రమణగారి సినిమా ‘కథ’
ముళ్లపూడి వెంకటరమణ జీవించి ఉండగా ఆయన ఆత్మకథ మూడు భాగాలుగా వచ్చింది. ‘కోతి కొమ్మచ్చి’, ‘ఇంకోతి కొమ్మచ్చి’, ‘ముక్కోతి కొమ్మచ్చి’... ఇవి పాఠకుల ఆదరణ పొందాయి. ఇప్పుడు ‘కొసరు కొమ్మచ్చి’ వచ్చింది. హాసం ప్రచురణల తరఫున వరప్రసాదరెడ్డి ప్రచురించారు. రమణ గురించి ఇందులో బాపూ ఇతర స్నేహితులు, సన్నిహితులు రాసిన అనేక వ్యాసాలు ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి. వీటిలో రమణ మిత్రుడు బి.వి.ఎస్.రామారావు రాసిన ఒక జ్ఞాపకాన్ని ఇక్కడ ఇస్తున్నాం. రమణగారు సినిమా కథ చెప్పడం వెనుక ఉన్న తిప్పలు తెలిపే సరదా జ్ఞాపకం ఇది.
రమణ నాతో ఎన్నోసార్లు అన్నాడు- ‘ఈ ప్రొడ్యూసర్లకీ డెరైక్టర్లకీ కథ చెప్పడం చిరాకు’ అని. ‘ఉదాహరణకి ఓ ప్రొడ్యూసర్‌కి ఇలా కథ చెప్తాననుకో- అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకి కోటలాంటి హవేలీ వుంటుంది. ఆయనకు ఏడుగురు కొడుకులు. ఇంటి నిండా నౌకర్లూ చాకర్లు వందమంది పైగా ఉంటారు. ఆ రాజుగారి పెద్దకొడుక్కి ఓ పెళ్లి సంబంధం వస్తుంది. పది ఫారిన్ కార్లలో దిగిపోతారు పెళ్లికూతురు తాలూకు వాళ్లు...
మనం ఇలా కథ చెబుతుంటే మొదటి వాక్యంలోనే బ్రేక్ పడుతుంది ప్రొడ్యూసర్ మనసుకు. దాంతో ఇలా ఆలోచించుకుంటూ వుంటాడు. వీడు ఏడుగురు కొడుకులంటున్నాడు. ఏడుగురు చాకులాంటి కుర్రాళ్లు దొరుకుతారా? వందమంది నౌకర్లు- సరే జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకోవచ్చు. కాని పది ఫారిన్ కార్లు ఎక్కడ దొరుకుతాయి. రెండు కార్లు పురుషోత్తమరావుగార్ని అడగవచ్చు. ఒకటి మావగార్ని అడుగుదాం. నా కారు బిజీ కనుక కుదరదు. మిగతా కార్లు ఎక్కడ్నించి తేవాలి. ఇలా ప్రొడ్యూసర్లు ప్రొడక్షను, బడ్జెటులో పడతారు కాని కథ వినరు. కథంతా చెప్పేసి ఎలా వుంది సార్ అంటే- ‘నాకు నచ్చితే సరిపోదు. మా డెరైక్టరుగారికి నచ్చాలి. ఆయనతో ఓ సిట్టింగు ఏర్పాటు చేస్తాను లేండి’ అంటాడు. సరే అతనన్నట్టే డెరైక్టరుగారికి కథ చెప్పామనుకో- అనగనగా ఓ రాజు.
ఆయనకు ఏడుగురు కొడుకులు అనగానే ఆయన మనసులో ‘ఏడుగురూ కొడుకులుండాలా? అందులో ముగ్గుర్ని కూతుళ్లుగా పెట్టుకుంటే పోలే’ అని మనం చెప్పే కథ వింటూ అందులోని అంశాలను నలుగురు కొడుకులూ ముగ్గురు కూతుళ్లకూ అన్వయించుకుని మధ్యలో కుదరక మళ్లీ ఒకసారి చెప్పండంటారు. మనం ఏమి చెప్పినా అతను పేరలల్‌గా ఆలోచిస్తూ పోతాడు. వీళ్లకు కథ చెప్పడం చాలా కష్టం. మరో రకం డెరైక్టర్లు మనసు మరెక్కడో పెట్టుకొని వస్తారు. మనం కథ మొదలెట్టగానే మనకేసి చూస్తూనే ఆవలించేస్తారు. మరో డెరైక్టరుకు కథ చెప్పినప్పుడు మధ్య మధ్యలో నిద్దర పోతాడు. ఎలా వుంది సార్ అంటే బావుంది కాని అక్కడక్కడ జంపులొచ్చాయయ్యా అంటాడు. ఎందుకు రావు అతను మధ్య మధ్యలో నిద్రపోతే... వీళ్లకు ఇలా కథ చెప్పడం నా తరం కాదని కథ సినాప్సిస్ పేపరు మీద ఫెయిర్ కాపీ చేయించి ఇచ్చేసాను- రెండు మూడు సందర్భాల్లో. ఒక డెరైక్టరు నేనిచ్చిన కాగితంలోని సంఘటన ఆయన అప్పుడు డెరైక్టు చేస్తున్న సినిమాలో పెట్టేశాడు. అందుకే ఈ కథ చెప్పడం అన్నది చిరాకే’ అంటాడు రమణ.
ఈ విషయంలో బాపు ఏం తక్కువ కాదు. రమణ చెప్పిందతనికి వెంటనే నచ్చదు. చాలాసార్లు వీళ్లిద్దరికీ స్టోరీ డిస్కషన్లలో అభిప్రాయబేధాలు వస్తుంటాయి. రమణకు కోపం వచ్చి వెళ్లిపోతుంటాడు. మర్నాడు ‘బాపు చెప్పిందాంట్లో పాయింటు వుందా’ అని ఆలోచిస్తాడు. ఉందని తోస్తే వెంటనే మార్పు చేసేసి ఆల్టర్‌నేటివ్ సజషన్సుతో వచ్చి కూర్చుంటాడు. అలాగే బాపూ కూడా ఆలోచిస్తాడు. ‘నేనన్నదాంట్లో తప్పేమిటి’ అని. తప్పని తోస్తే ‘నువ్వు చెప్పిందే రైటేమో వెంకట్రావు’ అనేస్తాడు. ఒక్క పౌరాణికాల విషయంలోనే వీళ్ల మధ్య విభేదాలుండవు. ఎందుకంటే అన్ని పురాణాలూ వీళ్లిద్దరూ క్షుణ్ణంగా చదువుకున్నారు. పైగా వాళ్లిద్దరికీ మెమెరీ ఎక్కువ.
రమణ రాసిన ప్రతి డైలాగూ బాపుకి నచ్చుతుంది. ఎందుకంటే రమణ ఎప్పుడూ వెనకా ముందులు ఆలోచించి రాస్తాడు. ఇక్కడ ఒక పాయింటు చెపితే దానికి ఎక్కడో ఒక లింకు వుంటుంది. అందుకే రమణ రాసిన డైలాగుని బాపు ఎప్పుడూ మార్చడు. షూటింగ్ టైమ్‌లో నాకు ఎన్నోసార్లు రమణ రాసిన డైలాగులు చదివి వినిపించి ‘ఒక్క వెంకట్రావే రాయగలడయ్యా ఇలాంటి డైలాగు. మహానుభావుడు’ అని మెచ్చుకున్న సందర్భాలు వున్నాయి. వీళ్లిద్దరి సినీ ప్రయాణం ఇలాంటిది.
సినిమా పుస్తకం/ కొసరు కొమ్మచ్చి/ వెల: రూ. 200/ ప్రతులకు: 040-23047638