క్యాన్సర్‌ బాధితులకు కొండంత భరోసా  | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ బాధితులకు కొండంత భరోసా 

Published Sat, Feb 17 2024 4:47 AM

Free treatment for all types of cancer under YSR Arogyashri - Sakshi

సాక్షి, అమరావతి:   డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురంకు చెందిన వంకాయల శ్రీనివాస్‌ కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవించేవారు. ఆయనకు భార్య సాయిపద్మశ్రీ, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. 2022 డిసెంబర్‌లో సాయిపద్మశ్రీ జ్వరం, ఇతర అనారోగ్య సమస్యల బారినపడింది. దీంతో శ్రీనివాస్‌ వైద్య పరీక్షలు చేయించగా ఆమెకు రొమ్ము క్యాన్సర్‌ ఉందని వెల్లడైంది.

వైద్యులు చికిత్స కోసం ఏదైనా క్యాన్సర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అయితే అప్పటికే వ్యాపారంలో నష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయిన శ్రీనివాస్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం వారికి అండగా నిలిచింది. తెలిసిన వాళ్లు చెప్పడంతో శ్రీనివాస్‌ తన భార్యను విజయవాడలోని ప్రముఖ క్యాన్సర్‌ ఆస్పత్రి హెచ్‌సీజీకి తీసుకువెళ్లాడు.

అక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే వైద్యులు వైద్య పరీక్షలన్నీ చేసి సాయిపద్మశ్రీకి చికిత్సను అందించారు. ఈ ఏడాది జనవరిలో చికిత్స పూర్తి కావడంతో ఆమె ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. ఆరోగ్యశ్రీ వల్లే తన భార్య ప్రాణాలతో బయటపడిందని శ్రీనివాస్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.   

.. ఇది ఒక్క శ్రీనివాస్‌ ఆనందమే కాదు.. రాష్ట్రంలో ఎంతోమంది ఆరోగ్యశ్రీ తమ ప్రాణాలను కాపాడిందని చెబుతున్నారు. గతంలో ఒకప్పుడు క్యాన్సర్‌ వచ్చిందంటే ఆశలు వదులుకోవాల్సిందే. రూ.లక్షల ఖర్చయ్యే వైద్యాన్ని తలుచుకుని బాధిత కుటుంబాలు భీతిల్లేవి. ఇల్లు, వాకిలి తెగనమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం క్యాన్సర్‌ సోకినవారికి ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అత్యంత ఖరీదైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తోంది. బాధితులు తమ చేతి నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టే పనిలేకుండానే మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందజేస్తోంది. 

3.03 లక్షల క్యాన్సర్‌ బాధితులకు ఉచిత వైద్యం     
టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచారు. అలాగే వైద్య ఖర్చులకు పరిమితి లేకుండా అన్ని రకాల క్యాన్సర్‌లకు పూర్తి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో 200లోపు మాత్రమే క్యాన్సర్‌ ప్రొసీజర్‌లు ఉండగా ప్రస్తుతం 400కు పెరిగాయి.

లుకేమియా బాధితులకు నిర్వహించే రూ.10 లక్షలు, ఆ పై ఖర్చయ్యే బోన్‌మారో స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను సైతం ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఈ క్రమంలో 2019 నుంచి ఈ పథకం కింద 3,03,899 మంది క్యాన్సర్‌ బాధితులకు 10,43,556 ప్రొసీజర్స్‌లో ఉచిత వైద్యం అందించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.2,165.74 కోట్లు ఖర్చు చేసింది. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య క్యాన్సర్‌ చికిత్సకు కేవలం రూ.751.56 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు.    

క్యాన్సర్‌కే కాదు.. 
ఒక్క క్యాన్సర్‌కే కాకుండా హృద్రోగాలు, కిడ్నీ, లివర్‌.. ఇలా వివిధ రకాల బాధితులకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తి ఉచితంగా అందుతున్నాయి. టీడీపీ హయాంలో క్యాన్సర్, గుండె జబ్బు, తదితర పెద్ద రోగాల బారినపడితే పేదలు తమ తల తాకట్టు పెట్టుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితులను మారుస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రొసీజర్లను 3,257కు, వైద్యం ఖర్చు పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది.

2019 నుంచి ఇప్పటివరకు రూ.12,150 కోట్లను ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేసింది. ఉచిత వైద్య సేవలే కాకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోగులకు విశ్రాంత భృతిగా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ.5 వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇలా ఇప్పటివరకు 22.88 లక్షల మందికి రూ.1,366 కోట్ల సాయాన్ని అందించింది. 

ఆరోగ్యశ్రీ ఆదుకుంది.. 
మాది ప్రకాశం జిల్లా. ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాం. బస్టాండ్‌లో స్టాల్‌ నడిపేవాడిని. 2021లో నాకు క్యాన్సర్‌ సోకింది. కరోనా, ఇతర కారణాలతో వ్యాపారాలు సాగని దుస్థితిలో ఆరోగ్యశ్రీ ఆదుకుంది. చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే పనిలేకుండానే పూర్తి ఉచితంగా చికిత్స లభించింది. మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది.   – పి.మధుసూదనరావు, విజయవాడ 

నా ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తోంది 
నేను లారీ డ్రైవర్‌గా జీవనం సాగి­స్తు­న్నా. క్యాన్సర్‌ నిర్ధారణ కావడంతో విజయవాడలోని హెచ్‌సీజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందుతోంది. వైద్యం, మందులకు నాకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది.    – ఎన్‌.రాంబాబు, విజయవాడ 

రూపాయి కూడా ఖర్చు చేయనక్కర్లేదు
అన్ని రకాల క్యాన్సర్‌లకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సేవలు ఉన్నాయి. అర్హులైన నిరుపేద, మధ్యతరగతి ప్రజలు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. చికిత్సల భారం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం.   – డి.కె. బాలాజీ, సీఈవో, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ  

Advertisement
Advertisement