సుతిమెత్తని హృదయపు మేరునగధీరుడు
అస్తమయం
తొమ్మిదో తరగతి విద్యార్థిగా, 1947 మార్చి నవయుగలో 'ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరాయుధమోయ్' అని రాసి, ఇతరులకు ఇచ్చిన ఉద్యమ జీవిత పిలుపును ఆయన ఆ తర్వాత డెబ్భై సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడ మరిచిపోకుండా పాటించారు.
నిత్యవర్తమానమూ నిరంతర చలనశీలీ చలసాని ప్రసాద్ గురించి గతం అన్నట్టుగా రాయడమంటే విశాఖ సముద్రపు విషాదఘోష వినిపించడం తప్ప మరేమీ కాదు. ఆయనలోని ఎన్నెన్నో కోణాలను ఆయన బహుముఖ ప్రజ్ఞను చూసిన నాలుగున్నర దశాబ్దాల పరిచయంలో, స్నేహంలో, ప్రేమలో, వాత్సల్యంలో, ఆలోచనాచరణల సాహచర్యంలో ఏ శకలాన్ని తీసి చూపితే ఆయనను అర్థం చేయించగలను? విశాఖ సముద్రంలో ఏ ఒక్క అలను చూపి కడలిని రూపుకట్టించగలను? నలభై ఐదేళ్లుగా నన్నాయన పేరు పెట్టి పిలవడం కూడ దూరమే అనుకుని బాబూ అని పిలిచేవాడు. అంతరాంతర రహస్యాల్నీ, దుఃఖాల్నీ, ఆలోచనల్నీ, ఆనందాల్నీ ఎన్నిటినో పంచుకున్న ఆయనను ప్రసాద్‌గారూ అని పిలిచినా, చివరి రోజుల్లో చాదస్తం వస్తున్నదని విసుక్కున్నా ఆయన నా హృదయంలోని ఒక అవిభాజ్యమైన భాగం.
ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు. బహుశా ఆయన గురించి అలా అనుకోగలిగినవాళ్లు తెలుగు సమాజంలో కొన్ని వేలమంది ఉండి ఉంటారు. ఈ కాలంలో అజాతశత్రువులూ, అందరికీ కావలసినవాళ్లూ ఉండే అవకాశం లేదు గాని, బహుశా ఆయన అటువంటి అసాధారణ జీవి. లోకమంతా తప్పుడు మనిషని విమర్శించే మనిషిని కూడ ఆయన ‘మంచాడే’ అనగలిగేవాడు. నాకు తెలిసి ఇద్దరే ఇద్దరి పేర్లు వింటేనే అసహ్యించుకునేవాడు తప్ప ఆయన తప్పుపట్టిన మూడో మనిషి పేరు నేను వినలేదు. తనకు ద్రోహం చేసినవాళ్లను కూడ ఆ ద్రోహం ఆనవాలు కూడ తాను చూడలేదన్నంతగా ప్రేమించాడు. కృష్ణా జిల్లా దివి తాలూకా నాదెళ్లవారిపాలెంలో 1932 డిసెంబర్ 8న పుట్టిన చలసాని ప్రసాద్ తన ప్రాంతాన్నీ కులాన్నీ వయసునూ కూడ అధిగమించి వేలాది మందికి స్నేహం పంచాడు. వేలాది మంది ప్రేమను చూరగొన్నాడు.
ఒకవైపు తండ్రి చల్లపల్లి జమీందారు దగ్గర పనిచేస్తుండినా, 1930లలోనే కుటుంబంలోకి కమ్యూనిస్టు భావజాలం ప్రవేశించింది. అందుకే తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు, తన ఐదో ఏట, 1937 ఎన్నికల్లో భూస్వాముల జస్టిస్ పార్టీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు బలపరచిన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార ఊరేగింపులలో పాల్గొనడం తన తొలి జ్ఞాపకం. ఆ తర్వాత దశాబ్దం కృష్ణాతీరంలో మరిన్ని విప్లవ ప్రభంజనాలు వీచాయి. ఆయన కుటుంబమంతా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలై, జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో, తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమయ్యారు. ఆ ఉద్యమాల మీద కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్బంధంలో భాగంగా ఆయన పినతండ్రి జగన్నాథరావు, అన్న వాసుదేవరావు, బావ పాపారావు ముగ్గురినీ 1940 దశకం చివరిలో పోలీసులు కాల్చిచంపారు. అంటే ఆయన సరిగ్గా యవ్వన దశలో ప్రవేశిస్తున్న సమయానికే ఆయన ఏ మార్గంలో నడవవలసి ఉన్నదో నిర్ణయమైపోయింది. తొమ్మిదో తరగతి విద్యార్థిగా, స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యుడిగా, 1947 మార్చి సంచిక నవయుగలో ‘ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరాయుధమోయ్’ అని రాసి, ఇతరులకు ఇచ్చిన ఉద్యమ జీవిత పిలుపును ఆయన ఆ తర్వాత డెబ్భై సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడ మరిచిపోకుండా పాటించారు.
