కుట్ర కనిపింఛన్‌ | - | Sakshi
Sakshi News home page

కుట్ర కనిపింఛన్‌

Published Mon, Apr 1 2024 1:20 AM | Last Updated on Mon, Apr 1 2024 1:00 PM

- - Sakshi

వలంటీర్‌ వ్యవస్థ రద్దుకు టీడీపీ కుయుక్తులు

వైఎస్సార్‌సీపీకి మంచి పేరొస్తుందనే ఫిర్యాదులు

పింఛన్ల పంపిణీకి దూరమైన వలంటీర్లు

సచివాలయాలకు వెళ్లిపింఛన్లు తీసుకోవాల్సిందే

పింఛన్‌దారుల్లో 10 శాతం మంది నడువలేని పరిస్థితి

వేలాది మందిని ఎత్తుకు రావాల్సిందే!

టీడీపీ కుతంత్రాలపై మండిపడుతున్నవృద్ధులు, దివ్యాంగులు

టీడీపీ కుట్ర బయటపడింది.. అవ్వాతాతలు, దివ్యాంగులకు మళ్లీ కష్టాలు మొదలు కానున్నాయి.. ఇంటి వద్దనే పింఛన్‌ అందుకోవాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిందే! వలంటీర్‌ వ్యవస్థతో వైఎస్సార్‌సీపీకి మంచి పేరొస్తుందని తెలుగుదేశం పార్టీ కుయుక్తులకు పాల్పడింది.. తన అనుబంధ సంస్థ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వచ్చినా వలంటీర్లు ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక వైపు చెబుతూనే మరో వైపు కుతంత్రాలకు పాల్పడటంపై పింఛన్‌దారులు మండిపడుతున్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌)/నంద్యాల(న్యూటౌన్‌): ఇంటి వద్దనే నిశ్చింతగా పింఛన్‌ తీసుకుంటున్న అవ్వాతాతలు, దివ్యాంగులు టీడీపీ కుట్రలతో నేడు గడపదాటాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 16 రకాల పింఛన్లు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలో 4.73 లక్షల మంది వివిధ కేటగిరీ పింఛన్‌లు తీసుకుంటున్నారు. వీరిలో 70 శాతం మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. వీరిలో 10 శాతం మంది మంచానికే పరిమితం అయ్యారు. డయాలసిస్‌, కిడ్నీ రోగులు... ఇలా వేలాది మంది అడుగుతీసి అడుగు వేయలేరు. ఇటువంటి వారందరూ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు అందుకోవాల్సిందే. సచివాలయాలకు వచ్చి పింఛన్లు పొందాలంటే వీరందరూ నరకం చూడాల్సిందే! వేలాది మందిని సచివాలయాలకు ఎత్తుకొని రావాల్సి ఉంది.

వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయొద్దంటూ తెలుగుదేశం పార్టీ తన అనుబంధ సంస్థ అయిన సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ దుస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా ఉండేది. లబ్ధిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ కష్టాలను తొలగించింది. వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అధికార పార్టీకి మంచి పేరొస్తాందనే టీడీపీ కుట్రపన్ని వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం చేశారు.

మళ్లీ కష్టాలు మొదలు..
టీడీపీ హయాంలో పింఛన్‌ పొందడంలో అవ్వాతాతలు, దివ్యాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల ప్రాంగణాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు కాసేవారు. డబ్బులు రాలేదు.. రేపు..మాపు అంటూ తిప్పుకునేవారు. ఎంత మంది అర్హులు ఉన్నా మండలానికి ఇన్నే పింఛన్లు అని కోటా పెట్టేవారు. ఒక్కో గ్రామానికి 10–15 వరకు పింఛన్లు మాత్రమే వచ్చేవి. జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకుంటే లబ్ధిదారులుగా ఎంపిక చేసేవారు. ఇందుకోసం నాలుగైదు నెలల పింఛన్‌ మొత్తాన్ని లంచంగా ముట్టచెప్పాల్సి వచ్చేది.

ప్రతి నెలా ఇచ్చే పింఛన్‌లోనూ రూ.100, 200 కోత పెట్టేవారు. మరణించిన వారిస్థానంలోనే కొత్త పింఛన్‌ వచ్చేది. వైఎస్సార్‌సీపీ పాలనలో పింఛన్‌దారుల కష్టాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. అర్హతే ప్రామాణికంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు గ్రామ, వర్డు వలంటీర్లను నియమించి... వారి ద్వారా నేరుగా ఇంటికే పింఛన్‌ పంపే ఏర్పాటు చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీ పండుగ ఉన్నా.. సెలవైనా... వానొచ్చినా.. ఇంటికే వెళ్లి పింఛన్‌ సొమ్ము అందజేస్తున్నారు. దీంతో అవ్వాతాతలు, దివ్యాంగుల కష్టాలు తొలగిపోయాయి. ఆసుపత్రిల్లో చికిత్స పొందుతుంటే అక్కడికే వెళ్లి పింఛన్‌ అందచేస్తున్నారు. వలంటీర్లు కేవలం సేవాభావంతో నిస్వార్థంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు, కుట్రలు, కుతంత్రాలతో అవ్వాతాతలకు మళ్లీ కష్టాలు ప్రారంభం కానున్నాయి.


ఇంటిదగ్గరే పించన్‌ పంపిణీ చేస్తున్న వలంటీరు(పైల్‌) 

ఇందుకే కక్ష..
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్త మాంసాలను పీల్చివేశాయి. జన్మభూమి కమిటీలకు చంద్రబాబు అపారమైన అధికారాలు ఇచ్చారు. దీనిని అవకాశంగా తీసుకొని జన్మభూమి కమిటీలోని సభ్యులు చెలరేగిపోయాయి. అవినీతి అక్రమాలతో లక్షాధికారులయ్యారు. జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు పిండకపోయినప్పటికీ వలంటీర్ల పట్ల అపారమైన ద్వేషం పెరగడానికి వారి వల్ల అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం.. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తు వస్తుండటమే కారణమని తెలుస్తోంది.

పింఛన్ల పంపిణీ మార్గదర్శకాలు ఇవీ..
గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. లబ్ధిదారులు ఏప్రిల్‌ నెల గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి వేలిముద్ర వేసి పింఛన్లు పొందాల్సి ఉంది. ఇందుకు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు సెర్ప్‌ ఆదివారం సాయంత్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వార్డు, గ్రామ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. ఏప్రిల్‌ 1వ తేదీ బ్యాంకులకు సెలవు. 2వ తేదీన పింఛన్ల సంబంధించిన మొత్తం ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తుంది. అదే రోజున గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, అర్బన్‌ ప్రాంతాల్లో వార్డు ఆడ్మిన్‌లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేస్తారు. మూడో నుంచి 5 రోజుల పాటు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేస్తారు. పింఛన్లు పంపిణీ చేసే సచివాలయ ఉద్యోగులు, ఆర్‌బీకే ఇన్‌చార్జీలందరి దగ్గర ఎంపీడీవోలు/ మున్సిపల్‌ కమిషనర్లు జారీ చేసిన ధ్రువపత్రాలు ఉంటాయి.

అనుకున్నట్టే చేశారు..
వలంటీర్‌ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో టీడీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఏదో విధంగా వలంటీర్‌ వ్యవస్థను దెబ్బతీయడానికి కొన్నేళ్లుగా ఆ పార్టీ నేతలు చేయని ప్రయత్నం లేదు. అనేక రకాల అభాండాలు వేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలంటీర్లపై కక్షసాధింపు చర్యకు పాల్పడ్డారు. పింఛన్ల పంపిణీతో పాటు సంక్షేమ పథకాల అమలులో ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు వలంటీర్లను పక్కన పేట్టే విధంగా చేయగలిగారు. ప్రజలతో మమేకమైన వలంటీర్లపై ఇంత దారుణంగా పగపట్టడంపై అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓటుతో బుద్ధి చెబుతాం   
టీడీపీ హయాంలో పింఛన్‌ వచ్చే వరకు ప్రతి రోజూ కన్నీళ్లు వచ్చేవి. ఎప్పుడిస్తారో తెలిసేది కాదు. ప్రతి రోజూ పంచాయతీ కార్యాలయం దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కష్టాలు తొలగిపోయాయి. వలంటీర్లు   ప్రతి నెలా 1వ తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్‌ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్‌ తీసుకునే పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం.    

– రమావత్‌ నాగమ్మ,   మీటేతాండ, తుగ్గలి మండలం 


మళ్లీ ఎదురు చూపులే 
టీడీపీ హయాంలో పింఛన్‌ పొందాలంటే నానా యాతన పడేవాళ్లం. అలాంటి పరిస్థితి లేకుండా వలంటీర్లు ప్రతి నెలా ఠంఛన్‌గా 1వ తేదీనే ఇంటికి వచ్చి పింఛన్‌ ఇచ్చేవారు. ఆ డబ్బులు ఆసుపత్రికి, సొంత ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడేవి. టీడీపీ కుట్రలు పన్ని వలంటీర్లను పింఛన్ల పంపిణీ విధుల నుంచి తప్పించింది. మళ్లీ  పింఛన్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తుందేమో! 
– మాబున్నిసా, గడివేముల 


ఇబ్బందులు తప్పవు 
వలంటీర్లు ఉంటే ఇంటికి వచ్చి మా అమ్మాయి తని్వకకు పింఛన్‌ సొమ్ము ఇచ్చి వెళ్లేవారు. వికలాంగురాలైన చిన్నారిని తీసుకొని సచివాలయానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ సమయానికి సి బ్బంది పింఛన్‌ ఇస్తారో తెలియని పరిస్థితి. వలంటీర్‌ వ్యవస్థ లేకపోతే దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడాల్సిందే.      
– చిన్నారి తని్వకతో తల్లి, నూనెపల్లె   

టీడీపీ హయాంలో అన్నీ కష్టాలే 
మోకాళ్ల నొప్పులతో ఎక్కడికి తిరగలేని పరిస్థితిలో ఉన్నా. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే పింఛన్‌ తీసుకుంటున్నా. ఎన్నికల సమయంలో వలంటీర్లను విధుల నుంచి పక్కనబెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడికో వెళ్లి పింఛన్‌ తీసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులో టీడీపీ హయాంలో చూశాను. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్‌ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. 
– రత్నమ్మ, మిట్నాల గ్రామం   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement