రగులుతున్న మథుర
హింస మృతులు 24
- ఎస్పీ, ఎస్‌హెచ్‌ఓతో పాటు 22 మంది ఆందోళనకారులు మృతి
- 260 ఎకరాల్ని స్వాధీనం చేసుకుంటుండగా హింస
- పోలీసులపై దాడులకు తెగబడ్డ ఆక్రమణదారులు
- యూపీ నుంచి నివేదిక కోరిన కేంద్రం.. విచారణకు సీఎం అఖిలే శ్ ఆదేశం
- సూత్రధారి ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’
మథుర: పోలీసులు, ఆక్రమణదారుల మధ్య కాల్పులతో ఉత్తరప్రదేశ్‌లోని మథుర మరుభూమిని తలపించింది. ఆక్రమణల తొలగింపుతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ హింసలో మృతుల సంఖ్య 24కు చేరగా.. మథుర సిటీ ఎస్పీతో పాటు ఎస్‌హెచ్‌ఏ(సీఐ స్థాయి అధికారి) ప్రాణాలు కోల్పోయారు. ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’కి చెందిన 22 మంది ఆందోళనకారులూ మృతిచెందారు. పోలీసులు పెద్ద మొత్తంలో మారణాయుధాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 320 మందిని అరెస్టు చేశారు.
సంఘటనపై ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ డివిజినల్ కమిషనర్‌చే విచారణకు ఆదేశించారు. మథుర జవహర్‌బాగ్‌లోని 260 ఎకరాల్లో 3 వేల మంది రెండేళ్లుగాఅక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల్ని తొలగిస్తుండగా ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. ఘటనపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. రాష్ట్రానికి అవసరమైన సాయం చేస్తామని యూపీ సీఎంకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీనిచ్చారు. యూపీ డీజీపీ జావెద్ అహ్మద్ కథనం ప్రకారం... ఆక్రమణల తొలగింపులో భాగంగా గురువారం పోలీసులు రెక్కీ నిర్వహించడానికి వెళ్లగా ఎలాంటి కవ్వింపు లేకుండానే ఆక్రమణదారులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని చెప్పారు.
రెండు షెల్టర్లను తొలగించిన అనంతరం ఆందోళనకారులు గ్యాస్ సిలిండర్లతో పాటు, ఆయుధాల నిల్వలకు నిప్పంటించడంతో భారీ పేలుళ్లు సంభవించాయని, ఈ విధ్వంసంలో మథుర సిటీ ఎస్పీ ముకుల్ ద్వివేది, ఎస్‌హెచ్‌ఓ(ఫరా) సంతోష్ యాదవ్‌లు మరణించారన్నారు. 22 మంది ఆక్రమణదారులు కూడా మరణించారని, ఆందోళనకారుల మంటల వల్లే 11 మంది చనిపోయారని డీజీపీ తెలిపారు. 23 మంది పోలీసు సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 47 గన్‌లు, ఆరు రైఫిల్స్, 178 చేతి గ్రనేడ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు, మరో 196 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామన్నారు. నక్సల్స్ ప్రమేయం ఉందన్న కోణంలోను విచారణ చేస్తామన్నారు.
నిఘా వైఫల్యం కొంత కారణం: అఖిలేశ్
మథుర హింసలో అమరులైన పోలీసుల కుటుంబాలకు సీఎం అఖిలేష్ రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు. బారాబంకిలో సీఎం అఖిలేశ్ మాట్లాడుతూ.. గతంలో పలుమార్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఆక్రమణదారులతో చర్చించారని, స్వాధీనం చేసుకునేటప్పుడు ఎన్నో సార్లు పోలీసులు హెచ్చరికలు చేశారని చెప్పారు. అధికార యంత్రాంగంతోపాటు, నిఘా వైఫల్యం కూడా కొంత ఉందన్నారు. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యముందని కేంద్ర మంత్రి రిజుజు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేందుకు ఈ సంఘటనే నిదర్శనమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఎవరీ ఆందోళనకారులు?
‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’... బాబా జైగురుదేవ్ నుంచి వేరు పడి ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరులుగా చెప్పుకునే ఈ గ్రూపు విచిత్రమైన డిమాండ్లతో రెండేళ్ల క్రితం ధర్నా చేపట్టి జవహర్ బాగ్‌లోని 260 ఎకరాల్ని ఆక్రమించింది. రాష్ట్రపతి, ప్రధాని కోసం ఎన్నికలను రద్దుచేయాలని, ప్రస్తుత కరెన్సీ స్థానంలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ కరెన్సీనీ ప్రవేశపెట్టాలని, రూపాయికి 60 లీటర్ల పెట్రోల్, అలాగే రూపాయికే 40 లీటర్ల డీజిల్ అమ్మాలంటూ వీరు డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణల్ని తొలగించేందుకు గతంలో పలు ప్రయత్నాలు సాగినా అవి ఫలించలేదు. రామ్ వ్రిక్ష యాదవ్, చందనా బోస్, గిరిష్ యాదవ్, రాకేష్ గుప్తాలు ప్రధాన కుట్రదారులని, వారు బతికుంటే సజీవంగా పట్టుకుంటామని యూపీ డీజీపీ వెల్లడించారు. ఆక్రమణదారులు చేతి గ్రనేడ్లతో పాటు ఆటోమెటిక్ ఆయుధాలతో చెట్లపై నుంచి కాల్పులు జరిపారన్నారు.