
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల పంపిణీని పారదర్శకంగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించింది. రైతుల ముంగిటకు సాగు ఉత్పాదకాలను తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకేల పనితీరును ప్రత్యేకంగా అభినందించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్ర వ్యవసాయ శాఖ ఫెర్టిలైజర్ విభాగం డైరెక్టర్ జతిన్ చోప్రా ప్రశంసించారు. ఖరీఫ్‌లో ఎరువుల కేటాయింపు, పంపిణీపై అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ కార్యదర్శులు, కమిషనర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని ఎరువుల పంపిణీని గ్రామస్థాయికి తీసుకెళ్లాలని మిగిలిన రాష్ట్రాలకు సూచించారు. అవసరమైతే ఈ విధానంపై యుద్ధప్రాతిపదికన అధ్యయనం చేయాలన్నారు. ఆర్బీకేల ద్వారా ఎరువుల పంపిణీలో తీసుకొచ్చిన సంస్కరణలపై ఇతర రాష్ట్రాలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర స్థాయిలో ఓ నోడల్ అధికారిని నియమించాలని ఏపీ వ్యవసాయ శాఖ కమిషనర్‌కు సూచించారు.రాష్ట్రాల వారీగా ఎరువుల నిల్వలు, పంపిణీ తీరుతెన్నులపై ఆయన ఆరా తీశారు.
ఆర్బీకేల్లో 1.10లక్షల టన్నుల నిల్వలు..
సీజన్‌కు ముందుగానే ఆర్‌బీకేల్లో 1.10లక్షల టన్నుల ఎరువుల నిల్వలను అందు బాటులో ఉంచామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ జతిన్ చోప్రాకు వివరించారు. దీంతో రైతులు ఎమ్మార్పీ ధరలకే గ్రామాల్లో ఎరువులు పొందేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. ఏ ఒక్క డీలర్.. ఎమ్మార్పీకి మించి అమ్మకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎరువుల నాణ్యత, లభ్యతను పరిశీలించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసామని వివరించారు. కాగా, జూలై నెలకు సంబంధించి రాష్ట్రానికి కేటాయించిన 1.56లక్షల టన్నుల యూరియా, 63వేల టన్నుల డీఏపీ, 1.20లక్షల టన్నుల కాంప్లెక్స్, 26వేల టన్నుల ఎంవోపీ ఎరువులు ఇంకా చేరలేదని కమిషనర్ వివరించగా, ఆగస్టులో వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని జతిన్‌చోప్రా హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment