బోనస్ ప్రకటించకపోతే కలెక్టరేట్ దిగ్బంధం
● పసుపు పంటకు క్వింటాలుకు
రూ.12వేలు ధర ఇవ్వాలి
● పసుపు బోర్డుకు చట్టబద్ధత,
కనీస మద్దతు ధర కోసం కేంద్రంపై పోరాటం
● స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
● మార్కెట్‌యార్డులో పసుపు పంట పరిశీలన
సుభాష్‌నగర్: పసుపు పంటకు బోనస్ మార్చి 1 లోపు ప్రకటించపోతే కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. శనివారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు పంటను పరిశీలించారు. పసుపు రైతులతో మాట్లాడి వారి కష్టాలు, సమస్యలు, ధరలు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. మార్కెట్ యార్డులో వ్యాపారులంతా సిండికేట్‌గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారని, నాలుగైదు రోజులు వేచి చూసినా పసుపు కొనడం లేదన్నారు. ఒక రకంగా రైతును బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని, నాణ్యమైన పసుపునకు కూడా ధర రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పసుపునకు క్వింటాలుకు రూ.12 వేల కనీస ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే కేవలం రూ.8 వేలు మాత్రమే ధర పలుకుతోందని, అయినా కూడా ప్రభుత్వం బోనస్ ఊసెత్తడం లేదని విమర్శించారు. రూ.12 వేల కంటే తక్కువ ధర వచ్చిన రైతులకు మిగతా డబ్బులు తక్షణమే బోనస్ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేరుకే కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. దీంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయన్నారు. బోర్డుకు చట్టబద్ధత, కనీస మద్దతు ధర కోసం కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. దీన స్థితిలో ఉన్న పసుపు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనన్నారు. వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు చివాట్లు, మొట్టికాయలు వేసినా తనపై కామెంట్లు చేస్తున్నారని, తాను ఆయనలా మాట్లాడి తన స్థాయి తగ్గించుకోలేనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదని హెచ్చరించారు.
ఆమె వెంట మాజీ మేయర్ దండు నీతూకిరణ్, మహిళా నాయకులు గడ్డం సుమనారెడ్డి, విశాలినీరెడ్డి, ముత్యంరెడ్డి, నరేష్ నాయక్, దాదన్నగారి మధుసూదన్, సిర్ప రాజు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment