్, రచయిత గణేశ్ పాత్రో, నటుడు ‘ఆహుతి’ ప్రసాద్, నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్... ఇప్పుడు నటుడు ఎమ్మెస్ నారాయణ... నిండా నెలరోజుల్లోనే ఆరుగురు ప్రముఖులు దూరమయ్యారు.
సంక్రాంతి సందర్భంగా సొంత ఊరు వెళ్ళి, అక్కడ తీవ్ర అనారోగ్యం పాలైన ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూయడంతో - ఈ చలనచిత్ర నగరానికి ఏ శాపం తగిలిందంటూ అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కెరీర్‌లోనే కాదు... ఆఖరికి కన్నుమూయడంలోనూ తొందరపడి దూకుడు ప్రదర్శించిన ఎమ్మెస్ మరణంతో కామెడీ కన్నీళ్ళు పెడుతోంది.
‘‘నువ్వు హీరోవంటే ఎలా నమ్మావ్ రా కళ్ల కింద క్యారీ బ్యాగ్‌లు వేసుకుని’’ అని బ్రహ్మానందం అంటే ‘‘గ్రాఫిక్స్‌లో తీసేస్తారేమో అనుకున్నా’’అని అమాయకంగా చెప్పి, ‘దూకుడు’ చిత్రంలో కడుపుబ్బ నవ్వించిన కామెడీ యాక్టర్ ఎమ్మెస్ నారాయణ ఉరఫ్ మైలవరపు సూర్యనారాయణ.
సమకాలీన నటుల్లో తాగుబోతు క్యారెక్టర్లకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన నటుడు ఎమ్మెస్ ఇలా తెరపై పూయించిన నవ్వులు ఎన్నో. ‘‘నిద్రపోయేటప్పుడే విశ్రాంతి తీసుకో... మెలకువగా ఉండి పడుకోవద్దు ’’ అని తండ్రి చెప్పిన సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న ఒకప్పటి లెక్చరర్ సినీ రచయితగా ప్రారంభించి, నటుడిగా నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 1951 ఏప్రిల్ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో పుట్టిన ఎమ్మెస్ వ్యవసాయ కుటుంబీకులు.
తెలుగంటే మక్కువ...
తెలుగంటే ఎంతో ఇష్టమున్న ఎమ్మెస్ ‘భాషా ప్రవీణ ’ కోర్సులో చేరారు. అది పాసయ్యాక దగ్గర్లోని ఊళ్లోని ఓ హైస్కూల్‌లో తెలుగు పండి ట్‌గా పనిచేశారు. చదువుకొనే రోజుల్లోనే 1971లో తమ కాలేజీ లెక్చరర్ పరుచూరి గోపాలకృష్ణ రాసిన ‘సోషలిజం’ అనే నాటకంలో కథానాయకుడిగా నటించారు. పెన్నుతోనూ ప్రాణాలు కాపాడవచ్చన్న ఒకే ఒక్క ఆశయంతో 1977నాటి దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకోవడానికి ‘జీవచ్ఛవం’ అనే నాటిక రాసి, స్కూల్ పిల్లలతో వేయించారు.
అలా చందాలు పోగుచేసి తన వంతు సాయం చేసిన ఉదార మనస్తత్త్వం ఎమ్మెస్‌ది. ఆ తరువాత ఆయన భీమవరం కాలేజీలో లెక్చరర్‌గా చేశారు. అక్కడ విద్యార్థులతో వేయించిన నాటకాలకు ప్రైజులు కూడా రావడంతో మంచి పేరు వచ్చింది. ‘‘మా నారాయణ మాస్టార్’’ అనిపించుకుని అభిమానానికి పాత్రుడయ్యారు.
భార్య ప్రోత్సాహంతో సినిమాల్లోకి....
ఉద్యోగం చేస్తుండగానే కథలు రాయడం మొదలుపెట్టారు. భార్య కళాప్రపూర్ణ ప్రోత్సాహంతో శనివారాలు సర్కారు ఎక్స్‌ప్రెస్ ఎక్కి మద్రాసు వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయే సరికి ఉద్యోగానికి ‘లాస్ ఆఫ్ పే’ పెట్టి మద్రాసులోనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలోనే ‘పేకాట పాపారావు’, ‘హలో నీకు పెళ్లంట’,‘ ప్రయత్నం’, ‘అలెగ్జాండర్’ చిత్రాలకు కథలందించారు. ఎమ్మెస్ ఒకేరోజు ఏడుసార్లు కథ చెప్పిన రోజులున్నాయి.
సీరియల్ రైటర్‌గా..
