మణిపూర్ ఒక మంచి వార్తను వినిపించింది. ఆ రాష్ట్రానికి చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్‌జామ్ తీసిన ‘ఆండ్రో డ్రీమ్స్’ ముంబైలో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో బెస్ట్ డాక్యుమెంటరీగా ఎంపికైంది. మణిపూర్‌లోని మారుమూల గ్రామం ‘ఆండ్రో’లో ఆడపిల్లల ఫుట్‌బాల్ క్లబ్‌ను 30 ఏళ్లుగా పరిస్థితులకు ఎదురీది నడుపుతున్న ‘లైబి’ అనే మహిళ పోరాటాన్ని ఈ డాక్యుమెంటరీ రికార్డు చేసింది. ఆడపిల్లల క్రీడా స్వేచ్ఛను ఎన్ని అడ్డంకులొచ్చినా కొనసాగనివ్వాలనే సందేశం ఇచ్చే ఈ డాక్యుమెంటరీ దేశ, విదేశాల్లో ప్రశంసలు పొందుతోంది.
అంతా చేసి ఎనిమిది వేల మంది జనాభా మించని ఊరు ఆండ్రో. మణిపూర్ తూర్పు ఇంఫాల్ జిల్లాలో మారుమూల ఉంటుంది అది. అక్కడి ఆడపిల్లలు ఫుట్‌బాల్ ఆడితే ఏంటి... ఆడకపోతే ఏంటి? కాని 60 ఏళ్ల లైబి మాత్రం– ఆడాల్సిందే అంటోంది. ఆమె గత ముప్పై ఏళ్లుగా ‘ఆండ్రో మహిళా మండల్ అసోసియేషన్– ఫుట్‌బాల్ క్లబ్’ (అమ్మ– ఎఫ్‌సీ) నడుపుతోంది. ఈ క్లబ్‌కు నిధులు లేవు. బిల్డింగ్ లేదు. ఊళ్లో ప్రోత్సాహం లేదూ, ఏమీ లేదు. కాని లైబి మాత్రం అంతా తానై క్లబ్‌ను నడుపుతోంది. ఈ మధ్యే ఆమె ఒక పూరి పాక నిర్మించి దానినే క్లబ్ బిల్డింగ్‌గా ప్రారంభించుకుంది.
‘అమ్మాయిలు కేవలం వంటకు, ఇంటి పనికి అంకితమై పోకూడదు. చదువుకోవాలి. ఆడాలి. ధైర్యంగా భవిష్యత్తును నిర్మించుకోవాలి. మా ప్రాంతంలో పురుషులదే సర్వాధికారం. ఇంటి పెద్ద, తెగ పెద్ద ఎంత చెప్తే అంత. వారి దృష్టిలో ఆడవాళ్ల గురించి చింతించాల్సింది ఏమీ ఉండదు. అమ్మాయిలు ఆడతామన్నా ఒప్పుకోరు. నా పోరాటం వల్లే ఇవాళ మా ఊరి నుంచి జాతీయ స్థాయిలో అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు’ అంటుంది లైబి. ఈమె పోరాటం ప్రపంచానికి చెప్పదగ్గది అనిపించింది మణిపూర్‌కే చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్‌జామ్‌కు. అలా తయారైన డాక్యుమెంటరీనే ‘ఆండ్రో డ్రీమ్స్’.
ఇద్దరి కథ
ప్రస్తుతం ముంబైలో ‘జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అట్టహాసంగా జరుగుతోంది. ఇందులో ‘ఆండ్రో డ్రీమ్స్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఇప్పటికే కేరళ, కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఎంపికైన ఈ డాక్యుమెంటరీ ముంబైలో విమర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ‘దీనికి కారణం ఆండ్రోలో అమ్మ క్లబ్‌ను నడుపుతున్న లైబి పోరాటాన్ని, ఆ క్లబ్‌లో గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉంటూ మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనుకునే నిర్మల అనే అమ్మాయి ఆకాంక్షలని నేను చూపించడమే. ఒక రకంగా చాదస్త వ్యవస్థతో రెండు తరాల స్త్రీల పోరాటం ఈ డాక్యుమెంటరీ’ అని తెలిపింది మీనా లాంగ్‌జామ్.
మణిపూర్ వెలుతురు
నిజానికి మే 3వ తేదీ నుంచి మణిపూర్ వేరే కారణాల రీత్యా వార్తల్లో ఉంది. కాని మణిపూర్‌ను అభిమానించేవారికి ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ సాధిస్తున్న విజయాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ‘నా డాక్యుమెంటరీ విజయం మా ప్రాంతంలో గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టే ఉత్సాహాన్ని ఇస్తే అంతే చాలు’ అంది మీనా లాంగ్‌జామ్. మణిపూర్ యూనివర్సిటీలో కల్చరల్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న మీనా పాఠాలు చెప్పడంతో పాటు డాక్యుమెంటరీలు కూడా తీస్తుంది. 2015లో ఆమె మణిపూర్‌లో ఫస్ట్ మహిళా ఆటోడ్రైవర్‌గా ఉన్న లైబీ ఓయినమ్ మీద డాక్యుమెంటరీ తీస్తే దానికి చాలా పేరొచ్చింది.
ఆ తర్వాత ‘అచౌబీ ఇన్ లవ్’ పేరుతో పోలో ఆటకు అనువైన స్థానిక జాతి అశ్వాలపై డాక్యుమెంటరీ తీస్తే దానికీ పేరొచ్చింది. ఇప్పుడు ‘ఆండ్రో డ్రీమ్స్’ మణిపూర్ ఘనతను చాటుతోంది. బాలికలు, యువతులు క్రీడల్లో ఎంతో రాణిస్తున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలు ఉండనే ఉంటాయి. అలాంటి ప్రతి చోట అమ్మాయిలను ప్రోత్సహించే లైబి లాంటి యోధురాళ్లు, వారి గెలుపు గాధలను లోకానికి తెలిపే మీనా లాంటి వాళ్లు ఉండాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment