మంచి కథల కథ 2013
‘ముక్కలవుతున్న సమాజం విచ్ఛిన్నమౌతున్న సంబంధాల నలుగులాటలో ఒక్కొక్కరూ లేదా చిన్న సమూహాలు తమకు తామే ద్వీపాలవుతున్న దశ ఇది’ అంటారు వాసిరెడ్డి నవీన్ కథ 2013కు ముందుమాట రాస్తూ. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌ల సంపాదకత్వంలో గత పాతికేళ్లుగా కొనసాగుతున్న వార్షిక కథాసంకలనాలలో భాగంగా వచ్చిన 2013 కూడా మంచి కథలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సీనియర్ రచయితలు, కొత్త రచయితలు రాసిన కథలతో కూర్చిన ఈ సంకలనం విభిన్న కథావస్తువులను చూపే ప్రయత్నం చేస్తుంది. రామడుగు శిల్పకళాకారుల దుస్థితిని ‘గుట్ట’ (కె.వి.నరేందర్) కథ చూపితే, అడివంచు పల్లెల మాదిగల జీవితాన్ని ‘సిడిమొయిలు’ (సం.వెం.రమేశ్) చూపుతుంది. వృద్ధాప్య సమస్యలోని కొత్తకోణాన్ని ‘సప్తవర్ణ సమ్మిశ్రితం’ (పి.సత్యవతి) చూపితే, బినామీ రైతాంగంలో చిక్కుకున్న స్త్రీల వేదనని ‘బినామి’ (కె.ఎన్.మల్లీశ్వరి) చూపుతుంది.
కనిపించే మనుషులతోకాక ‘సాంకేతిక దెయ్యాలతో’ మాటల్లో పడిన మనుషుల పతనాన్ని ‘దెయ్యం’ (పి.వి.సునీల్ కుమార్) కథ చూపితే టైమ్ ట్రావెల్‌లోని వినూత్న అనుభూతిని ‘రీబూట్’ (అనిల్ ఎస్.రాయల్) కలిగిస్తుంది. వలస వెళ్లిన ఎడారి బతుకులు ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’ (పెద్దింటి అశోక్ కుమార్) చూపితే స్త్రీలు ఎదుర్కొనే హింసను ‘నీలా వాళ్లమ్మ మరికొందరు’ (విమల) చూపుతుంది. వర్తమాన దృష్టితో ద్రౌపది హృదయాన్ని ‘పగడ మల్లెలు’ (యాజి) కథ వ్యాఖ్యానిస్తే శ్రీలంక తమిళులపై సైన్యం సాగించిన అకృత్యాలను ‘యాళ్‌పాణం గోస’ (మన్నం సింధుమాధురి) కళ్లకు కడుతుంది. రెక్కలొచ్చి ఎగిరిపోయిన పిల్లలకూ వారి తల్లిదండ్రులకూ పెరిగిపోతున్న దూరాలను ‘చివరి ఇల్లు’ (మధురాంతకం నరేంద్ర) చూపితే ప్రకృతికీ మనిషికీ ఉన్న అనుబంధాన్ని ‘చంద్రుడు గీసిన బొమ్మలు’ (భగవంతం) చూపుతుంది. వర్క్ ప్లేస్‌లలో ఉన్న రాజకీయాలు స్త్రీ పురుషుల మధ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో ‘ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్’ (కుప్పిలి పద్మ) చూపితే సుప్త చేతనలో ఉన్న జ్ఞాపకాలు అదాటున వెలికి వచ్చి చేసే కలకలాన్ని ‘రామేశ్వరం కాకులు’ (తల్లావఝల పతంజలి శాస్త్రి) చూపుతుంది. అందరూ మంచి రచయితలు. అన్నీ మంచి కథలు. పుస్తకం అందంగా రావడానికి సంపాదకులు పెట్టిన శ్రద్ధ తెలుస్తోంది. కథాభిమానులు తప్పక పరిశీలించాల్సిన సంకలనం - కథ - 2013.
వెల: రూ.60 ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ
వాసిరెడ్డి నవీన్ నం: 040- 2779 7691