ఐదు కిలోలు మింగేస్తున్నారు
బాల్కొండ: రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఐదు కిలోల చొప్పున తక్కువ తూకం వేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. బాల్కొండ మండలంలోని శ్రీరాంపూర్‌లో బాల్కొండకు చెందిన కొందరు వ్యాపారులు శనివారం జొన్నల తూకం వేశారు. జొన్నలు విక్రయించిన రైతు అక్కడి కాంటాపై తన బరువును చూసుకోగా 59 కిలోలుగా చూపించింది. రెండు రోజుల క్రితం ఆర్మూర్‌లోని ఓ ఆస్పత్రిలో రైతు తన బరువును చూసుకోగా 64 కేజీలు వచ్చిందని.. రెండు రోజుల్లో ఐదు కిలోలు ఎలా తగ్గానని రైతుకు అనుమానం వచ్చింది. వెంటనే మరో రైతును వెంటబెట్టుకొని ఆర్మూర్‌లోని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ బరువు చూసుకోగా 64 కిలోలు రాగా, ఆయన వెంట వెళ్లిన రైతు బరువు 88 కేజీలు వచ్చింది. మళ్లీ ఇద్దరు రైతులు జొన్నవ్యాపారుల కాంటాపై బరువు చూసుకోగా మొదటి రైతు బరువు 59 కిలోలు, రెండో రైతు బరువు 83 కిలోలు వచ్చింది. దీంతో వ్యాపారులు తమను 5కిలోల చొప్పున దోచుకుంటున్నారని నిర్ధారణకు వచ్చి తిరగబడ్డారు. చేసిన తప్పును ఒప్పుకున్న వ్యాపారులు తూకం పూర్తయిన రైతులకు ఐదు కిలోలతోపాటు అదనంగా మరో ఐదు కిలోల డబ్బులు చెల్లిస్తామని ఒప్పందం చేసుకోవడంతో వదిలేశారు. తేమ శాతం చూసే యంత్రాల్లో కూడా పచ్చి మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● జొన్న తూకంలో మోసం!
● పసిగట్టిన శ్రీరాంపూర్ రైతులు
● తప్పు చేసినట్లు ఒప్పుకున్న
వ్యాపారులు
Comments
Please login to add a commentAdd a comment