వెన్నెల కురిపించిన ‘మండే సూర్యుడు’
‘అందమైన పొయెం అంటే/ దానికొక గుండె ఉండాలి/ అది కన్నీ ళ్లు కార్చాలి/ కాలపు బరువుల్ని మోయాలి/ బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కావాలి/ పద్యం మనిషి విజయానికి ఒక జెండా అయి ఎగరాలి.’ కవిత్వమంటే ఇది గుంటూరు శేషేంద్రశర్మ దృష్టి. భార తీయ సాహిత్యంలోనే శేషేంద్ర స్థానం ప్రత్యేకమైనది. కాలతత్వం గ్రహించి, అక్షరాలలో ‘కాలరేఖ’ను చిత్రించిన ద్రష్ట ఆయన. శేషేం ద్ర నినాద కవి కాదు. విధివిధాన కవి. శిథిల జీవుల కోసం శిరస్సు ఎత్తిన కవితా శివుడు. భారతీయ అలంకార శాస్త్రాల మీద అపారమైన అధికా రంతో, తనదైన ముద్రను సృష్టించుకుని, ఆ ముద్రతోనే కవితా జైత్రయాత్రను సాగించిన కవి ఆయన. ‘ఆధునిక మహాభారతం’, ‘జనవంశమ్’,(కవిత్వం) ‘ఈ నగరం జాబిల్లి’ (గజల్‌ను పరిచయం చేసే అద్భుత వ్యాసం), ‘మబ్బుల్లో దర్బారు’ (నాటిక), ‘కవిసేన మేనిఫెస్టో’, ‘షోడశి’ (రామాయణ రహస్యాలు), ‘కాలరేఖ’ (విమర్శ) వంటి అద్భుత రచనలు ఆయన తెలుగువారికి అందిం చారు. శేషేంద్ర లేఖలు మరో రమణీయ సృష్టి. ‘ఉత్తరం విప్పాను.. వెన్నెల జల జల రాలింది’ అంటూ ఆరంభమయ్యే ఈ లేఖా సాహిత్యం తెలుగు సాహి త్యంలోనే అపురూపం.
‘నేనెప్పుడు గొంతెత్తినా నా కోసం కాదు, ఐదు కోట్ల మంది కోసం, యాభై కోట్ల మంది కోసం గొంతెత్తాను. నేను పడుతున్న బాధలే నా దేశం పడుతోంది. కనుకనే నా జ్వాలిక, నా దేశపు నాలుక’ అన్నారాయన. తనకున్న అశాంతిని సముద్రపరంగా చెప్పిన ప్రజ్ఞ ఆయన సొంతం. ‘సముద్రాన్ని అడు గు, నీకెందుకింత అశాంతి ఆవేశం అని! ఝంఝామారుతాన్ని అడు గు నీకెందు కంత ఆవేశం అని!’ అంటూ వ్యథను ఝరీవేగంతో కవి త్వీకరించారు. అనలం కురింపించినా అమృతం కురిపించినా ఆనం దం, సందేశం, రసోదయం కవిత ల ఉద్దేశంగా ఉండేటట్టు జాగ్రత్త పడిన కవివరేణ్యుడు శేషేంద్రుడు. కలాన్ని గ్రీష్మంలో ముంచి రాయ గలిగిన ఈ కవే, ‘లిల్లీలు పెదవులు విప్పాయి, నీ కథలు చెప్పడానికి, ఆకులు గుసగుసలాడుతున్నాయి నా చెవుల్లో, నీ గుండె వ్యథలు చెప్పడానికి’ అన్నారు. కవిగా, విమర్శకునిగా, లాక్షిణికునిగా ఆయన అధిరోహించిన ఎత్తు లు అసాధారణమైనవి. కవిత్వంలో భావం, భాష పూలవనంలో ఒక దానిని ఒకటి తరుముకుంటున్న సీతాకోక చిలుకల మాదిరిగా ఉండాలంటారాయన. ‘నా కన్నుల మీద వాలిన సీతాకోకచిలుకలే కవితలు, కవిత్వం ఒక మెస్మరిజం, కవి కన్ను ఒక ప్రిజం. కవిత్వం అంటే స్వప్నవిద్య’ అన్నారు శేషేంద్ర. ఒక పరి శీలన ప్రకారం శేషేంద్ర సాహిత్యం ప్రాచ్యపాశ్చాత్య సంస్కృతుల కల్హారమాల. ‘హలమూ కలమూ దున్నని ధరిత్రి ధరిత్రి కాదు, మట్టి మట్టి’ అన్న శేషేంద్ర తెలుగు సాహితీ సేద్యంలో విశేష ఫలం.
(మే 29న త్యాగరాయ గానసభ, హైదరాబాద్‌లో
శేషేంద్ర 8వ వర్ధంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా)
వీఎస్‌ఆర్‌ఎస్ సోమయాజులు, 94411 48158