కుట్ర రాజకీయానికి మహిళా వలంటీర్ బలి
వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదు
ఆగమేఘాలపై కేసు నమోదు
పోలీసుల విచారణ.. ఆందోళనతో ఆగిన గుండె
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఓ మహిళా వలంటీర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఊళ్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించిన ఓ సేవకురాలిని టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం పొట్టన పెట్టుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. తప్పుడు ఆరోపణలతో వేధింపులు, ఫిర్యాదు, పోలీసుల విచారణతో తీవ్ర భయాందోళనలకు గురై విజయనగరం రూరల్ మండలం దుప్పాడ గ్రామంలో వలంటీరు బొబ్బాది సంతోషి (36) గుండె ఆగిపోయింది.
కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంతోషి భర్త బొబ్బాది కృష్ణ విజయనగరం కూరగాయల మార్కెట్‌లో పని చేస్తుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జయదీప్ ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అమ్మాయి లహరి ఎనిమిదో తరగతి చదువుతోంది. సంతోషి వలంటీరుగా చేరిన తర్వాత గ్రామంలో తనకు అప్పగించిన 50 కుటుంబాలకు నిత్యం అందుబాటులో ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని అర్హులకు చేర్చుతూ వారి మన్ననలు అందుకుంది.
తనది పేద కుటుంబమే అయినా గ్రామంలో ఏ పేద వారూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో సేవలందించింది. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే అవ్వాతాతలకు పింఛన్ అందించడంలో పోటీ పడేది. సీఎం జగన్ అంటే అభిమానం. ఇవన్నీ అదే గ్రామంలోని టీడీపీ నాయకులకు కంటగింపుగా మారాయి. ఏదో విధంగా వలంటీర్లపై కక్ష సాధింపు లక్ష్యంతో ఉన్న టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారు.
టీడీపీ నేతల బెదిరింపులు
టీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ స్థానిక టీడీపీ నేతలు గ్రామంలో 50 మంది యువకులను మభ్యపెట్టి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ వలంటీర్లు బొబ్బాది సంతోషి, నారాయణమ్మ, రామలక్ష్మి, స్వాతి, కృష్ణవేణి, కోటమ్మలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు సరిగా విచారించకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఆగమేఘాలపై ఆ ఆరుగురు వలంటీర్లను సస్పెండ్ చేశారు. పోలీసులతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు.
పుట్టుమచ్చలు, తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడు రోజుల కిందట సంతోషికి ఫోన్ చేసి అడిగారు. అంతకు ముందు గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో కూడా ఆ నాయకులు వలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఊడగొట్టి కేసులు పెట్టించామని, తమ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంటింటి విచారణ చేశారు. ఇవన్నీ సంతోషినిని ఆందోళనకు గురి చేశాయి.
ఇదిలా ఉండగా పుట్టుమచ్చలు తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడ్రోజుల కిందట ఆమెకు ఫోన్ చేయడంతో తీవ్రంగా భయాందోళనకు గురైంది. గురువారం ఛాతీలో పట్టేసినట్టు ఉండటంతో తొలుత గ్యాస్ తాలూకు నొప్పిగా భావించింది. కొంత సేపటి తర్వాత గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు విజయనగరంలో డాక్టర్లకు చూపించారు. వారి సూచనలతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడ వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం ఆ పేదరాలి గుండె ఆగిపోయింది. సంతోషి హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆమె అంతిమ యాత్రలో పాల్గొని కంట నీరు పెట్టారు. కాగా, ఇంత జరిగినా టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఆ కుటుంబం భయపడిపోతోంది. తోటి వలంటీర్లంతా లోలోన కుమిలిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment