grama devathalu
-
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
పామిడి: ఏ పల్లెలోనైనా ఒకే పేరు ఉన్న వారు ఐదారు మంది ఉంటే గొప్ప. అలాంటిది ఆ ఊళ్లో దాదాపు వెయ్యి మందికి పైగా ఒకే పేరు పెట్టుకున్నారు. సుంకులమ్మ అనో... ముత్యాలయ్య అనో కేక వేస్తే చాలు పదుల సంఖ్యలో పోగవుతారు. తమ ఇలవేల్పును నిత్యం స్మరించేలా ఇలా గ్రామ దేవతల పేర్లు పెట్టామని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంతకు ఆ గ్రామం ఏదంటే... పామిడి మండలం రామరాజుపల్లి. గ్రామంలో 400 కుటుంబాలకు గాను 1,600 మంది జనాభా ఉన్నారు. వీరిలో ఓ వెయ్యి మందికి ముత్యాలయ్య, ముత్యాలరెడ్డి, ముత్యాలమ్మ పేర్లు ఉన్నాయి. అలాగే మరో 400 మందికి సుంకులమ్మ, సుంకిరెడ్డి, సుంకన్న తదితర పేర్లు ఉన్నాయి. ఇంత మంది ఒకే పేరు పెట్టుకోవడానికి కారణం ఏమని ఆరా తీస్తే.. ఆ గ్రామస్తులు ఓ పురాతన కథ వినిపిస్తున్నారు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం రండి... అక్కాతమ్ముళ్లుగా జన్మించి... రామరాజుపల్లి గ్రామం ఏర్పడినప్పుడు రెడ్ల సామాజిక వర్గానికి చెందిన గణేశం వంశంలో సుంకులమ్మ, ముత్యాలయ్య అక్క, తమ్ముడిగా జని్మంచారు. దైవాంశసంభూతులైన వారి మహిమతో గ్రామం సస్యశ్యామలంగా ఉంటూ వచ్చింది. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చిన వారు తీరుస్తూ వచ్చారు. దీంతో స్థానికులు వారిని గ్రామ దేవతలుగా ఆరాధించేవారు. కాలక్రమేణ వారు అంతర్థానమైన తర్వాత గ్రామంలో ఆలయాన్ని నిర్మించి, నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఇలవేల్పు పేరును సదా స్మరించేలా తమ సంతానానికి గ్రామ దేవతల పేర్లు పెడుతూ వచ్చారు. ఏటా తిరునాల.. దాదాపు 250 సంవత్సరాలుగా రామరాజుపల్లిలో సుంకులమ్మ, ముత్యాలయ్య తిరునాలను ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. రామరాజుపల్లి, కాశేపల్లి, గుత్తి అనంతపురం గ్రామాల మధ్య ఐదురోజులపాటు సాగే ఈ తిరునాలకు జిల్లా వాసులతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తిరునాలలో ప్రధానంగా బండికి తాటిచెట్టు కాండాన్ని తాళ్లతో కట్టి అలంకరించి రథంగా భావిస్తారు. అనంతరం ఏడు జతల ఎద్దులను కట్టి రామరాజుపల్లి, కాశేపల్లి, గుత్తి అనంతపురం వరకూ లాగిస్తారు. ఎద్దులు బండిని లాగే క్రమంలో తాటి చెట్టు కాండం పైపైకి లేస్తూ ఉంటుంది. ఎద్దులు ఎంత బలంగా బండిని లాగితే కాండం అంత పైకి లేస్తుంది. ఆ సమయంలో రథం వెంబడి సుంకులమ్మ, ముత్యాలయ్య ఉత్సవ మూర్తులను చిలకమ్మ పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. తొలిరోజు గుత్తి అనంతపురానికి చేరిన రథం మరుసటి రోజు రాత్రికి రామరాజుపల్లికి చేరుతుంది. తిరిగి మూడోరోజు రాత్రికి బయలుదేరి నాల్గో రోజుకు గుత్తి అనంతపురానికి చేరుతుంది. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. ఐదో రోజు తెల్లవారుజామున తిరిగి బండిని రామరాజుపల్లికి చేర్చడంతో తిరునాల ముగుస్తుంది. ముగింపు రోజున గ్రామంలో దేవర నిర్వహించి, మొక్కులు తీర్చుకుంటారు. ఈ నెల 22 నుంచి తిరునాల ప్రారంభం.. రామరాజుపల్లిలో ఈ నెల 22వ తేదీ గ్రామదేవత తిరునాల ప్రారంభం కానుంది. ఈ మేరకు గ్రామ సర్పంచ్ డీసీ ముత్యాలరెడ్డి, ఎంపీపీ భోగాతి మురళీమోహన్‌రెడ్డి తెలిపారు. 26వ తేదీ ఆదివారం వరకూ తిరునాల ఉంటుందని పేర్కొన్నారు. -
ఊరి కోసం పండుగ... 75 ఏళ్లుగా ఉత్సాహంగా జరుపుకుంటున్న ప్రజలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : 75 సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రారంభమైన ఊర పండుగ (పెద్ద పండుగ)కు నగర ప్రజలు ఇస్తున్న ప్రాధాన్యత ఏటేటా మరింతగా పెరుగుతోంది. నగరంలో 12 చోట్ల గ్రామ దేవతల గుడులను ఏర్పాటు చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. వచ్చే నెల 9న నిజామాబాద్‌లో ఈ ఊర పండుగ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 54 కుల సంఘాలతో కూడిన సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనే ఈ పండుగ ఉత్సవాలు, ఊరేగింపులు భారీ ఎత్తున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నగరంలోని 12 ప్రాంతాల్లో.. నిజామాబాద్ నగరంలోని మూడు ఏరియాల్లోని 12 చోట్ల గ్రామ దేవతల గుడులు ఉన్నాయి. దుబ్బ లో రాట్నం, చక్రం, పెద్దమ్మ, పౌడాలమ్మ గుడులు, వినాయక్‌నగర్‌లో మహాలక్ష్మి, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ గుడులు, సిర్నాపల్లి గడి రోడ్డు లో కొండల్ రాయుడు, బోగస్వామిలు పేరిట నాలుగు గుడులు, సమ్మక్క సారక్క పేరిట ఒక గుడి ఉన్నాయి. ఈ 12 గ్రామ దేవతల గుడులకు సంబంధించిన ఊరేగింపు ఖిల్లా వద్ద ఉన్న గద్దె నుంచి వచ్చే నెల 9న ప్రారంభమవుతుంది. అంతకు ముందు 4వ తేదీన బండారి పోసి క్రతువును ప్రారంభించనున్నారు. ఊరేగింపు పెద్దబజార్ చౌరస్తా వద్ద దుబ్బ, వినాయక్‌నగర్, సిర్నాపల్లి గడి రోడ్డు విభాగాలుగా విడిపోతుంది. తరువాత 12 గ్రామ దేవతల గుడులకు తీసుకెళ్లి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ క్రమంలో గాజుల్‌పేటలోని వివేకానంద చౌరస్తా వద్ద భారీ పోలీసు బందోబస్తు మధ్య సరి (ఇంటిపై చల్లుకునే పదార్థం) కోసం ప్రజలు ఎగబడతారు. ఊరేగింపు రోజు తెల్లవారుజాము 2 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు మొదలవుతుంది. మామిడి కర్రతో విగ్రహాలు.. 12 గ్రామ దేవతల గుడుల్లో ప్రతిష్ఠించడానికి ప్రతి ఏడాది ఎప్పటికప్పుడు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. మామిడి కర్రతో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. నగరంలోని నకాస్ గల్లీలో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. బండారు పోసిన తరువాత ఈ విగ్రహాల తయారీ ప్రారంభిస్తారు. కర్ర విగ్రహాలను ధర్మరాజు, విఠల్ కుటుంబాలు వంశపారంపర్యంగా తయారు చేస్తూ వస్తున్నాయి. కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించిన తరువాత పాత విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. మరిన్ని సంఘాల భాగస్వామ్యం పెద్ద పండుగ ఉత్సవం, ఊరేగింపు కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు మరిన్ని సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తూ వస్తున్నాం. దీంతో ప్రజల్లో ఐకమత్యం పెరుగు తోంది. మరోవైపు రాజకీయాలకతీతంగా ఈ క్రతువును ముందుకు తీసుకెళుతూ విజయవంతంగా పయనిస్తున్నాం. – యెండల లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు, సర్వసమాజ్ కమిటీ -
కనుల పండువగా గంగమ్మ జాతర
తిరుపతి తుడా: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని చెల్లెలుగా భాసిల్లుతున్న తిరుపతి గ్రామదేవత గంగమ్మ ఉత్సవాలు కనుల పండువగా ముగిశాయి. గత నెల 10వ తేదీ మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమైన గంగమ్మజాతర మంగళవారంతో ముగిసింది. బుధవారం తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూప చెంప తొలగింపుతో జాతర పరిసమాప్తమవుతుంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పర్యవేక్షణలో తొలిసారిగా భారీ ఏర్పాట్లతో దగ్గరుండి జాతరను నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు జాతరను ఏకాంతంగా నిర్వహించారు. కరోనా తర్వాత 900 ఏళ్లనాటి చరిత్రను చాటిచెప్పేలా తిరుపతి శ్రీతాతయ్యగుంట చిన్న గంగమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించారు. మంగళవారం లక్ష మందికి పైగా భక్తులు పొంగళ్లు పెట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర రోజున ప్రతి ఏటా వరుణుడు కరుణించడం పరిపాటి. గత సంప్రదాయాలతో పాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తొలిసారి అమ్మవారికి తన ఇంటి నుంచి సారె తీసుకురావడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యుల చేత ఊరేగింపుగా అమ్మవారికి సారెను సమర్పించారు. జాతర రోజున మునుపెన్నడూ లేని విధంగా లక్షమందికి పైగా భక్తులకు మటన్ బిరియానీని పంచిపెట్టారు. -
పూజించారు.. పట్టుకుపోయారు
ఇచ్ఛాపురం రూరల్: గ్రామదేవత అంటే ఆ దొంగలకు భయంతో పాటు భక్తి మెండుగా ఉంది కాబోలు...ప్రత్యేక పూజలు చేసి మరీ అమ్మవారి వెండి ప్రతిమను ఎత్తుకుపోయారు. ఇచ్ఛాపురం మండలం మండపల్లిలో ఇటీవల తొమ్మిది రోజుల పాటు గ్రామస్తులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు పూజా గది తలుపు తాళాన్ని రంపపు బ్లేడ్‌తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. సుమారు 42 తులాల విలువైన అమ్మవారి వెండి ప్రతిమను ఎత్తుకు పోయే ముందు అమ్మవారి సన్నిధిలో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయని పూజారి రమేష్ రౌళో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ డి.వి.వి.సతీష్‌కుమార్, రూరల్ ఎస్సై బడ్డ హైమావతిలు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌ను రప్పించి పరిశోధించారు. అమ్మవారి అలంకరణ నగలు, హుండీలను ప్రతి రోజూ పూజారి ఇంటికి తీసుకువెళ్తుండటంతో పెద్ద మొత్తంలో నష్టం కలగలేదని గ్రామపెద్దలు తెలిపారు. (చదవండి: మితిమీరి.. దిగజారి) -
నేడే ‘ఊర’ పండుగ
నిజామాబాద్‌కల్చరల్ : ఊరంతా మెచ్చే పండుగ వచ్చేసింది. అమ్మను కొలవడానికి ఇందూరు సర్వసమాజం సన్నద్ధమైంది. శనివారం రాత్రి నుంచే వేడుక ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం ఊర పండుగ జరగనుంది. వేడుకకు సంబంధించి బల్దియా అధికారులు, సర్వసమాజ్ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో ఏటా ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ఊర పండుగను జరుపుకుంటున్నారు. ఊర పండుగ చరిత్ర గురించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎనిమిది దశాబ్దాల క్రితం నిజామాబాద్‌లో గత్తర, కలర, ప్లేగువంటి ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ఎడ్లు మృత్యువాతపడడంతో వ్యవసాయం దెబ్బతింది. వ్యాధుల కారణంగా ప్రజలు నగరం విడిచిపోయి శివారు ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవించసాగారు. గ్రామ దేవతల ఆగ్రహం వల్లే వ్యాధులు ప్రబలుతున్నాయని భావించిన గ్రామ పెద్దలు.. ప్రజలను కాపాడేందుకు అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. నిజామాబాద్‌లోని 9 మున్నూరుకాపు సంఘాలతోపాటు గోనెకాపు, పాకనాటి సంఘాలను కలుపుకుని ఆషాఢ మాసంలో ఊర పండుగ చేశారు. అమ్మ దయతో వ్యాధులు తగ్గిపోయాయి. గ్రామం విడిచి వెళ్లినవారు ఊరిలోకి తిరిగి వచ్చారు. వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు ఊరంతా బండారు చల్లి కట్టడి చేశారు. ఆ ఆనవాయితీనే ఏటా కొనసాగిస్తున్నారు. ‘సరి’ విశిష్టత ఊరపండుగలో వినియోగించే ‘సరి’కి ఎంతో విశిష్టత ఉంది. దీని కోసం ప్రజలు తోపులాడుకుంటారు. నవధాన్యాలు, పిండితో సరిని తయారు చేస్తారు. ఇందులో గ్రామదేవతలకు బలిచ్చే జీవాల రక్తం, పేగులను కలుపుతారు. ఈ సరిని ఇళ్లపై, ఎడ్లపై చల్లితే అనారోగ్యం దరి చేరదని నగరవాసుల అపార నమ్మకం. శనివారం అర్ధరాత్రినుంచే.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠించే గ్రామదేవతలను వడ్రంగులు తీర్చిదిద్దారు. నగరంలోని 12 ప్రధాన చౌరస్తాల్లో అమ్మవారిని కొలుస్తూ పసుపు, కుంకుమతో ముగ్గువేసి బండారు వేసి పూజలు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటాక అశోక్వీధిలోని వడ్లదాతి వద్ద తయారు చేసిన గ్రామదేవతలను ఖిల్లా తేలిమైసమ్మ గద్దెకు తీసుకువెళతారు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అక్కడినుంచి విగ్రహాలతో శోభాయాత్ర ప్రారంభమవుతుంది. గాజుల్‌పేట, గురుద్వార్, బడాబజార్, కస్బాగల్లి, గోల్హనుమాన్ చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్‌లోని మహాలక్ష్మీనగర్ వరకు శోభాయాత్ర సాగుతుంది. మూడు గ్రామ దేవతలను బడాబజార్ సమీపం నుంచి దుబ్బ వైపు తీసుకువెళ్తారు.