సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, యూరియా సహా అన్నిరకాల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. గుంటూరులోని చుట్టుగుంటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలు, సహకార సొసైటీలు, మార్క్‌ఫెడ్, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద ప్రస్తుత రబీకి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువుల కొరత ఉన్నట్టు సాగుతున్న అసత్య ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కృత్రిమ కొరత సృష్టించేందుకు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ముందస్తు ప్రణాళిక మేరకు ఎరువుల నిల్వలు ఉంచామన్నారు. ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో యూరియా కొరత ఉన్నట్టు మీడియా ద్వారా తెలిసిందని, అక్కడ అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
15 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయం
రబీ అవసరాలకు 23.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల పంపిణీకి ప్రణాళికలు వేశామని అరుణ్‌కుమార్ తెలిపారు. ఇందులో యూరియా 9 లక్షల టన్నులని తెలిపారు. గతేడాది అక్టోబర్ 1వ తేదీ నాటికి 6.97 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వలు ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ నాటికి రాష్ట్రానికి 12.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయని చెప్పారు. ఇందులో ఆదివారం నాటికి 15 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించామని తెలిపారు. ఆర్‌బీకేలు, సహకార సొసైటీలు, మార్క్‌ఫెడ్, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద 1.74 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో కలిపి మొత్తం 4.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఫిబ్రవరి నెలకు కేంద్రం నుంచి రావాల్సిన 2.95 లక్షల టన్నుల ఎరువులు కేటాయింపులు జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం 49,736 మెట్రిక్ టన్నుల యూరియా జనవరి నెల సరఫరాలో లోటు కింద కేటాయించిందని చెప్పారు. ఫిబ్రవరి నెలకు మరో 20,500 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరిందన్నారు. వీటిని తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు యుద్ధప్రాతిపదికన సరఫరా చేస్తున్నామన్నారు. వారం రోజుల్లో తూర్పు గోదావరికి 17,230 మెట్రిక్ టన్నులు, పశ్చిమ గోదావరికి 18వేల మెట్రిక్ టన్నులు, ఉత్తర కోస్తా జిల్లాలకు 14 వేల మెట్రిక్ టన్నులు, గుంటూరుకు 19,250 మెట్రిక్ టన్నులు, నెల్లూరు జిల్లాకు 12,800 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయనున్నామని తెలిపారు.
టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయండి
రైతు భరోసా కేంద్రాల వ్యవస్ధ ద్వారా ఎరువుల విక్రయాల్లో పారదర్శకత వచ్చిందని కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. అక్రమ నిల్వలు, అధిక రేట్లపై వ్యవసాయ శాఖ సిబ్బంది నిరంతరం దుకాణాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైనా డీలర్లు అక్రమంగా ఎరువుల నిల్వ ఉంచినా, అధిక ధరలకు అమ్మినా టోల్ ఫ్రీ నంబర్ 155251కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ఈ నెల 15న రైతుల ఖాతాలో జమచేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment