ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
పామిడి: ఏ పల్లెలోనైనా ఒకే పేరు ఉన్న వారు ఐదారు మంది ఉంటే గొప్ప. అలాంటిది ఆ ఊళ్లో దాదాపు వెయ్యి మందికి పైగా ఒకే పేరు పెట్టుకున్నారు. సుంకులమ్మ అనో... ముత్యాలయ్య అనో కేక వేస్తే చాలు పదుల సంఖ్యలో పోగవుతారు. తమ ఇలవేల్పును నిత్యం స్మరించేలా ఇలా గ్రామ దేవతల పేర్లు పెట్టామని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంతకు ఆ గ్రామం ఏదంటే... పామిడి మండలం రామరాజుపల్లి. గ్రామంలో 400 కుటుంబాలకు గాను 1,600 మంది జనాభా ఉన్నారు. వీరిలో ఓ వెయ్యి మందికి ముత్యాలయ్య, ముత్యాలరెడ్డి, ముత్యాలమ్మ పేర్లు ఉన్నాయి. అలాగే మరో 400 మందికి సుంకులమ్మ, సుంకిరెడ్డి, సుంకన్న తదితర పేర్లు ఉన్నాయి. ఇంత మంది ఒకే పేరు పెట్టుకోవడానికి కారణం ఏమని ఆరా తీస్తే.. ఆ గ్రామస్తులు ఓ పురాతన కథ వినిపిస్తున్నారు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం రండి...
అక్కాతమ్ముళ్లుగా జన్మించి...
రామరాజుపల్లి గ్రామం ఏర్పడినప్పుడు రెడ్ల సామాజిక వర్గానికి చెందిన గణేశం వంశంలో సుంకులమ్మ, ముత్యాలయ్య అక్క, తమ్ముడిగా జని్మంచారు. దైవాంశసంభూతులైన వారి మహిమతో గ్రామం సస్యశ్యామలంగా ఉంటూ వచ్చింది. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చిన వారు తీరుస్తూ వచ్చారు. దీంతో స్థానికులు వారిని గ్రామ దేవతలుగా ఆరాధించేవారు. కాలక్రమేణ వారు అంతర్థానమైన తర్వాత గ్రామంలో ఆలయాన్ని నిర్మించి, నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఇలవేల్పు పేరును సదా స్మరించేలా తమ సంతానానికి గ్రామ దేవతల పేర్లు పెడుతూ వచ్చారు.
ఏటా తిరునాల..
దాదాపు 250 సంవత్సరాలుగా రామరాజుపల్లిలో సుంకులమ్మ, ముత్యాలయ్య తిరునాలను ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. రామరాజుపల్లి, కాశేపల్లి, గుత్తి అనంతపురం గ్రామాల మధ్య ఐదురోజులపాటు సాగే ఈ తిరునాలకు జిల్లా వాసులతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తిరునాలలో ప్రధానంగా బండికి తాటిచెట్టు కాండాన్ని తాళ్లతో కట్టి అలంకరించి రథంగా భావిస్తారు. అనంతరం ఏడు జతల ఎద్దులను కట్టి రామరాజుపల్లి, కాశేపల్లి, గుత్తి అనంతపురం వరకూ లాగిస్తారు. ఎద్దులు బండిని లాగే క్రమంలో తాటి చెట్టు కాండం పైపైకి లేస్తూ ఉంటుంది. ఎద్దులు ఎంత బలంగా బండిని లాగితే కాండం అంత పైకి లేస్తుంది.
ఆ సమయంలో రథం వెంబడి సుంకులమ్మ, ముత్యాలయ్య ఉత్సవ మూర్తులను చిలకమ్మ పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. తొలిరోజు గుత్తి అనంతపురానికి చేరిన రథం మరుసటి రోజు రాత్రికి రామరాజుపల్లికి చేరుతుంది. తిరిగి మూడోరోజు రాత్రికి బయలుదేరి నాల్గో రోజుకు గుత్తి అనంతపురానికి చేరుతుంది. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. ఐదో రోజు తెల్లవారుజామున తిరిగి బండిని రామరాజుపల్లికి చేర్చడంతో తిరునాల ముగుస్తుంది. ముగింపు రోజున గ్రామంలో దేవర నిర్వహించి, మొక్కులు తీర్చుకుంటారు.
ఈ నెల 22 నుంచి తిరునాల ప్రారంభం..
రామరాజుపల్లిలో ఈ నెల 22వ తేదీ గ్రామదేవత తిరునాల ప్రారంభం కానుంది. ఈ మేరకు గ్రామ సర్పంచ్ డీసీ ముత్యాలరెడ్డి, ఎంపీపీ భోగాతి మురళీమోహన్‌రెడ్డి తెలిపారు. 26వ తేదీ ఆదివారం వరకూ తిరునాల ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment