చరిత్ర ఆరాధన.. జ్ఞాపకాల ఆవాహన | Invoked the memory of the history of worship .. | Sakshi
Sakshi News home page

చరిత్ర ఆరాధన.. జ్ఞాపకాల ఆవాహన

Published Thu, Oct 9 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

చరిత్ర ఆరాధన.. జ్ఞాపకాల ఆవాహన

చరిత్ర ఆరాధన.. జ్ఞాపకాల ఆవాహన

చాలామంది రచయితల మాదిరిగా నేను ఒక్క పుస్తకాన్నే చాలాసార్లు రాశాను అంటారాయన. ఆ ఇతివృత్తంతో అంతగా మమేకమయ్యారు మొడియానో. ఇదే వాస్తవాన్ని ‘ఆయన పుస్తకాలు పరస్పరం సంభాషించుకుంటాయి, ఒక దాని ప్రతిధ్వనిని ఒకటి వింటాయి’ అని నోబెల్ స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లండ్ చెప్పారు.
 
కాలం వెలిగించిన జ్ఞాపకాలు మనిషి గుండె చిమ్నీ లోపల, తగ్గించిన ఒత్తుల్లా మినుకుమినుకుమం టూనే ఉంటాయి. అలాంటి వెలుగులలో రచనా వ్యాసంగాన్ని సాగించిన మహా రచయితలు ఎం దరో ఉన్నారు. నాజీల దురాక్రమణలలో కోల్పో యిన తన వారి అస్తిత్వం, తన జాతి నేపథ్యం; చరిత్ర విస్మరించలేని ఒక మహా ఉన్మాదం, ఇవన్నీ మిగిల్చిన విషాద జ్ఞాపకాలే చోదకశక్తులుగా రచ నలు సాగించిన మరో అద్భుత రచయిత పాట్రిక్ మొడియానో. కళా తాత్వికతలకీ, విప్లవాలకీ, ప్రపం చాన్ని కదిపి కుదిపిన సాహిత్యోద్యమాలకీ పురుడు పోసిన ఫ్రాన్స్‌లో పుట్టినవాడాయన. ఈ సంవ త్సరం సాహిత్య నోబెల్ ఆయననే వరించింది. మొడియానో మిగిలిన ప్రపంచానికి పెద్దగా తెలియ కపోయినా ఫ్రాన్స్‌లో ఆరాధనీయుడు. నరక కూపాల వంటి నాజీల మృత్యు శిబిరాలలో వినిపిం చిన నిస్సహాయ యూదుల చావు కేకలు, అపహ రణకు గురైన తమవారి కోసం జరిగిన వెతుకులాట ఆయన అక్షరాల నిండా వినిపిస్తాయి.
 మరుగున పడిన జీవితచిత్రాలను స్మృతులతో తట్టి లేపిన రచయిత మొడియానో. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు మాసాల తరువాత (జూలై 30, 1945) పుట్టిన మొడియానో, 1940-44 మధ్య ఫ్రాన్స్ హిట్లర్ దురాక్రమణ కింద ఉన్న కాలంలో నలిగిపోయిన సాధారణ జీవితాలను గురించి ప్రధా నంగా రచనలు చేశారు. తండ్రి ఇటలీకి చెందిన యూదు జాతీయుడు కాగా, తల్లి లూయిసా కొల్పైన్ బెల్జియంలో పుట్టింది. ఆమె వెండితెర మీద హాస్య నటి. కానీ ఆమె జీవితమంతా విషాదమే. ఒక కొడుకు రూడీ కేన్సర్‌తో చనిపోయాడు. భర్త యూ దు కావడం వల్ల తరచూ అజ్ఞాతంలో గడిపేవాడు. మొడియానో రచనల నిండా ఈ దుఃఖమే ఘూర్ణి ల్లుతూ ఉంటుంది. చాలామంది రచయితల మాది రిగా నేను ఒక్క పుస్తకాన్నే చాలాసార్లు రాశాను అంటారాయన. ఆ ఇతివృత్తంతో అంతగా మమేక మయ్యారు మొడియానో. ఇదే వాస్తవాన్ని ‘ఆయన పుస్తకాలు పరస్పరం సంభాషించుకుంటాయి, ఒక దాని ప్రతిధ్వనిని ఒకటి వింటాయి’ అని నోబెల్ స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లండ్ చెప్పారు. తల్లి లూయిసా స్నేహితుడు, రచయిత, మొడియానో స్కూల్లో లెక్కల మాస్టారు రేమాండ్ క్యూనాతో ఏర్పడిన సాంగత్యమే మొడియానో దృష్టిని సాహిత్యం మీదకు మళ్లించింది. 1968 నుంచి మొదలుపెట్టి, మరో పనేదీ చేయకుండా ఇప్పటి దాకా దాదాపు 40 రచనలు చేశారు. ‘నైట్ రౌండ్స్’ ఆయన తొలి రచన. కొన్ని సినిమాలకు చిత్రానువాదం కూడా చేశారు.