మేకప్‌మేన్ జాస్తి మాధవరావు టీవీ సీరియల్‌కు కథ రాసే అవకాశం వచ్చింది. వెంటనే ఒప్పుకొని ‘నారీమణిహారం’ పేరుతో స్త్రీ జీవితంలోని ముఖ్యఘట్టాలను 13 ఎపిసోడ్లుగా రాసి ఇచ్చారు. ఎమ్మెస్ ప్రతిభ చూసి ముచ్చటపడిన మాధవరావు ఆయనను నటుడు మురళీమోహన్‌కు పరిచయం చేశారు. ఆయన ఓ ఎపిపోడ్ కథ విని ఎమ్మెస్‌కు వెంటనే చాన్స్ ఇచ్చారు. కానీ అప్పుడే తండ్రి చనిపోవడం ఎమ్మెస్ జీవితంలో పెద్ద విషాదం.
తరువాత మళ్ళీ మద్రాసు వెళుతూ, రాత్రి సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాసుకున్న ‘సవ్యసాచి’ కథ మురళీమోహన్‌కి వినిపించారు. ‘అది బాగా నచ్చింది కానీ, ఇంత మంచి కథకు నేను సరిపోను’ అని మురళీమోహన్ వెనక్కు తగ్గారు. అది రవిరాజా పినిశెట్టి చేతుల్లోకి వెళ్లింది. కానీ రవిరాజా ‘చంటి’ సినిమాతో బిజీ కావడంతో ‘సవ్యసాచి’ తెరకెక్కలేదు.
రవిరాజా పరిచయంతో...
ఎమ్మెస్ కథలు చెప్పే విధానం నచ్చడంతో దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఆయనలో మంచి నటుడు దాగున్నాడని పసిగట్టారు. ‘ఎమ్. ధర్మరాజు ఎంఏ’లో చెవిటి వాడి పాత్రతో తొలి అవకాశమిచ్చారు. కాలక్రమంలో హాస్యనటుడిగా, ముఖ్యంగా తాగుబోతు పాత్రలకూ, పేరడీ రోల్స్‌కూ మారుపేరుగా నిలిచారు. ఆయన కామెడీకి వరుసగా ఐదు సార్లు (‘మా నాన్నకు పెళ్లి’ (1997), ‘రామసక్కనోడు’ (1999), ‘సర్దుకుపోదాం రండి’ (2000), ‘శివమణి’’ (2003), ‘దూకుడు’ (2011) చిత్రాలకు) నంది అవార్డులు అందుకున్నారు.
‘దూకుడు’ చిత్రానికే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తాగుబోతు పాత్రలలో ఆయన నటించిన తీరు నిజంగా అద్భుతం. కెరీర్‌లోని 700కు పైగా చిత్రాల్లో సుమారు 200 సార్లు తాగుబోతు పాత్రలు పోషించి, ప్రతిసారీ మెప్పించారు. నవ్వించడమే కాక, గుండెలు పిండే పాత్రలతో కన్నీళ్లు కూడా పెట్టించారాయన. ‘పిల్ల జమిందార్’ చిత్రంలో తెలుగు మాస్టారు పాత్ర అందుకు ఒక మచ్చుతునక.
దర్శకుడిగా....
స్వయానా రచయిత, నటుడైన ఎమ్మెస్ దర్శకుడిగానూ ప్రయత్నించారు. ఏకైక కుమారుడు విక్రమ్ కుమార్ హీరోగా ‘కొడుకు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం ఆయనను ఆర్థికంగా బాగా దెబ్బతీసింది. ఆ తరువాత శివాజీ నటించిన ‘భజంత్రీలు’ అనే మరో చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఆయన కుమార్తె శశికిరణ్ సైతం ఇటీవలే ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకురాలయ్యారు.
పిల్లలు స్థిరపడాలంటూ చివరి వరకు ఆయన పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. అయితే, అలవాట్ల విషయంలో అజాగ్రత్త, ఆరోగ్యంపై చూపిన అశ్రద్ధ ఎమ్మెస్‌ను అర్ధంతరంగా 63 ఏళ్లకే మింగేశాయి. తెలుగు తెరపై నవ్వులు పూయించిన ఈ తెలుగు మాస్టారి హఠాన్మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
విచిత్రం ఏమిటంటే, ఎమ్మెస్ కన్నుమూసిన శుక్రవారం ఉదయమే విడుదలైన ‘పటాస్’ చిత్రంలోనూ ఆయన ఒక పేరడీ హీరోగా నటిస్తే, ఆయన కుమారుడు విక్రమ్ దర్శకుడిగా తండ్రితో కలిసి ఒక షాట్‌లో కనిపిస్తారు. ఆ చిత్రం క్లైమాక్స్‌లో ‘సునామీ స్టార్ సుభాష్’ పాత్రలో ఎమ్మెస్ నారాయణ యాదృచ్ఛికంగా చెప్పిన ఆఖరి డైలాగ్ కూడా ‘ఈ నగరానికి ఏమైంది?...’ అన్నదే! చనిపోయిన రోజు కూడా థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిన ఆ హాస్య సంజీవికి చెమర్చిన కళ్ళతో శ్రద్ధాంజలి!