కవిత్వం కళ్ల ముందు కన్పించాకే రాస్తా! | Interview with Telangana State song writer Andesri by Punna Krishna Murthy | Sakshi
Sakshi News home page

కవిత్వం కళ్ల ముందు కన్పించాకే రాస్తా!

Published Fri, Jun 6 2014 11:34 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

కవిత్వం కళ్ల ముందు కన్పించాకే రాస్తా! - Sakshi

కవిత్వం కళ్ల ముందు కన్పించాకే రాస్తా!

  • తెలంగాణ రాష్ట్ర గీతకర్త అందెశ్రీ ఇంటర్వ్యూ
  • ఆది శంకరుడిని కీర్తించడం అసాధారణమేమీ కాదు. శంకరుడు పూజించిన ‘చండాలుడి’ని? అసాధారణం కదా. అటువంటి అద్భుతం నిజామాబాద్ జిల్లా అమరాద్‌లో దాదాపు నాలుగు దశాబ్దాల నాడు జరిగింది. లోకరీతిలో నిజామాబాద్ జిల్లా జనగామ సమీపంలోని  రేబర్తిలో 1961 జూలై 18న మాదిగ కులస్తుడిగా పుట్టారు ఎల్లయ్య. అతడి 16వ ఏట  శృంగేరీ పీఠానికి చెందిన స్వాములు శంకర్ మహరాజ్ ‘బిడ్డా, కాళిదాసును తెనాలి రామకృష్ణను కనికరించిన అమ్మవారు నీలో ఉంది. నీ సాహిత్యంలో ఆమె  అందె విన్పిస్తోంది.  నీవు నేటి నుంచి అంద్శైవి అని ఆశీర్వదించారు. ఆచరణలోనూ అపురూపంగా చూశారు. ఒక యజ్ఞంలో ‘అంద్శైని  రుత్వికునిగా కూర్చోపెట్టారు. తమ  సరసన ‘అతడు’  కూర్చునేందుకు వీలులేదన్న సాంప్రదాయవాదులతో  ‘తమరు నిష్ర్కమించవచ్చు. 
     
     అందె శ్రీ రుత్వికుడు. నేను సోమయాజిని, యజ్ఞానికి మీరు అనర్హుల’న్న అభినవశంకరుడు శంకర్ మహరాజ్! 
     
     బడి మొఖం చూడని పశువుల కాపరి లలిత జానపద కవి (సెమీ క్లాసికల్ కవి)గా ఆవిష్కృతమైన బతుకు బాటలో ఇటువంటి అపురూపాలెన్నో. ఎర్రసముద్రం సినిమా కోసం ఆయన రాసిన పాట ‘మాయమై పోతున్నడమ్మ మనిషి’  2006 నుంచి ద్వితీయ ఇంటర్  పాఠ్యాంశం. తెలుగు సినిమా చరిత్రలో ‘మా తెలుగు తల్లికి’, ‘తెలుగు జాతి మనది’ తర్వాత పాఠ్యాంశంగా చేరిన మూడవ పాట ‘మాయమైపోతున్నడమ్మా’ కావడం గమనార్హం. గంగ సినిమాలో ‘వెళ్లి పోతున్నావా’కు నంది అవార్డు స్వీకరించారు, భారత ప్రభుత్వపు  29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన ‘తెలంగాణ’ తన పాటను రాష్ట్రగీతంగా స్వీకరించిన సందర్భంలో అంద్శై ఇంటర్వ్యూ సారాంశం : 
     
     పాటకు బీజం
     తెలంగాణ కళాకారులు లేదా రచయితలు తమ తమ సమావేశాలను పాటతో ప్రారంభించడం ఆనవాయితీ. వివిధ సంఘాల సమాహారమైన తెలంగాణ ఉద్యమ కళాకారులు 2002 సెప్టెంబర్ 30న నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో  ధూంధాం తలపెట్టారు. అందులో నేనూ పాల్గొన్నా. ముందుగా ఏ పాట పాడాలని మీమాంస వచ్చింది. తెలంగాణకు అందరూ హర్షించే ఒక గీతం లేకపాయెనే అన్పించింది. అందరి నాల్కలపై నిలిచే పాట రాయాలె అనుకున్న. అప్పుడు రెండు చరణాలు ఇప్పుడు రెండు చరణాలు ఊరుతున్నవి. మరుసటి సంవత్సరం  సిద్దిపేటలో తెలంగాణ రచయితల సంఘం సమావేశ ప్రారంభగీతంగా పాడుతున్నా...
     ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం
     ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
     తరతరాల చరితగల తల్లీ నీరాజనం
     పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
     జై తెలంగాణ జైజై తెలంగాణ ...
     
     ఎవరో వెనుక నుంచి ‘ఇది తెలంగాణ జాతీయగీతం’ అన్నరు. వెక్కిరింతేమో అని కొంచెం భయపడ్డాను. కాదని తెలిసి తెప్పరిల్లిన.  ఆ క్షణం నుంచి ప్రతి ఒక్కరూ ఈ పాటను తమదిగా చేసుకున్నారు. ఏడేళ్లుగా నునుపు చేసిన పాటలో పల్లవితో కలిపి 12 చరణాలున్నవి. లక్షలాది ప్రజానీకం సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి యువ విభాగం ‘జనజాగరణసేన’ సమావేశంలో ఇందులోని నాలుగు చరణాలు పాడారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధినీ విద్యార్థులు ఈ పాటను కొన్నాళ్లుగా పాడుతున్నారు. ఆ నాలుగు చరణాలకు  కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతం హోదానిచ్చింది. రాష్ట్రగీతం హోదా పూర్తి పాటను తెలుసుకునేందుకు ఆస్కారం ఇస్తుందని భావిస్తున్నాను. అన్నిటి కంటె గొప్ప ఆనందం నన్ను కొడుకుగా పెంచి పెద్దచేసిన దివంగత బిరుదురాజు ‘ఇది తెలంగాణకు మాత్రమే కాదు, తెలుగు నేల జాతీయ గీతం’ అన్నప్పుడు కలిగింది. 
     
     ప్రతి భాషా అపౌరుషేయమే!
     వేదాలు అపౌరుషేయాలు అంటారు. ‘తాను పలికినది కాదు’ అనే అర్ధంలో ప్రతి భాషా అపౌరుషేయమే! ఏ పదం ఏ ఒక్కరూ కనిపెట్టలేదు. మనకు సంక్రమించిన పదాలు, నుడికారాలు, భావాలతో స్వీయానుభవాన్ని రంగరించి గానం చేస్తాం. రచిస్తాం. కాబట్టి ‘జయజయహే తెలంగాణ’ నా ద్వారా వచ్చిన అనేకుల పాట! శతకకవుల్లా తెలంగాణ ప్రాంతంలో ‘వరకవులు’న్నరు. వేమన వలె ‘గున్రెడ్డిపల్లె కుమ్మర సిద్దప్ప’ ప్రజలు పాడుకునే వరకవి. బాల్యంలో పశువులు కాసుకునే వాడిని. చెలకల్లో చెట్టుకిందకు చేరి కొందరు ఆయన పద్యాలు పాడేవారు. అవి నాలో ఇనికి పోయినవి. అక్షరాలు నేర్వకుండనే ఛందస్సుతో పద్యాలు రాయడం ఆ తీరుగ వచ్చింది. గడ్డిపూల బొడ్డుతాడు తెంపుకుని నేలపై పడ్డాను. పండుటాకు ఎంత ఇష్టమో, అంకురించే చివురుపైనా అంత ప్రేమ!  ప్రకృతికి చెందిన వస్తు-శిల్పాలకు శృతి లయలు ప్రాణ ప్రతిష్ట చేశాయి. లంకలో సంపద ఎంత ఉన్నా అయోధ్యకు సాటిరాదు అనే నేపథ్యంలో రామునితో ఆదికవి వాల్మీకి ‘జననీ జన్మభూమిశ్చ’ అనే శ్లోకాన్ని చెప్పిస్తారు. అదే భావాన్ని ‘తరతరాల చరితగల తల్లీ నీరాజనం-పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’ అన్నాను. ఆదికవి నుంచి నన్ను ఆదరించిన జక్కిరెడ్డి పూజల మల్లయ్య, ఉడుకుడుకు అన్నం పెట్టిన మహ్మద్ మునీర్ సేట్,  బాలబాలికలు, యువతీ యువకులు అందరి పాలూ  రాష్ట్రగీతంలో ఉంది. ఇందులో నా వాటా అణాపైసలే!
     
    చూడంది రాయలేను!
     పద్యమైనా, పాటైనా చూడంది రాయలేను. ప్రకృతి మనిషితో సహా అందులో భాగమైన చరాచరాలను చూసినపుడు కలిగిన సంవేదనలనే రాస్తాను. ‘వాక్కులమ్మ’ రాస్తున్నాను. ఆమె సరస్వతి కాదు. ప్రాణిలో పరుగిడు ప్రణవం. సృష్టి కనుచూపు. అందులో ఒక చరణం ‘కోటి భావాల కొనగోట మీటినట్లు-వసుధ విన్పింతు నా మాట వాక్కులమ్మా’. 
     ప్రపంచంలో ఉన్న నదులన్నిటినీ సందర్శించి నదీ కవిత్వం రాయాలని సంకల్పించాను. ఆఫ్రికా, చైనా పర్యటనలు చేశాను. చూసే రాయాలంటే ‘నదిని కంప్యూటర్‌లో చూడొచ్చు కదా’ అన్నారొక మిత్రులు. కంప్యూటర్‌తో సంసారం చేయగలమా?!
     - పున్నా కృష్ణమూర్తి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement