ప్రాణం పోయినా అభివృద్ధి ఆగనివ్వను | CM KCR owes to development in Telangana | Sakshi
Sakshi News home page

ప్రాణం పోయినా అభివృద్ధి ఆగనివ్వను

Published Fri, Apr 28 2017 1:01 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

ప్రాణం పోయినా అభివృద్ధి ఆగనివ్వను - Sakshi

ప్రాణం పోయినా అభివృద్ధి ఆగనివ్వను

ప్రజల దీవెనలు, మద్దతు కావాలి
వరంగల్‌ ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

- 2019లో గెలిచి తీరుతాం..
- తెలంగాణ వ్యతిరేక శక్తుల మీద పోరాటం చేస్తాం
- బంగారు తెలంగాణగా చేసేదాకా విశ్రమించేది లేదు
- తెలంగాణ దుస్థితికి కాంగ్రెస్‌ సన్నాసులు, దద్దమ్మలే కారణం
- వారు శిఖండిలా ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు
- కాంగ్రెస్‌ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి
- రాష్ట్ర రైతు సమాఖ్యకు వచ్చే బడ్జెట్‌లో రూ. 500 కోట్లు ఇస్తాం  


వరంగల్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రజల ఆశీర్వాదం.. దీవెనలు.. మద్దతు ఉన్నంత కాలం ప్రాణం పోయినా సరే అభివృద్ధిని ఆగనివ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పంచాయతీ ఎన్నికలు మొదలు వరంగల్‌ ఉప ఎన్నిక వరకు వరుసగా గెలిచినట్లే.. 2019లో మరోసారి బ్రహ్మాండంగా గెలిచి తీరుతామని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకులు ఎవరేం మాట్లాడుతారో, ఎవరేం చేసుకుంటారో.. ఆ విజయంతోనే తేల్చి చెబుతామని స్పష్టం చేశారు. చివరి రక్తపుబొట్టు వరకూ తెలంగాణ వ్యతిరేక శక్తుల మీద పోరాటం చేస్తామని, బంగారు తెలంగాణగా చేసేంతవరకు విశ్రమించేది లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 16వ వార్షికోత్సవం నేపథ్యంలో గురువారం వరంగల్‌లో ‘ప్రజల ముందు ప్రగతి నివేదన’బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్‌... తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించటంతో పాటు విపక్షాలపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్‌ నేతలకు బుద్ధి చెప్పాలి..
కాంగ్రెస్‌ పార్టీ నేతలు సాంకేతిక కారణాలను చూపించి సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని.. నీళ్లు రాకుండా శిఖండిలా అడ్డుపడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. తమకు రాజకీయ బతుకు ఉండదని, ఒక్క ఓటు కూడా రాదనే భయంతోనే వారు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతల అసమర్థ విధానాల కారణంగానే తెలంగాణ జీవన విధానం విధ్వంసమైందని విమర్శించారు. పదవుల కోసం పాకులాడిన కాంగ్రెస్‌ నాయకులను సన్నాసులు. దద్దమ్మలని అంటామని వ్యాఖ్యానించారు. ‘‘ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ప్రాజెక్టును పది నెలల్లో పూర్తి చేశాం.

కాంగ్రెస్‌ వాళ్ల గుండెలు అదిరిపోయినై. అదే వేగంతో కాళేశ్వరం కడితే ఉత్తర తెలంగాణ జిల్లాలు... పాలమూరు కడితే మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. మేం ఇలా ప్రాజెక్టులు నిర్మిస్తే రాజకీయంగా తమ భవిష్యత్తు కరువవుతుందనే కాంగ్రెస్‌ నేతలు స్టేలు తెస్తున్నారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లి అడ్డుకుంటున్నారు. అసలు ప్రభుత్వం ప్రాజెక్టులు ఎవరి కోసం కడుతుంది. ఆరిపోయిన తెలంగాణకు నీళ్లు రావాలని, ప్రజలు బాగుపడాలనేది ప్రభుత్వ ఆరాటం. కాంగ్రెస్‌ నేతలు స్టేలు ఎందుకు తెస్తున్నారు, ఎవరి కోసం తెస్తున్నారో జనమంతా ఎక్కడికక్కడ నిలదీయాలి. ఉద్యమ సమయంలో సంచులు మోసి పదవుల కోసం పాకులాడిన కాంగ్రెస్‌ నాయకుల కారణంగానే తెలంగాణకు ఈ దుర్గతి పట్టింది..’’అని కేసీఆర్‌ దుయ్యబట్టారు.

రైతు కాలు మీద కాలేసుకోవాలి
రైతులు కాలు మీద కాలు వేసుకొని రంధి లేకుండా వ్యవసాయం చేసేంత వరకు.. వారి వెంటే ఉంటానని కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతులు తమ పంటకు «తామే ధరను నిర్ణయించే పరిస్థితి రావాలని, అందుకోసం కేసీఆర్‌ వారి వెంట ఉంటాడని చెప్పారు. అలాంటి పరిస్థితి వచ్చేంత వరకు రైతులు పట్టుబట్టాలని, జట్టు కట్టాలని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ వానాకాలం, యాసంగిలలో రెండు పంటలకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మరోసారి ప్రకటించారు. ఏటా తొలిపంటకు రోహిణీ కార్తెకు ముందే మే 15లోపు, రెండో పంటకు దసరాకు ముందే అక్టోబర్‌ 15 లోపు డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఎరువులు, యూరియా బస్తాలకే కాకుండా.. విత్తనాలు, కూలీలకు కూడా ఆ సొమ్మును వాడుకోవచ్చని తెలిపారు.

సంఘటితం కావాలి
రైతులు సంఘటితం కావాలని, ప్రతి గ్రామంలో రైతు సంఘం, మండల రైతు సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు, రాష్ట్ర సమాఖ్యలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకుంటుందని, రాష్ట్ర రైతు సమాఖ్యకు వచ్చే బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు ముఖ్యమంత్రి అంత పవర్‌ఫుల్‌గా ఉంటాడని... రైతు సంఘాలే వ్యాపారులతో చర్చలు జరిపి తమ పంటల ధరలు నిర్ణయించాలని ఆకాంక్షించారు. ‘‘ఇప్పటిలెక్క ఫోన్ల మాట్లాడుకుని వ్యాపారులు ధర చెప్పుడు కాదు. ధాన్యంల మీటరు పెట్టి తేమ వాళ్ల జెప్పరు. రైతులే అన్నీ నిర్ణయిస్తరు. వ్యాపారుల దగ్గర సరైన ధర రాకపోతే రైతులకు పర్మిట్లు ఇచ్చి దేశంలో ఎక్కడ ఎక్కువ ధర ఉంటే అక్కడికి తీసుకెళ్లి అమ్మే స్థాయికి ఎదగాలి..’’అని పేర్కొన్నారు.

గొర్రెలు, చేప పిల్లలంటూ హేళన చేశారు
గొర్రెల పంపిణీ, చేపల పెంపకం పథకాలను ప్రకటిస్తే.. అసెంబ్లీలో గొర్రెలు, చేపలంటూ కాంగ్రెస్‌ నాయకులు హేళన చేశారని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో 30 లక్షల మంది గొల్ల కుర్మ యాదవులున్నారు. రాష్ట్రానికి ప్రతి రోజు 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. మెడ మీద తలకాయ ఉన్న ప్రభుత్వమేదైనా వాళ్ల గురించి ఆలోచించకుండా ఉంటుందా..? రెండేళ్లలో 84 లక్షల గొర్రెలు అందిస్తాం. ఇప్పుడున్న వాటితో కలిపితే 1.70 కోట్ల గొర్రెలవుతాయి. రెండేళ్ల తర్వాత రూ.20 వేల కోట్ల సంపద సృష్టిస్తాం. సొసైటీల్లో సభ్యులుగా చేరిన వారందరికీ 21 గొర్రెల యూనిట్‌ అందించి తీరుతం.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేసేందుకు కులవృత్తులు బలోపేతం కావాలి. నాయిబ్రాహ్మణ సోదరులకు 25 వేల మోడ్రన్‌ సెలూన్లు మంజూరు చేస్తం. రూ.లక్ష చొప్పున వంద శాతం సబ్సిడీపై ఈ ఏడాదిలోనే అందిస్తాం. ఎంబీసీల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రజకులకు వాషింగ్‌ మిషీన్లు, డ్రైయర్లు అందిస్తాం. విశ్వకర్మలకు రూ.200 కోట్లు కేటాయించాం. గీత వృత్తి కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుంది. 5 కోట్ల ఈత, తాటి మొక్కలు నాటుతాం. మందు కల్లుపోవాలి, మంచి కల్లు రావాలి. మిషన్‌ కాకతీయలో 19 వేల చెరువులు బాగు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం బడ్జెట్‌లోì రూ.40 వేల కోట్లు కేటాయించి బ్రహ్మండమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది.’’అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement