అంధకారంలో ఆస్పత్రి | Sakshi
Sakshi News home page

అంధకారంలో ఆస్పత్రి

Published Tue, Apr 23 2024 8:40 AM

ఆస్పత్రి వద్ద స్తంభంపై విరిగిపడిన చెట్టు  - Sakshi

● నిలిచిన రక్తశుద్ధి సేవలు ● పని చేయని జనరేటర్‌ ● బాత్‌రూమ్‌ల్లోనూ నీళ్లులేని వైనం

కొత్తగూడెంరూరల్‌: జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రి అంధకారమయమైంది. ఆదివారం సాయంత్రం వచ్చిన భారీ గాలులు, వర్షంలో ఆస్పత్రి ఆవరణలోని విద్యుత్‌ స్తంభాలపై చెట్లు విరిగి పడ్డాయి. ఇక ఆస్పత్రిలో ఉన్న జనరేటర్‌కు టెక్నీషియన్‌ లేకపోవడంతో అది కూడా ఆన్‌ చేయలేదు. దీంతో పేషెంట్లు, సహాయకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉక్కపోతతో పేషెంట్లు సతమతం కాగా, సహాయకులు విసనకర్రలు, అట్ట ముక్కలతో ఊపుతూ కనిపించారు. సోమవారం ఉదయం కూడా ఎక్స్‌రే, స్కానింగ్‌, డయాలసిస్‌ సెంటర్‌, ల్యాబ్‌ పని చేయలేదు.

డయాలసిస్‌ బాధితుల అవస్థలు..

జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఉన్న రక్త శుద్ధి కేంద్రంలో ప్రతీ రోజు 20 నుంచి 24 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రక్తశుద్ధి చేస్తారు. ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం నుంచి విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రక్త శుద్ధి కేంద్రంలోని పేషెంట్లను ఖాళీ చేయించారు. ఇక్కడ నిత్యం షిఫ్టుల వారీగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 1 వరకు, తిరిగి 1 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రక్తశుద్ధి చేస్తారు.

పెరిగిన ఓపీ సేవలు..

కలెక్టర్‌ ప్రియాంక ఆల ఆదేశాల మేరకు ఈ ఆస్పత్రిలో ఇటీవల ఓపీ సేవలు పెంచారు. ప్రస్తుతం నిత్యం ఔట్‌ పేషెంట్లు 500 మంది వరకు వస్తున్నారు. కాగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సోమవారం సాయంత్రం వరకు కూడా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించకపోవడంతో పేషెంట్లతో పాటు ఆస్పత్రి సిబ్బంది సైతం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రిలోని వాష్‌ రూమ్‌ల్లోనూ నీటి సరఫరా లేక పేషంట్‌లు మల, మూత్ర విసర్జనకు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం ఆస్పత్రిని సందర్శించి, పేషెంట్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆస్పత్రి అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖాళీగా ఉన్న రక్తశుద్ధి కేంద్రం
1/1

ఖాళీగా ఉన్న రక్తశుద్ధి కేంద్రం

Advertisement
Advertisement