‘పంట చేతికందింది.. కొనుగోలుకు ఎవరైనా వస్తారో రారో.. మనమే మార్కెట్‌కు ఎలా తీసుకెళ్లాలో.. అక్కడ మనకేమీ తెలీదు.. వాళ్లు (దళారులు) చెప్పిన మాటే శాసనం.. కాదు కూడదంటే పంట కొనుగోలు చేయరు.. గట్టిగా మాట్లాడితే దిక్కున్న చోట చెప్పుకోమంటారు.. వారు చెప్పిన ధరకే తెగనమ్మినా, డబ్బులెప్పుడిస్తారో చెప్పరు.. చేతికందినప్పుడు హమ్మయ్యా.. అనుకోవాలి’ అని రాష్ట్రంలోని రైతులు ఇకపై దిగులు పడాల్సిన పని లేదు. దళారుల ఆటలకు చెక్ పెడుతూ నేరుగా ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేస్తుంది.
సాక్షి, అమరావతి: పంటను విక్రయించేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదన్న గట్టి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పంటల కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దళారులు, మధ్యవర్తులకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా వాస్తవ సాగుదారుల నుంచే ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను నేరుగా సేకరించేలా చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ క్రాప్‌లో నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా కేంద్రాల్లో శనివారం నుంచి ప్రదర్శనకు ఉంచబోతోంది.
(చదవండి: జన్యుమార్పిడి బియ్యం కలకలం)
రైతులు లేవనెత్తే అభ్యంతరాలను అక్కడికక్కడే పరిష్కరించి పంట వివరాలను అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంది. ‘మీ పేర్లు ఈ క్రాప్‌లో నమోదు కాలేదు.. అందువల్ల మీ పంటను కొనుగోలు చేయలేం’ అంటూ కొన్ని సందర్భాల్లో శాఖల మధ్య సమన్వయ లోపంతో ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీలు (పంటను సేకరించేవి) ఇబ్బంది పెట్టకుండా కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆరు గాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే దారి లేక రైతులు పడుతున్న ఇక్కట్లను పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. నేరుగా పంటల కొనుగోలుకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని మరింత ఆధునికీకరిస్తూ తాజాగా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ ఫాం రైతు భరోసా (యూడీపీఆర్బీ) యాప్ సాయంతో పక్కాగా పంట నమోదు చేస్తూ కొనుగోలు వేళ రైతులకు మరింత మేలు జరిగేలా చర్యలు చేపట్టింది.
యుద్ధ ప్రాతిపదికన ఈకేవైసీ
యూడీపీఆర్‌బీ యాప్ ద్వారా ఏ సర్వే నంబర్‌లో ఎంత విస్తీర్ణంలో.. ఏ రైతు.. ఏ రకం పంట సాగు చేశారు.. ఎప్పుడు కోత కొస్తుంది.. ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే నమోదు చేయించింది. రైతులకు వారు సాగు చేసిన పంట వివరాలతో కూడిన రసీదు (డిజిటల్ ఎక్‌నాలెడ్జ్‌మెంట్)లను కూడా అందజేసింది. ఆర్బీకేల్లో పంట వివరాలు నూరు శాతం నమోదు కాగా, 10–20 శాతం మేర మిగిలి ఉన్న క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు ఈ కేవైసీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరోపక్క ఈ క్రాప్‌లో నమోదైన పంట వివరాలను తొలిసారిగా ధాన్యం సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థ రూపొందించిన యాప్‌తో అనుసంధానిస్తోంది. తద్వారా రైతుల వివరాలన్నీ ఈ యాప్‌లోనూ కనిపిస్తాయి. గతంలో శాఖల వారీగా ఎవరి జాబితాలు వాళ్ల దగ్గరుండేవి. అందువల్ల సాంకేతిక సమస్య కారణంగా ఈ క్రాప్ వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడం, పంట నమోదులో దొర్లిన పొరపాట్లు రైతులకు నష్టం కలిగించేవి. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇక నుంచి ఈ పరిస్థితి ఉండదు.
50 లక్షల టన్నుల కొనుగోలుకు ఏర్పాట్లు
సామాజిక తనిఖీలో భాగంగా ఈ–పంట వివరాలను శనివారం నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించబోతున్నారు. రైతులు వీటిని పరిశీలించి పంట వివరాల నమోదులో తప్పులు చోటుచేసుకుని ఉంటే వీఏఏల దృష్టికి తీసుకెళ్తే మార్పులు, చేర్పులు చేస్తారు. అనంతరం కొనుగోలు కేంద్రాలు తెరిచే సమయానికి ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీల వద్ద సమాచారం పక్కాగా ఉంటుంది. కాగా, ఖరీఫ్ సీజన్‌లో సాగైన 39,35,798 ఎకరాల్లో వరి పంట వివరాలను నమోదు చేయగా, 37,43,649 ఎకరాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేశారు. వరి సాగు చేసిన 21,71,708 మంది రైతుల్లో ఇప్పటి వరకు 15,37,269 మంది వివరాలను ఈ కేవైసీ పూర్తి చేశారు.
రికార్డు స్థాయిలో గడిచిన ఖరీఫ్ సీజన్‌లో 2,500 కేంద్రాల ద్వారా 5.15 లక్షల మంది రైతుల నుంచి రూ.8,868 కోట్ల విలువైన 47.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఈసారి ఆర్‌బీకే స్థాయిలో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ రెండో వారం నుంచి 8,774 ఆర్‌బీకేల్లో పంటల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మార్పులన్నింటి వల్ల రైతులకు ఒక్క పంటల కోనుగోలులో మాత్రమే కాకుండా పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలోనూ మేలు జరుగుతుంది.
(చదవండి: అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా యువతి.. బిక్కుబిక్కుమంటూ..)
అభ్యంతరాలుంటే మార్పులు తథ్యం
వాస్తవ సాగుదారుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరించాలన్న ఆలోచనతో ఆర్బీకేల్లో పంట నమోదు వివరాలను ప్రదర్శిస్తున్నాం. వాటిని పరిశీలించి.. రైతులకు అభ్యంతరాలుంటే వీఏఏలకు చెబితే పక్కాగా నమోదు చేస్తారు. అవసరమైతే మరోసారి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. తొలిసారిగా ఈ పంట వివరాలను పౌరసరఫరాల సంస్థ యాప్‌తో అనుసంధానం చేస్తుండటం వల్ల సాగుతో సంబంధం లేని వారు, మధ్యవర్తులు, దళారులు వేరే ప్రాంతాల నుంచి ధాన్యం తీసుకొచ్చి ఆర్బీకేల్లో విక్రయించేందుకు ఆస్కారం ఉండదు.
– హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment