చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ
♦ నేడు కోర్టు తీర్పు
♦ పోయెస్ గార్డెన్‌కు పోటెత్తిన అభిమానం
♦ కార్యకర్తల్లోకి శశికళ
♦ భద్రత మరింత కట్టుదిట్టం
అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో వెలువడే తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ చిన్నమ్మ శశికళ మద్దతుదారుల్లో నెలకొంది. దీంతో రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సోమవారం చిన్నమ్మకు మద్దతుగా పోయెస్‌గార్డెన్‌కు అభిమానులు పోటెత్తారు. గార్డెన్ నుంచి బయటకు వచ్చిన శశికళ కార్యకర్తలతో ముచ్చటించారు.
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ సమరంలో ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వంకు మద్దతుగా ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, తారలు, మాజీ ఎమ్మెల్యేలు గ్రీన్ వేస్ రోడ్డు వైపుగా కదులుతున్నారు. పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానుల తాకిడి రెండు రోజులుగా గ్రీన్‌వేస్ రోడ్డు వైపుగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం చిన్నమ్మ కువత్తూరు వేదికగా చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం అన్నాడీఎంకే కింది స్థాయి కార్యకర్తల్ని, నాయకులను కదిలించినట్టుంది. రెండు రోజులుగా అంతంత మాత్రంగానే పోయెస్‌గార్డెన్ పరిసరాల్లో సందడి నెలకొనగా, ప్రస్తుతం అభిమాన కెరటం పోటెత్తుతోంది.
శశికళకు మద్దతుగా తండోపతండాలుగా కార్యకర్తలు తరలి రావడంతో ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. ముందుగా పార్టీ ముఖ్యులతో మాట్లాడే క్రమంలో అమ్మ జయలలిత వెన్నంటి ఉంటూ తాను చేసిన సేవలు, అందించిన సహకారాన్ని వివరించారు. పన్నీరు రూపంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ, ఆ శిబిరం ఎత్తులను చిత్తు చేస్తూ, అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఒకే మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. క్రమంగా అభిమాన తాకిడి పెరగడంతో శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బయటకు రాక తప్పలేదు.
కార్యకర్తల్లో చొచ్చుకు వస్తూ, వారితో ముచ్చటించారు. కార్యకర్తల మ«ధ్యలో నిలబడి మరీ ప్రసంగ పాఠంతో ఆకర్షించే యత్నం చేశారు. పోయెస్ గార్డెన్ నుంచి కువత్తూరుకు వెళ్లే మార్గంలో ప్రజాకర్షణ దిశలో చిన్నమ్మ పయనం సాగినా, చిన్నమ్మ ప్రసంగాలు ఆకర్షించే విధంగా ఉన్నా, మంగళవారం వెలువడబోయే తీర్పుపై ఆమె మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ మాత్రం తప్పడం లేదు.
చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ: అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించనుంది. మంగళవారం పదిన్నర గంటలకు తీర్పును ప్రకటించనున్నట్టు సుప్రీంకోర్టులో నుంచి వెలువడ్డ ప్రకటనతో చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న ఆందోళన బయల్దేరింది. చిన్నమ్మకు అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందో అన్న చర్చ మీడియాల్లో సైతం పెరగడంతో తీర్పుపై ఆసక్తి పెరిగింది. తీర్పు వ్యతిరేకంగా ఉన్న పక్షంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఏదేని సంఘటనలు చోటు చేసుకోవచ్చన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భద్రత పెంచుతూ, ప్రధాన ప్రాంతాల్లో చెక్ పోస్టులు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.