'పెద్ద రాష్ట్రంలో పాగా'కు కాంగ్రెస్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సరిగ్గా మరో తొమ్మిది నెలలు.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ గడువు ముగిసేందుకు మిగిలి ఉన్న సమయం. 2017లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచు కోవడం ద్వారా 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపును దాదాపు ఖరారు చేసుకోవచ్చని అన్ని పార్టీలూ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ యూపీ వ్యవహరాల ఇన్ చార్జిగా గులాం నబీ ఆజాద్ ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 2017లోనే ఎన్నికలు జరగనున్న మరో రాష్ట్రం ఉత్తరాఖండ్ విషయంలోనూ ఈ మార్పు చోటుచేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి కమల్ నాథ్ ను ఉత్తరాఖండ్ ఇన్ చార్జిగా నియమితులయ్యారు.
మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పుదుచ్చేరిలో అధికార కైవసం, తమిళనాడులో డీఎంకేతో పొత్తు తదితర వ్యవహారాలను చక్కగా చక్కబెట్టి అధినేత్రి ప్రశంసలు పొందిన గులాం నబీ ఆజాద్.. యూపీలోనూ తనదైన మార్కు చూపించగలరని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త కిషోర్ కుమార్ కూడా యూపీ ఎన్నికలయ్యేంత వరకు కాంగ్రెస్ తోనే ఉండాలని నిర్ణయించుకోవడం, ఆయన సూచనల మేరకు పొత్తుల ఎత్తుల్లో ఆరితేరిన ఆజాద్ లాంటి ఇన్ చార్జిలుగా నియమితం కావడంతో యూపీ కాంగ్రెస్ శ్రేణులకు గెలుపుపై కాస్త ధీమా పెరిగినట్లయింది.
మొత్తం 431 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ.. దాదాపు పార్లమెంట్ ను తలపిస్తుంది. అక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాందీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు కూడా ఉత్తర ప్రదేశ్ నుంచే గెలుపొందిన సంగతి తెలిసిందే. 2017లో యూపీ, ఉత్తరాఖండ్ సహా కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్ లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.