నా కాసిని పుస్తకాలు | My Casino Books | Sakshi
Sakshi News home page

నా కాసిని పుస్తకాలు

Published Sat, Jun 13 2015 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

నా కాసిని పుస్తకాలు

నా కాసిని పుస్తకాలు

ఇష్టమైన దేవుడి ఫొటోలాగా, గోడకు వాలి మరీ పలకరించే బిళోరి అద్దంలాగా, నిద్ర లేచీ లేవగానే పుస్తకాలు ఎదురుగ్గా కనిపిస్తే, రోజు సవ్యంగా మొదలైనట్టనిపిస్తుంది. గోడకు పెట్టిన కొయ్య అమరికలో నా కాసిని పుస్తకాలనూ తొలి వెలుగులో చూసుకుని, అక్షర స్పర్శను అనుభవించి, రోజులోకి అడుగుపెడతాను.
 
కళ్లు నులుముకు చూడగానే నా కంటికి తగిలేది ‘ఆంధ్ర వాచస్పత్యము’. ప్రతిపదార్థ పర్యాయపద నిఘంటువు నిర్మాత కోట్ర శ్యామల కామశాస్త్రి.  నాన్న నాకిచ్చిన కాసిని పుస్తకాలలో వాచస్పత్యము నాలుగు సంపుటాలు, వావిళ్లవారి పోతన భాగవతం, ముద్దుకృష్ణ వైతాళికులు తొలి ముద్రణ, విశ్వనాథ ఏకవీర ఉన్నాయి. ‘ద మిస్టరీస్ ఆఫ్ మొఘల్ కోర్ట్’ పేరుతో వచ్చిన పుస్తకానికి మొసలికంటి సంజీవరావు చక్కని తెలుగు అనువాదం ‘మొగలాయి దర్బారు’. ఇదీ నాలుగు భాగాలు. దీని సరసన మరో గొప్ప అనువాదం ‘చెంఘిజ్ ఖాన్’. అడివి బాపిరాజు నవల ‘నారాయణరావు’. అరవై ఏళ్ల కిందట, మా అమ్మ రోజూ మధ్యాహ్నం వేళ పడమటి మెట్లలో కూచుని చదువుతూ ఉండేది. నలుగురైదుగురు అమ్మలక్కలు చెవులప్పగించి వింటూ లీనమైపోయేవారు. అమ్మ గుర్తుగా పెట్టుకునే నెమలికన్నుని అప్పుడప్పుడు నే సొంతం చేసుకునేవాణ్ని. గుర్తుపెట్టుకున్న అమ్మ నాల్రోజులు చదివినవే చదివి రంజింపజేసేది. ఇవన్నీ ఆ పుస్తకానికి పట్టుకుని ఉన్న నా జ్ఞాపకాలు. నేను యిష్టపడి సేకరించుకున్నవి, మహారచయితలు తమ చేవ్రాలుతో యిచ్చిన పుస్తకాలంటే మరీ ప్రాణం. దేవులపల్లి, హనుమచ్ఛాస్త్రి, భుజంగరాయశర్మ, గోపీచంద్ ‘తత్త్వవేత్తలు’, సంజీవదేవ్ ‘రసరేఖలు’ - వాటి వెన్ను తడితే వారంతా నా వెన్ను నిమిరి దీవిస్తున్నట్టనిపిస్తుంది.

జనరల్ సర్ ఆర్థర్ కాటన్ జీవితాన్ని, కృషిని రంగరించి ఆయన కుమార్తె లేడీ హోప్ రాసిన బృహత్ గ్రంథం ఫెదర్ వెయిట్ కాగితం మీద లండన్‌లో అచ్చయింది. పుస్తకాన్ని తెరిస్తే గోదావరి గలగలలు వినిపిస్తాయి. రేగడి నేలల్ని చిగురింపజేసిన మహనీయుడు. పక్కన నేదునూరి గంగాధరం పదానికో నెత్తురుబొట్టుగా సేకరించి, సంకలించిన ‘మిన్నేరు’, ‘మున్నీరు’. అవి తొలినాళ్ల జానపద గేయ రత్నావళులు. నిండు వేసవిలో మావూరి తాటి తోపులో బొటనవేలుతో ముంజలు తోడుకు తింటున్న స్పృహ కలిగిస్తాయి. అభినవ పోతన వానమామలై వరదాచార్యులు రచించిన మహాకావ్యం పోతన చరిత్రము కలిగివుండటం నా భాగ్యంగా భావిస్తాను. భారతి వజ్రోత్సవ సంచిక, విజయ విలాసం హృదయోల్లాస వ్యాఖ్య, శ్రీపాద అనుభవాలూ, రెడ్డి సంచిక - అరలో చూసుకోవడం నిత్యానందం. శ్రీకాళహస్తీశ్వర శతకం పారాయణ గ్రంథం. మునివేళ్లు తగలగానే డబుల్ రీడ్ హార్మణీ ‘‘పరబ్రహ్మ! పరమేశ్వర’’ వినిపిస్తుంది. ఎందుకంటే అవి గయోపాఖ్యానం, వుద్యోగ విజయాలు పద్యనాటకాలు.

నా మిత్రుడు ఎప్పుడూ అంటుంటాడు - ‘‘మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి, జాషువా ‘గబ్బిలం’, విశ్వనాథ ‘తెలుగు రుతువులు’ నా దగ్గర లేవు. అవి అపౌరుషేయాలు, నా నోటికొచ్చు. అలాగే వచనంలో మల్లాది రామకృష్ణశాస్త్రి, ముళ్లపూడి’’ అని. రుద్రకవి అష్టకాలు, అందుకు బాపు వర్ణచిత్రాలు, ఆరుద్ర ముందుమాటలు ముప్పేట అల్లుకున్న మొగలిరేకుల పూలజడలా తోస్తుంది ‘జనార్దనాష్టకమ్’. మరుక్షణం పూలజడతో సరాగాలాడుకున్న వేకువజాములు స్ఫురిస్తాయి. నా సాటివారు, పలుకున్న సమకాలికులు రాసినవి కాసిని నాకు శుభోదయం పలుకుతాయి. ఆ వరుసలోనే కవితాప్రసాద్ ‘ఒంటరి పూలబుట్ట’ నిలిచివుంది. గుండె తాళాన్ని నొక్కి/ ప్రాణం తాళం చెవులు/ తీసికెళ్లిపోయావు అన్న పంక్తులు కన్నీటి తెరలు కమ్మించాయి. నేను తేరుకుని సూటిగా ప్రశ్నించాను - మీలాంటి సరసులు, సంస్కారులు చేసే పనేనా యిది? దత్తపదిలో యింకా రెండు పాదాలు చెప్పనే లేదు. పూర్తిగా సమస్య పూరించనే లేదు. ఘంటానాదం లెక్క ఎక్కడ? నిషిద్ధాక్షరి వదిలేశారు. పృచ్ఛకులకేం చెబుతారు. నాకెరుకే, పుణ్యలోకంలో ఠీవిగా మీ ఆశువులతో తేనెవానలు కురిపిస్తూ వుండివుంటారు. అస్తు!మహారచయితలు తమ చేవ్రాలుతో యిచ్చిన పుస్తకాలంటే మరీ ప్రాణం. వాటి వెన్ను తడితే వారంతా నా వెన్ను నిమిరి దీవిస్తున్నట్టనిపిస్తుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement