సీఎం సభకు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

సీఎం సభకు సర్వం సిద్ధం

Published Tue, May 7 2024 11:45 AM

సీఎం సభకు సర్వం సిద్ధం

మధురపూడి: ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం పాల్గొంటున్న కోరుకొండలో సభకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ సభకు ప్రజలు అశేషంగా తరలి కానున్న నేపథ్యంలో పోలీసు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కోరుకొండ మండలం కాపవరం పెట్రోలు బంకు సమీపాన హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సీఎం జగన్‌ రోడ్డు మార్గంలో కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం రోడ్డులో నిర్వహించే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ ఏర్పాట్లను, హెలిప్యాడ్‌ను, సీఎం కాన్వాయ్‌ సాగే రోడ్డు, సభాస్థలాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ సోమవారం పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. కోరుకొండ సీఐ అడపా నాగమురళి, ఎస్సై ఆనందకుమార్‌ ఆధ్వర్యాన సభా స్థలంలో ఎత్తయిన భవనాలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఆయా భవనాల్లోకి అనుమతులు ఇవ్వరాదని వాటి యజమానులకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో నార్త్‌ జోన్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ ప్రభాకరరావు, సీఐ సూర్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ అభ్యర్థుల ఖర్చులపై

రెండో విడత ఆడిటింగ్‌

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై రెండో విడత ఆడిటింగ్‌ నిర్వహించామని పార్లమెంటరీ ఎన్నికల వ్యయ పరిశీలకుడు జై అరవింద్‌ తెలిపారు. ఎంపీ అభ్యర్థుల ఖర్చుల వివరాల ఆడిటింగ్‌ కలెక్టరేట్‌లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జై అరవింద్‌ మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో వివిధ సర్వైలెన్స్‌ బృందాలు అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టాయని చెప్పారు. రానున్న ఐదు రోజులూ ఖర్చుల వివరాలపై మరింతగా దృష్టి పెడతామని తెలిపారు. ఇప్పటి వరకూ జరిగిన ఖర్చుల వివరాలను ఎన్నికల విధుల్లో ఉండే అకౌంటింగ్‌ బృందం షాడో రిజిస్టర్‌లో నమోదు చేస్తోందని అన్నారు. దీంతో అభ్యర్థుల ఖర్చులను బేరీజు వేస్తామని తెలిపారు.

నామినేషన్‌ వేసిన సమయంలో అందజేసిన వ్యయ రిజిస్టర్‌లో అభ్యర్థులు తమ ఖర్చులను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రెండు రిజిస్టర్లను ఆడిటింగ్‌ చేసి, అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు చూపుతామని జై అరవింద్‌ తెలిపారు. ఖర్చులను హేతుబద్ధంగా నిర్ధారించాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఆడిటింగ్‌ నోడల్‌ అధికారి వేంకటేశ్వరరావు, 12 మంది అభ్యర్థుల ఆడిటింగ్‌ బృందాలు పాల్గొన్నాయి.

Advertisement
Advertisement