17.50 లక్షల టన్నులు అందించాలని లక్ష్యం
ఇందులో ఆర్బీకేల ద్వారా 5.60 లక్షల టన్నుల సరఫరా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధంచేస్తోంది. 2024–25 వ్యవసాయ సీజన్‌లో ఆర్బీకేలలో ఎరువులు లేవన్న మాట వినిపించకూడదన్న లక్ష్యంతో రైతులు కోరుకున్న ఎరువులను అందించేలా ఏర్పాట్లుచేస్తోంది. గడిచిన నాలుగేళ్లలో ఆర్బీకేల ద్వారా 31.54 లక్షల మంది రైతులకు రూ.1,311.80 కోట్ల విలువైన 11.88 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేయగా, రానున్న సీజన్‌లో కనీసం 10 లక్షల టన్నుల ఎరువుల సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
రైతులకు రూ.100 కోట్ల వరకు ఆదా
సాగు ఉత్పాదకాల పంపిణీలో ఆర్బీకేలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎరువుల కోసం రైతులు మండల, జిల్లా కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. అయినా అరకొరగానే అందేవి. ఒక్కోసారి సమయానికి దొరక్క బ్లాక్‌లో కొనాల్సి వచ్చేది. ఎరువుల వంకతో అవసరంలేని పురుగుల మందులను కొనాల్సి రావడం రైతులకు భారంగా మారేది. ప్రస్తుతం సర్టిఫై చేసిన ఎరువులను ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచడంతో ఎరువు కోసం రైతులు ఇబ్బందిపడిన దాఖలాలు కన్పించలేదు. లోడింగ్, అన్‌లోడింగ్ చార్జీల కింద బస్తాకు రూ.20 నుంచి రూ.50 వరకు రైతులకు ఆదా అవుతోంది. ఇలా నాలుగేళ్లలో రూ.100 కోట్లకు పైగా రైతులకు ఆదా అయ్యింది.
ఆర్బీకేలకు ఎరువుల లైసెన్సులు
కేంద్రం కేటాయించిన ఎరువులను జిల్లాల వారీగా మార్క్‌ఫెడ్ గోడౌన్లలో నిల్వచేసి అక్కడ నుంచి పీఏసీఎస్, ఆర్బీకేలకు సరఫరా చేయడానికి ఏటా రూ.70 కోట్లకు పైగా ఖర్చవుతోంది. ఈ భారాన్ని గత నాలుగేళ్లుగా ప్రభుత్వమే భరిస్తోంది. వచ్చే ఏడాది నిల్వ సామర్థ్యం పెరగనుండడంతో ఇందుకు కనీసం రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు ప్రతీ ఆర్బీకేలో కనీసం 20 టన్నులు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందుకోసం గ్రామస్థాయిలో వివిధ శాఖల పరిధిలో 1,864 గోదాములు, సచివాలయ ప్రాంగణాల్లో 3,979 గోదాములు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేలకు అనుబంధంగా 500 టన్నుల సామర్థ్యంతో రూ.493.15 కోట్లతో 1,167 గోదాములు నిరి్మస్తుండగా, వాటిలో 664 గోదాములు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన చోట్ల అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేలకు ఎరువుల విక్రయ లైసెన్సులు జారీచేశారు. ఫలితంగా సమయంతో పాటు రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు చాలావరకు తగ్గే అవకాశాలున్నాయి.
ఖరీఫ్–24కు 17.50 లక్షల టన్నులు ఎరువులు..
ఇక ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 81.25 లక్షల ఎకరాలు. ఇందులో ప్రధానంగా 37.79 లక్షల ఎకరాల్లో వరి, 14.48 లక్షల ఎకరాల్లో పత్తి, 13.88 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 5.85 లక్షల ఎకరాల్లో కందులు, 3.10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తుంటారు. ఖరీఫ్ కోసం 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు.
ఇందులో 6.50 లక్షల టన్నుల యూరియా, 2.30 లక్షల టన్నుల డీఏపీ, ఏడు లక్షల టన్నుల కాంప్లెక్స్, లక్ష టన్నుల ఎస్‌ఎస్‌పీ, 70 వేల టన్నుల ఎంఓపీ ఎరువులు అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేశారు. మరోపక్క.. ఇఫ్కో ద్వారా 5 లక్షల నానో యూరియా, 2 లక్షల నానో డీఏపీ బాటిల్స్ సరఫరాకు ఏర్పాట్లుచేస్తున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల్లో కనీసం 5.60 లక్షల టన్నులు ఆర్బీకేల ద్వారా సరఫరాకు ప్రణాళిక సిద్ధంచేసారు.
Comments
Please login to add a commentAdd a comment