బెంగళూరు : ఆర్‌ఎస్‌ఎస్ అంతర్గత సర్వే ప్రకారం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లు కూడా గెలవదని, రాష్ట్రంలో ఎనిమిది సీట్లు కూడా దాటదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా రావని ఆర్‌ఎస్‌ఎస్ అంతర్గత సర్వే చెబుతోంది. అంతర్గత పోరుతో రాష్ట్ర బీజేపీ పద్నాలుగు,పదిహేను సీట్లలో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. కమలం ఎనిమిది లోక్‌సభ స్థానాలు దాటడం కష్టమేనని’ జోస్యం చెప్పారు.
ఇన్ని అబద్దాలా?
కర్ణాటకకు కరువు సాయం విషయంలో హోం మంత్రి అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించిన ఖర్గే.. కరువు సాయం కోరుతూ సీఎం సిద్ధరామయ్య ‘ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రి (సహాయం కోరుతూ)తో భేటీ అవ్వడం అబద్ధమా? ఐఎంసీటీ (ఇంటర్ మినిస్ట్రీరియల్ కేంద్ర బృందం) కర్ణాటకలో సర్వే చేసి కేంద్రానికి నివేదిక సమర్పించడం అబద్ధమా? ఆ తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమావేశాన్ని నిర్వహించి, కర్ణాటకలో కరువును అధిగమించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను లిఖితపూర్వకంగా ప్రశంసించడం అబద్ధమా? అని ప్రశ్నలు సంధించారు. అమిత్ షా ఎందుకు ఇలా అబద్దాలు ఆడుతున్నారోనని అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. .
కరువుపై కాంగ్రెస్ రాజకీయం
కాగా, మంగళవారం బెంగళూరులో పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా కర్ణాటకలో కరువు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలు ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందని,ఈ అంశం ఎన్నికల సంఘం వద్ద ఉందని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. అమిత్ షా వ్యాఖ్యలపై ప్రియాంక్ ఖర్గే స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment