Sakshi News home page

Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను'

Published Fri, Mar 29 2024 8:23 AM

Afshan Ashik: Challenges In Her Football Career - Sakshi

ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి. ఇప్పుడు జమ్ము–కశ్మీర్‌లో కేవలం బాలికల కోసం ఫుట్‌బాల్‌ అకాడెమీ నడుపుతున్న ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్‌ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు. యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్‌ ఆషిక్‌ ఒక ఉదాహరణ.

కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్‌లో ఒక ఫోటో వైరల్‌ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్‌ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్‌ ఆషిక్‌. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్‌ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్‌ పెల్టర్‌’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్‌బాల్‌ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది.

‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం  పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్‌ స్టోన్‌ పెల్టర్‌ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్‌బాల్‌ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్‌ ఆషిక్‌.

ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్‌ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె.

ముంబై వెళ్లి..
కశ్మీర్‌ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్‌ను తగిన ప్రోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్‌ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్‌ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్‌ నుంచి తొలిప్రొఫెషనల్‌ ఫిమేల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్‌బాల్‌ నేర్చుకుని ఏం చేస్తావ్‌ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మా ప్రాంతం నుంచి ఫుట్‌బాల్‌లోకి రాలేదు.

కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్‌ విమెన్స్‌ లీగ్‌లో ఆడాను. గోల్‌ కీపర్‌గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్‌బాల్‌ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మా ్రపాంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్‌ బాలికల కోసం యునీక్‌ ఫుట్‌బాల్‌ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్‌.

మరింత గుర్తింపు..
నేడు జమ్ము కశ్మీర్‌లో మహిళా ఫుట్‌బాల్‌ పేరు చెప్తే అఫ్షాన్‌ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్‌ పెల్టర్‌ని కాను. గోల్‌ కీపర్‌ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె.

ఇవి చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్‌ అయిన యువతి!

Advertisement

What’s your opinion

Advertisement