ఊరి కోసం పండుగ... 75 ఏళ్లుగా ఉత్సాహంగా జరుపుకుంటున్న ప్రజలు | - | Sakshi
Sakshi News home page

ఊరి కోసం పండుగ... 75 ఏళ్లుగా ఉత్సాహంగా జరుపుకుంటున్న ప్రజలు

Published Sat, Jun 24 2023 1:06 AM | Last Updated on Sat, Jun 24 2023 11:28 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : 75 సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో నిజామాబాద్‌ నగరంలో ప్రారంభమైన ఊర పండుగ (పెద్ద పండుగ)కు నగర ప్రజలు ఇస్తున్న ప్రాధాన్యత ఏటేటా మరింతగా పెరుగుతోంది. నగరంలో 12 చోట్ల గ్రామ దేవతల గుడులను ఏర్పాటు చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. వచ్చే నెల 9న నిజామాబాద్‌లో ఈ ఊర పండుగ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 54 కుల సంఘాలతో కూడిన సర్వసమాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనే ఈ పండుగ ఉత్సవాలు, ఊరేగింపులు భారీ ఎత్తున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

నగరంలోని 12 ప్రాంతాల్లో..
నిజామాబాద్‌ నగరంలోని మూడు ఏరియాల్లోని 12 చోట్ల గ్రామ దేవతల గుడులు ఉన్నాయి. దుబ్బ లో రాట్నం, చక్రం, పెద్దమ్మ, పౌడాలమ్మ గుడులు, వినాయక్‌నగర్‌లో మహాలక్ష్మి, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ గుడులు, సిర్నాపల్లి గడి రోడ్డు లో కొండల్‌ రాయుడు, బోగస్వామిలు పేరిట నాలుగు గుడులు, సమ్మక్క సారక్క పేరిట ఒక గుడి ఉన్నాయి. ఈ 12 గ్రామ దేవతల గుడులకు సంబంధించిన ఊరేగింపు ఖిల్లా వద్ద ఉన్న గద్దె నుంచి వచ్చే నెల 9న ప్రారంభమవుతుంది. అంతకు ముందు 4వ తేదీన బండారి పోసి క్రతువును ప్రారంభించనున్నారు.

ఊరేగింపు పెద్దబజార్‌ చౌరస్తా వద్ద దుబ్బ, వినాయక్‌నగర్‌, సిర్నాపల్లి గడి రోడ్డు విభాగాలుగా విడిపోతుంది. తరువాత 12 గ్రామ దేవతల గుడులకు తీసుకెళ్లి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ క్రమంలో గాజుల్‌పేటలోని వివేకానంద చౌరస్తా వద్ద భారీ పోలీసు బందోబస్తు మధ్య సరి (ఇంటిపై చల్లుకునే పదార్థం) కోసం ప్రజలు ఎగబడతారు. ఊరేగింపు రోజు తెల్లవారుజాము 2 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు మొదలవుతుంది.

మామిడి కర్రతో విగ్రహాలు..
12 గ్రామ దేవతల గుడుల్లో ప్రతిష్ఠించడానికి ప్రతి ఏడాది ఎప్పటికప్పుడు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. మామిడి కర్రతో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. నగరంలోని నకాస్‌ గల్లీలో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. బండారు పోసిన తరువాత ఈ విగ్రహాల తయారీ ప్రారంభిస్తారు. కర్ర విగ్రహాలను ధర్మరాజు, విఠల్‌ కుటుంబాలు వంశపారంపర్యంగా తయారు చేస్తూ వస్తున్నాయి. కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించిన తరువాత పాత విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.

మరిన్ని సంఘాల భాగస్వామ్యం
పెద్ద పండుగ ఉత్సవం, ఊరేగింపు కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు మరిన్ని సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తూ వస్తున్నాం. దీంతో ప్రజల్లో ఐకమత్యం పెరుగు తోంది. మరోవైపు రాజకీయాలకతీతంగా ఈ క్రతువును ముందుకు తీసుకెళుతూ విజయవంతంగా పయనిస్తున్నాం.
– యెండల లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు, సర్వసమాజ్‌ కమిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement