ఏపీ ఆక్వా చట్టాలు దేశానికే ఆదర్శం  | Sakshi
Sakshi News home page

ఏపీ ఆక్వా చట్టాలు దేశానికే ఆదర్శం 

Published Sat, Mar 2 2024 2:26 AM

AP Aqua Laws are a model for the country - Sakshi

కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, నీతి ఆయోగ్‌ సీఈవో కితాబు  

ఏపీలో ఆక్వారంగం బలోపేతానికి అవసరమైన చేయూతనిస్తాం 

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఆక్వారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, చట్టాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కేంద్రం కితాబునిచ్చింది. రాష్ట్రంలో ఆక్వారంగం బలోపేతం కోసం అవసరమైన తోడ్పాటు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, నీతి ఆయోగ్‌ సీఈ­వో పీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్‌ జాతీయ సలహాదారు నీలం పటేల్‌ స్పష్టం చేశారు.

నీతి ఆయోగ్‌ ఆహ్వానం మేరకు న్యూఢిల్లీ వెళ్లిన ఏపీ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం శుక్రవారం వారిని మ­ర్యా­దపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆక్వారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో ముందుచూపుతో అడుగులు వేస్తున్నారని, ఈ రంగంలో తెచ్చిన సంస్కరణలు నిజంగా ప్రశంసనీయమని అన్నారు.

భవిష్యత్‌లో ఆక్వారంగం మ­రింత పుంజుకునేందుకు ఇవి ఎంతో దోహద పడతాయన్నారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు, ఈ–­ఫిష్‌ సర్వే ద్వారా ఆక్వా సాగు గుర్తింపు, ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్స్, ఆన్‌లైన్‌ ద్వారా లైసెన్సుల జారీ వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. జా­తీయ స్థాయిలో ఆచరించతగ్గ కార్యక్రమాలని చె­ప్పా­రు. ఏపీ ఆక్వా కార్యక్రమాలను ఇటీవల ఆ రా­ష్ట్రంలో పర్యటించినపుడు స్వయంగా చూశామన్నారు.  

15 రోజులకోసారి సమీక్ష 
రాష్ట్రంలో ఆక్వా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను అప్సడా వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం కేంద్రమంత్రికి, నీతి ఆయోగ్‌ సీఈవోకు వివరించారు. ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నం.1 స్థానంలో ఉందన్నారు. ఈ రంగం బలోపేతం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ గడిచిన ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తున్నారని అన్నారు.

ఆక్వా కార్యకలాపాలన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన అప్సడా చట్ట పరిధిలోకి తీసుకొచ్చారని, నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సరఫరా కోసం ఏపీ సీడ్, ఫీడ్‌ యాక్టులను తీసుకొచ్చారని చెప్పారు. ప్రతీ 15 రోజులకోసారి అప్సడా ఆధ్వర్యంలో రైతులు, ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్టర్స్‌తో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

జోన్‌ పరిధిలో 10 ఎకరాల్లోపు రైతులకు యూనిట్‌ రూ. 1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఇప్పటి వరకు రూ. 3,420 కోట్లు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించిందన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ సీఈవో మాట్లాడుతూ.. ఏపీలో జాతీయ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, తాము అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రతిపాదనలు పంపితే ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  

Advertisement
Advertisement