ఆ ఉద్యమ జీవితమే ఆయనను సహజంగా సాహిత్యాభిమానంలోకి, సాహిత్యంలోకి నడిపించింది. 1955 ఎన్నికల ప్రచారంలో శ్రీశ్రీని వెన్నంటి ఉన్న సహచరుడిగా ఆయన శ్రీశ్రీకి అత్యంత సన్నిహితుడయ్యారు. శ్రీశ్రీ స్వయంగా ‘నా ఏకైక కైక’ అని సంబోధిస్తూ ప్రసాద్‌కు ఉత్తరాలు రాసేవారంటే, వాళ్లిద్దరి అవినాభావ సంబంధం అర్థమవుతుంది. ఈ ఉద్యమ జీవితం వల్ల నియతమైన చదువు సాగకపోయినా ప్రాచీన, ఆధునిక సాహిత్యమంతా ఆయనకు మేధలో మాత్రమే కాదు, హృదయమంతా నిండింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నోటిమీద పలికే ధారణాశక్తీ వచ్చింది. ఆయన సొంత గ్రంథాలయం బహుశా తెలుగు సమాజంలో వ్యక్తిగత గ్రంథాలయాలలో అతిపెద్ద వాటిలో ఒకటి కావచ్చు. నియతమైన చదువు లేకపోవడం వల్ల కాజీపేట రైల్వేస్టేషన్ క్యాంటీన్‌లో ఉద్యోగం దగ్గరి నుంచి మిత్రులు తీసిన సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ దాకా అనేక ఉద్యోగాలు చేసి చిట్టచివరికి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకుని 1960ల చివర విశాఖపట్నం మిసెస్ ఏవీఎన్ కాలేజీలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా చేరి, మూడు దశాబ్దాలకు పైగా అక్కడే ఉన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధపోరాట కాలం నుంచీ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సుందరయ్య, బసవపున్నయ్య వంటి ఎందరితోనో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, 1960ల మధ్య కాజీపేటలో ఉన్న రోజులనుంచే ఆయన కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి ఆలోచనలకు దగ్గరయ్యారు. ఇక విశాఖపట్నం జీవితం, పొరుగున ఉన్న శ్రీకాకుళ విప్లవోద్యమంతో, నక్సల్బరీతో సంబంధాన్ని ఇచ్చింది. శ్రీశ్రీ అరవయ్యో పుట్టినరోజు సందర్భంగా ‘రచయితలారా, మీరెటువైపు’ అని విశాఖ విద్యార్థులు విసిరిన సవాలులో, ఆ సవాలుకు ప్రతిస్పందనగా జరిగిన పరిణామాలలో, శ్రీశ్రీని విప్లవ రచయితల సంఘం వైపు తీసుకురావడంలో చలసాని ప్రసాద్ పాత్ర ఇంకా పూర్తిగా చరిత్రకు ఎక్కవలసే ఉంది.
ఆయనే చాలాసార్లు 1970 గురించి చెపుతూ రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు ఆ తర్వాత గడిచిన నలభై ఐదు సంవత్సరాలలో ఆయన ఇంకా ఎక్కువ చరిత్రను రచించారు, చరిత్రను నిర్మించారు. శ్రీశ్రీ సమగ్ర సాహిత్యం ఇరవై సంపుటాలనూ, కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సర్వస్వం పద్దెనిమిది సంపుటాలనూ ఒక్కచేతిమీద ప్రచురించడంలోగాని, వక్తగా, కార్యకర్తగా, నాయకుడిగా, సాహిత్య ప్రేమికుడిగా, పుస్తక ప్రేమికుడిగా, స్నేహశీలిగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ వేలాది మంది హృదయాలలో తన సుతిమెత్తని హృదయంతో, నిరాడంబర ఆత్మీయతతో విద్యుత్తేజం నింపడంలో గానీ ఆయన మేరునగధీరుడు. మరొక కమ్యూనిస్టు సంప్రదాయపు కుటుంబం నుంచి వచ్చిన సహచరి విజయలక్ష్మి ఒక దశాబ్దం కింద మరణించినా పుస్తకాలతో, స్నేహితులతో, విశాఖ సమాజంతో కొనసాగిన ఆయన సాహచర్యం శనివారం ఉదయం ముగిసిపోయింది.
ఎన్.వేణుగోపాల్
(వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు).