నేడు గురజాడ 100వ వర్ధంతి
రాజభవనాల గోడల్లో వేలాడుతున్న కవితా కన్యకను భుజాన ఎత్తుకొని జనం దగ్గరకు తెచ్చిన మహాకవి గురజాడ. అంధ విశ్వాసాలపై సాహిత్యాన్ని పాశుపతాస్త్రంగా ప్రయోగించిన ఆయన గిడుగును స్ఫూర్తిగా తీసుకొని వ్యవహారిక భాషకు పెద్ద పీట వేశారు. మనిషి చేసిన రాయిరప్పకు, మహిమ కలదని సాగి మొక్కుతు మనిషి అంటే రాయిరప్పల కన్న కనిష్టంగా చూస్తావేమి బాలా... అనీ, దేశమంటే మట్టికాదోయ్, దేశమం టే మనుషులోయ్... అనీ ఎలుగెత్తారు. మంచి అన్నది మాల అయితే మాలనే నగుదున్.. అంటూ వర్ణవ్యవస్థపై తిరుగు బాటు బావుటా ఎగరేశారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యక, లవణ రాజుకల... లాంటి అద్భుతమైన కవితలు ఆయన రాసి నా, వీటిలో ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ ఓ ఆణిముత్యంగా నిలు స్తుంది. బాల్యవివాహాలను అరికట్టాలనే ధ్యేయంతో రాసిన కథా గేయం ఇది.
ఆ రోజుల్లో పెళ్లీడు ఆడపిల్లలను కాసులకు కక్కుర్తిపడి వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవారు. కాటికి కాలు చాచిన వృద్ధులు పెళ్లయిన కొన్నాళ్లకే మరణించడంతో వారంతా జీవి తాంతం వితంతువులుగా మిగిలేవారు. ఈ నేపథ్యంలో గుర జాడ రాసిన పూర్ణమ్మ కథ సమాజాన్ని ఓ కుదుపు కుదిపింది. ఈ కవితలోని చరణాలను చదువు తున్నప్పుడు ఎం తటి కఠిన హృదయుడైనా కన్నీరు పెట్టుకుంటాడు. కరుణ రసాత్మకమైన ఈ ఖండకావ్యం గురజాడకు ఎన లేని ఖ్యాతి తెచ్చిపెట్టింది. పూర్ణమ్మ లేత హృదయం లో విజృంభించి, విశృంఖల విహారం చేసిన తీవ్రవే దనను అలతి, అలతి పదాలలో వ్యక్తీకరించిన తీరును మరువలేం. ‘కన్యక’ కవితలో గృహహింసకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని పిలుపునిచ్చింది ఆయనే. స్త్రీకి విద్య అవ సరమని చెబుతూ ‘దిద్దుబాటు’ అనే మినీ కథను రాశారు.
ఆయన రాసిన అత్యుత్తమ నాటకం ‘‘కన్యాశుల్కం’’. ఈ నాటకంలో మధురవాణి, గిరీశం, రామప్ప పంతులు, అగ్నిహో త్రావధానులు, కరటకశాస్త్రి పాత్రల్లో మన చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరు తారసపడుతుంటారు. మనుషుల్లోని చెడునంతా బట్టబయలు చేసి మంచిమార్గం చూపెట్టిందిది. వేశ్యలు మను షులేనని, వాళ్లని వెలివేయకుండా దారిలోకి తెచ్చి పెళ్లిళ్లు జరి పించాలని ఆ నాటకంలో సూచించారు. ఈ నాటకం లోని సంభాషణలు సూక్తులుగా, సామెతలుగా ప్రసిద్ధి కెక్కాయి. ‘‘తాంబూలాలిచ్చాం తన్నుకుచావండి’’, ‘‘ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది’’, ‘‘నాతో మాట్లాడ టమే ఒక ఎడ్యుకేషన్. మనవాళ్లు ఒట్టి వెధవాయి లోయ్’ ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటే గాని పొలిటీషియన్ కాదు’ వంటి సంభాషణలు నేటికీ చాలా మంది ఉపయోగిస్తున్నారు. ‘కన్యాశుల్కం’ రచనతో ఆంధ్రనా టక సాహిత్యంలో ఒక నూతన పంథా ప్రారంభమైంది. ఈ నాటకం జీవితమంత గొప్పదని శ్రీశ్రీ కితాబు ఇచ్చారు.
గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21న విశాఖజిల్లా రాయవరంలో జన్మించారు. 1882లో మెట్రిక్ చదువుతున్న ప్పుడు ఆంగ్లంలో ‘కకూ’ అనే గేయాన్ని రాసి ఉపాధ్యాయుల ప్రశంసలు పొందారు. 1883లో ‘సారంగధర’ అనే ఆంగ్ల పద్య కావ్యాన్ని ప్రచురించారు. విజయనగరంలో డిగ్రీ పూర్తయ్యాక, అక్కడి ఎం.ఆర్.ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. 1887లో ఆనాటి విజయనగరం సంస్థానాధిపతి ఆనందగజ పతిరాజు, గురజాడను విజయనగరం మహరాజా కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా నియమించారు. 1892లో కన్యాశుల్కం మొదటి కూర్పును విడుదల చేశారు. 1906లో బోధనా భాషగా తెలుగును అమలు చేయాలంటూ ఉద్యమించారు. అదే ఏడాది ‘కొండు భట్టీయం’ నాటకం రాశారు. 1910లో ముత్యాలసరా లు అనే నూతన ఛందస్సుకు శ్రీకారం చుట్టారు. ‘కన్యక’, ’సుభ ద్ర’ కావ్యాలను వెలయించారు. ‘దించులంగరు’, ‘నీలగిరి పాటలు’ ఆయన రాసినవే.
గురజాడ 1915 నవంబర్ 30న విజయనగరంలో తుది శ్వాస విడిచారు. గ్రాంథిక భాషకు కాలం చెల్లిపోయిందని, మంచి గతమున కొంచెమేనని, మతములన్నియు మాసిపో వును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగుననీ గుర్తించి తొలి కోడై కూసిన గురజాడ తెలుగు సాహిత్య వినీలాకాశంలో ఓ ధ్రువ తారగా నిలిచిపోయారు.
(నేడు గురజాడ 100వ వర్ధంతి)
వి.కొండలరావు పొందూరు, శ్రీకాకుళం జిల్లా