బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఆ ఎఫ్‌ఐఆర్‌లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్‌సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment