ఇఫ్తార్ విందు తిని.. 45 మంది ఉగ్రవాదుల మృతి
రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు తిన్న 45 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు... ఆ విందులో పెట్టిన ఆహారం విషపూరితం కావడంతో మరణించారు. ఇరాక్లోని మోసుల్ ప్రాంతంలో జరిగిన ఇఫ్తార్ విందుకు మొత్తం 145 మంది హాజరయ్యారు. అయితే, బయటకు కేవలం 100 మంది మాత్రమే సజీవంగా బయటకు వచ్చారు. ఎవరైనా కావాలనే వాళ్ల ఆహారంలో విషం కలిపారా.. లేదా ప్రమాదవశాత్తు వాళ్లు తిన్న ఆహారం విషపూరితం అయ్యిందా అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను విషాహారంతో చంపడం మాత్రం ఇది తొలిసారి కాదు. నవంబర్ నెలలో ఫ్రీ సిరియన్ ఆర్మీ రెబల్ గ్రూపు ఇస్లామిక్ స్టేట్ శిబిరంలోకి చొరబడినప్పుడు కూడా ఇలాగే చాలామంది ఉగ్రవాదుల భోజనాల్లో విషం కలిపి వాళ్లను హతమార్చారు. అప్పట్లో కనీసం 10 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సిరియా ప్రభుత్వ వర్గాలు, ఐఎస్ఐఎస్ ప్రకటించాయి. తాజా ఘటనలో ఏకంగా 45 మంది ఒకేసారి మరణించడం గమనార్హం.