కేంద్ర కేబినెట్ విస్తరణ వేళ ఢిల్లీకి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తులో మునిగితేలుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి దేశ రాజధానికి చేరుకున్నారు.
కేంద్ర కేబినేట్ విస్తరణకు సంబంధించి ఢిల్లీలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో కేసీఆర్ ఢిల్లీ చేరుకోవడం గమనార్హం. ఎందుకంటే విస్తరణలో భాగంగా కేంద్రంలోని అనేక మంది మంత్రులు తమ రాజీనామాలు సమర్పించారు. ఈ నెల 3 వ తేదీ ఆదివారం ఉదయం కేబినేట్ విస్తరణ జరగనుంది. పైగా ఎన్డీఏ కూటమిలో కొత్త భాగస్వామ్య పక్షాలు చేరుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేసీఆర్ ఆకస్మిక పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో విశేషమేమీ లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. కొంత కాలం కిందట కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటికి శస్త్రచికిత్స అవసరం అవుతుందని, అయితే కొంతకాలం తర్వాత నిర్వహించాలని అప్పట్లో వైద్యులు సూచించినట్టు చెబుతున్నారు. మరోసారి కంటి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర వద్ద పెండింగ్ అంశాలపై ప్రధానమంత్రిని కలిసి మరోసారి వివరించే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆదివారం ఉదయం వరకు రాజకీయ సస్పెన్స్ తప్పదని తెలుస్తోంది.