ఇప్పటికీ నాతో ఆ పాట పాడించుకుంటూ ఉంటారు!
రావు బాలసరస్వతి, తొలితరం సినీ, లలిత సంగీత గాయని - నటి
రజనీకాంతరావు గారి పేరు చెప్పగానే సినిమాల్లో, రేడియోలో ఆయన చేసిన కృషి, ఆయన రచనలు, నేను పాడిన పాటలు అన్నీ గుర్తుకువస్తాయి. ఇప్పటికి 75 ఏళ్ళ క్రితం నుంచి ఆయన మాట, పాట - అన్నీ పరిచయమే. నా కన్నా ఆయన ఎనిమిదిన్నరేళ్ళు పెద్ద. ఆ రోజుల్లో ఆయన సంగీతం కూర్చిన సినిమాల్లో నేను పాడింది తక్కువే అయినా, ఆ పాటలకు మంచి పేరు రావడం ఇప్పటికీ సంతోషం అనిపిస్తుంటుంది. ప్రసిద్ధ దర్శక - నిర్మాత వై.వి. రావు ‘మానవతి’ చిత్రానికి రజని సంగీత దర్శకుడు. ఆయన స్వీయ సాహిత్య, సంగీతాల్లో ఆ సినిమాకు తయారైన పాటల్లో నేను పాడిన ‘తన పంతమె తావిడువడు...’ ఇవాళ్టికీ ఆ తరం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు.
ఆ పాటకు రజనీ బాగా వరుస కట్టారనీ, నేను బాగా పాడాననీ పేరొచ్చింది. తరువాత గోపీచంద్ దర్శక త్వంలో జగ్గయ్యతో రూపొందిన ‘ప్రియురాలు’ చిత్రానికీ రజని సంగీత దర్శకులు. దానికి ఆయన చేసిన వరుసల్లో నేనూ పాడాను. అయితే, రజనీ గారు సినిమాల్లో స్థిరపడలేదు. ఆకాశవాణిలో ఆయన సంగీత, సాహిత్య ప్రాభవం ఎక్కువగా బయటకు వచ్చింది. ఆయన రేడియో కోసం రాసి, బాణీ కట్టిన పాటలు కూడా పాడాను. ఆ రోజుల్లో సాలూరి రాజేశ్వరరావు గారు, నేను కలసి చాలా లలిత గీతాలు పాడేవాళ్ళం.
రజని రాసిన ‘కోపమేల రాధ... దయ చూపవేల నాపై...’ పాట కూడా రాజేశ్వరరావు, నేను పాడితే రికార్డుగా వచ్చింది. దానికి, రాజేశ్వరరావు సంగీతం కూర్చారు. వ్యక్తిగతంగానూ రజని చాలా నెమ్మదైన వ్యక్తి. మంచి మనిషి. ఎంతో ప్రతిభ ఉన్నా, దాన్ని తలకెక్కిం చుకోని మనిషి. గాయకులకు చక్కగా పాట నేర్పేవారు. రచయిత, సంగీత దర్శకుడే కాక గాయకుడు కూడా కావడం ఆయనలోని మరో పెద్ద ప్లస్ పాయింట్. పాట నేర్పేటప్పుడు తానే పాడి వినిపిస్తారు. గాయకులు తమ గాత్రధర్మా నికి తగ్గట్లుగా స్థాయిని మార్చు కొని, పాటను అనువుగా మలుచుకొని పాడినా ఏమీ అనేవారు కాదు.
ఆకాశవాణి స్టేషన్ డెరైక్టరైన రజని విజయవాడలోనూ, రిటైర్మెంట్‌కు ముందు బెంగుళూరులోనూ ఉన్న ప్పుడు నన్ను ప్రత్యేకించి అక్కడకు పిలిపించి మరీ, లలితగీతాలు పాడించారు. అది ఆయన మంచితనం. ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం కూడా ఆయన రచించి, ట్యూన్ చేసిన ‘విరహా నలంపు బాధ భరియింప లేదు రాధ’ అన్న గీతాన్ని ‘ఈ మాసపు పాట’గా రేడియో కోసం పాడా. రచన, బాణీ ఆయనదే అయినా, నా గాత్రధర్మానికి తగ్గట్లుగా కొద్దిగా మార్చుకొన్నా. ఆయన కోపగించకపోగా, ప్రోత్సహించారు. ఇప్పటికీ ఆయన దగ్గరకు ఎప్పుడు వెళ్ళినా, నాతో ఆ పాట పాడించు కొంటారు. సాహిత్య, సంగీత జీవులకు అంతకన్నా ఆనందం ఏముంటుంది!