మొడియానో పేరు చెప్పగానే ఎవరైనా ‘మిస్సింగ్ పర్సన్’ నవలను గుర్తుకు తెచ్చుకుం టారు. దీనితో పాటు ‘ఔటాఫ్ ది డార్క్’, ‘దోరా బ్రూడర్’ కూడా ఆయనకు ఎంతో ఖ్యాతిని తెచ్చా యి. మిస్సింగ్ పర్సన్ నవలకు ప్రిక్స్ గాన్‌కోర్ట్ పుర స్కారం లభించింది. ఆయన రచనలలో ప్రధానంగా కనిపించే విస్మృతి, మూలాలను వెతుక్కుంటూ సాగడం అనే లక్షణాలు వీటిలోనూ కనిపిస్తాయి. మిస్సింగ్ పర్సన్ నవల ఇతివృత్తం, శైలి గొప్పగా అనిపిస్తాయి. గై రోలాండ్ అనే డిటెక్టివ్ కథను రచయిత ఇందులో వర్ణించారు. ఇతడు ఒక ప్రైవేటు సంస్థలో డిటెక్టివ్‌గా చేరడానికి ముందటి జీవితాన్ని మొత్తం మరచిపోతాడు. తను ఎవరో, తన జాతీ యత ఏమిటో కూడా మరచిపోతాడు. పదవీ విర మణ చేసిన తరువాత ఆ ప్రశ్నలకు జవాబులు అన్వే షిస్తూనే బయలుదేరతాడు. ఇతడు మరుపు వ్యాధికి గురైన సందర్భం మళ్లీ నాజీల దురాక్రమణ కాలమే. నిజానికి నాజీల దురాక్రమణ సమయంలో తామె వరమోనన్న సంగతిని మరుగుపరచడానికే ఎక్కువ మంది యూదులు ఇష్టపడ్డారు. నిజానికి పత్తేదార్లు ఆధారాల కోసం అన్వేషిస్తారు. కానీ గై రోలాండ్ జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళతాడు. పూర్వా శ్రమంలో తన పేరు మెక్వి అని, రష్యా నుంచి వలస వచ్చానని ఒకసారి, హాలీవుడ్ నటుడు జాన్ గిల్బర్ట్‌కు సన్నిహితుడనని ఒక పర్యాయం, లాటిన్ అమెరికాకు చెందిన దౌత్యవేత్తనని ఒకసారి భావి స్తాడు. చివరికి తాను గ్రీస్‌కు చెందినవాడిననీ, పేరు స్టెర్న్ అనీ కనిపెడతాడు.

మొడియానో పరిశోధన సాగిస్తుండగా వార్తా పత్రికలో చూసిన ఒక ప్రకటన ఇచ్చిన ప్రేరణతో ‘దోరా బ్రూడర్’ నవల రాశారాయన. 1941లో దోరా బ్రూడర్ అనే యూదు బాలిక తప్పిపోయిం దని, ఆచూకీ చెప్పవలసిందని కోరుతూ నాటి పత్రికలో వెలువడిన ప్రకటన అది. చివరికి ఈమె, తండ్రితో కలిసి ఆష్విజ్ కేంప్‌లో ఉన్నట్టు తెలుస్తుం ది. మొదటి ప్రపంచ యుద్ధం నూరేళ్ల సందర్భాన్ని ప్రపంచం జరుపుకుంటున్న సందర్భంలో రెండవ ప్రపంచయుద్ధ బాధితుడికి ఈ పురస్కారం లభిం చడం ఎంతో సబబు.
 
గోపరాజు నారాయణరావు
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement