పీడితవర్గ రచయితకు పద్మశ్రీ
కొలకలూరి ఇనాక్‌కు పద్మశ్రీ రావడం అంటే అశ్రువుకు పద్మశ్రీ రావడం... వేదనకు పద్మశ్రీ రావడం... తరతరాలుగా చెప్పుల్లేకుండా పరుగులెత్తిన పాదాలకీ సీసపుపోతతో నెత్తురు కార్చిన చెవులకీ తాటాకులు కట్టిన వీపుకీ రక్తమే చెమటగా చిందించిన మట్టి కట్టెకీ శ్రమజీవికీ బడుగుజీవికీ దళిత ఆక్రందనికీ పద్మశ్రీ రావడం. ఇది అక్షరం తనను తాను గౌరవించుకోవడం కాదు. సమాజం తనను తాను గౌరవించుకోవడం. కింద పడ్డ అన్నం ముద్దను దోసిళ్లలో అందుకొని కళ్లకద్దుకొని భుజించడం. కథకుడిగా, కవిగా, విమర్శకుడిగా, అధ్యాపకుడిగా ఇనాక్ ప్రస్థానాన్ని రెండు నెలల క్రితం ఇదే పేజీలో ప్రస్తావించింది సాక్షి. ఇనాక్‌కు సాహిత్య అకాడెమీ పురస్కారం రాకపోవడాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు అంతకు మించిన గౌరవం అందుకున్నందుకు హర్షం ప్రకటిస్తోంది.
నిలదీసే కథలు ఆయనవి
నా కన్నీళ్లే నా సాహిత్యం అని కొలకలూరి ఇనాక్ అన్నంత మాత్రాన కేవలం కష్టాలు చెప్పి, బాధలు ఏకరువు పెట్టి పాఠకుల్ని ఏడిపించడం ఆయన తన రచనా ధోరణిగా పెట్టుకోలేదు. కరుణ ఆయన సాహిత్యంలో అంతర్గతంగా ఉన్నా అది పాఠకులను ఆలోచన వైపు మళ్లిస్తుంది. పీడితులను మారుతున్న సమాజంలో భాగస్వాములను కమ్మని చైతన్యపరుస్తుంది. ఆయన పాత్రలేవీ శ్రమ నుంచి దూరం కావు. అవి పిరికివి కావు. వాటికి తామెలా ఉన్నామో, అలా ఎందుకున్నామో, తామెలా ఉండాలో, అలా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసు, లేదా తెలుసుకుంటాయి. హక్కుల సాధనను ఆయన పాత్రలు అనేక రకాలుగా చేస్తుంటాయి. కూలి రాబట్టుకోవడం, దేవాలయ ప్రవేశం, నీళ్లు సంపాదించుకోవడం, ఆకలిని తీర్చుకోవడం, మద్యపాన రుగ్మత వంటి వస్తువుల నుండి కులాంతర వివాహాల దాకా ఆయన సాహిత్య వస్తువు విస్తరించి ఉంటుంది. కంచికచర్ల కోటేశు సజీవ దహనం, రూప్‌కన్వర్ సహగమనం, ప్యాపిలి వినాయక చవితి సంఘటన వంటి నిర్దిష్ట వస్తువులు ఆయన కథలు కావడం విశేషం. నిర్దిష్టతను సంభాషణల ద్వారా, వ్యాఖ్యల ద్వారా సాధారణీకరించడం కొలకలూరికి తెలిసిన విద్య.
- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, విమర్శకులు
ఇనాక్ కథల నుంచి... పొట్ట పేగులిబ్బందిగోడు....
ఇబ్బందిగోడు మాంసం గోత్తే పెద్ద గిరాకీ. లేద్దూడల్ని, రోగం రొచ్చు లేనివాటిని, కుర్రాటిని, కొవ్వినాటిని గోత్తాడు ఇబ్బందిగోడు. పక్కూళ్ల పల్లెలోళ్లు గూడా ఆదోరవైతే అజీలుగా ఆడింటిముందు తెల్లారగట్టకే కాకులోలినట్టోలి కావుకావుమంటుంటారు. వొక్కక్కడూ రెండూ మూడూ కుప్పలెత్తుకుంటాడు. ఆల్లొత్తన్నారు గందాని ఈడు బేరం బెంచడు. కొంటన్నారు గందాని రోగిష్టోటిని గొయ్‌డు. ఆదోరం యాపారం. ఇంక వారవంతా కాళ్లారజావుక్కూకోటమే. ఉంటే కూడొండుకుంటాడు లేబోతే గంజి కాసుకుంటాడు. గంజిగ్గతిలేనోడు కాడీడు. ఆడి కొంపని గుడిసెంటే సిన్నమాట. ఇల్లంటే పెద్ద మాట. గూడంటే సరిపోద్ది. మట్టిగోడలు, తడికె తలుపు, ఒంటి నిట్టాడి, తాటాక్కప్పు, కిటికీలంటే తప్పు, బొక్కలంటే సెల్లు. తడికేత్తే ఇల్లంతా సీకటి గుయ్యారం. పొయ్యి ముట్టిచ్చకపోతే పొగులు. బెడ్డలిగిచ్చకపోతే రేత్రి. ఆడి గూట్లో కన్ను బొడసుకున్నా యేందీ కానరాదు.....
తాకట్టు.....
శాస్త్రి ఇంట్లోగాని వంటి మీద గాని విలువైన వస్తువేదీ లేదు.
‘తాకట్టు పెట్టడానికి నా దగ్గరేముంది?’
‘ఏమున్నా సరే’
‘ఏమీ లేదనేగా. ఇవ్వననరాదూ?’
‘ఇస్తానంటున్నానుగా’
‘ఏం తాకట్టు పెట్టేది?’
‘నీ జందెం’
‘జంధ్యమా?’
శాస్త్రి బిత్తరపోయాడు. తిక్కపట్టినవాడిలాగా మిత్రుడి ముఖంలోకి చూశాడు. జంధ్యం మంత్రపునీతం. ద్వితీయ జన్మం. ఉపనయన చిహ్నం. ద్విజలక్షణం. వేదవిద్యా పరిరక్షణభారం. మోక్షదాయని. శత్రు సంహారిణి, గాయత్రీ మంత్ర పరిరక్షితం. ఆలోచిస్తున్నకొద్దీ శాస్త్రికి పిచ్చెక్కుతూ ఉంది. ఓబిలేసు మాట్లాడకుండా కూర్చున్నాడు....
ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాలు: ఉత్తమమైన కవిత్వానికి ప్రతి ఏటా ఇచ్చే ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాలను 2012, 2013 సంవత్సరాలకుగాను వరుసగా రామాచంద్రమౌళి, ఈతకోట సుబ్బారావులకు ప్రకటించారు. ఫిబ్రవరి 1 సాయంత్రం చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో బహుమతి ప్రదానం.