అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్‌

Published Sun, Apr 28 2024 3:58 AM

CM YS Jagan Fires On Chandrababu

సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్‌

2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలు

అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు

ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ టెన్‌ అంటున్నాడు

ఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?

ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్‌ కాదా?

సాక్షి, అమరావతి: 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టు కట్టి దొంగ హామీలిచ్చి ప్రజలను వంచించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌..  సూపర్‌ టెన్‌ అంటూ నమ్మబలుకుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘‘చంద్రబాబు చెప్పే ఈ సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ టెన్‌లకు ఎంత ఖర్చవుతుంది..? ఏటా రూ.1.50 లక్షల కోట్లు ఇవ్వాలి. అసలు ఇది సాధ్యమేనా?’ అని నిలదీశారు. ‘‘మళ్లీ అదే కూటమి.. మళ్లీ అదే సంతకం.. మళ్లీ అవే మోసాలు.. హిస్టరీ రిపీట్‌’’ అంటూ మండిపడ్డారు. శనివారం వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేని­ఫెస్టో–2024ను విడుదల చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

హామీలు అమలు చేయకుంటే పేదల బతుకులు ఛిన్నాభిన్నం..
అధికారంలోకి వచ్చిన పార్టీ తాను ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే పేదల బతుకులు ఛిన్నాభిన్నం అవుతాయి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే.. మనకన్నా ముందు పరిపాలించిన ప్రభుత్వమే దీనికి ఉదాహరణ. అప్పట్లో చంద్రబాబు, ఆయన కూటమి, ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? అవి ఏ ఒక్కటీ అమలు చేయకపోవడంతో ప్రజల బతుకులు ఏ విధంగా ఛిన్నాభిన్నమయ్యాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 

2014లో ఇదే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ముగ్గురి ఫోటోలు, చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన అంశాలు అంటూ ప్రతి ఇంటికి ఒక పాంప్లెట్‌ పంపించారు. ఎల్లో మీడియా­లోనూ ఊదరగొట్టారు. ఒక తల్లి మెడలో మంగళసూత్రం లాగేస్తూ ఉంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. బాబు వస్తున్నాడు.. బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది... అనేది ఆ అడ్వర్డైజ్‌మెంట్‌. వాళ్లు చెప్పిన మాటలు, హామీలను నమ్మి ఓటు వేసినందుకు నాడు తమ బతుకులు ఎలా అతలాకుతలం అయ్యాయో నాగరిక ప్రపంచంలో ప్రజలు గుర్తించాలి. ఒక రాజకీయ నాయకుడిని, ఒక పార్టీని, మేనిఫెస్టోను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు. ఆ తర్వాత అవి అమలు చేయకుంటే ప్రజలు బతుకులు ఏమవుతాయోనని కనీసం ఆలోచన కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలుపెడితే పరిస్థితులు ఎలా ఉంటాయి?

మాట మీద నిలబడే వాడే నాయకుడు..
రాజకీయ నాయకుడుంటే ఎలా ఉండాలి? ఒక మాట చెబితే ఆ మాట మీద తాను నిలబడతాడనే నమ్మకం ఉండాలి. అదిగో ఫలానా వ్యక్తి మా నాయకుడు, మా లీడర్‌ అని ఏ కార్యకర్త అయినా కాలర్‌ ఎగరేసుకుని చెప్పుకునేలా ఉండాలి. చంద్రబాబులా చేస్తే కాలర్‌ ఎగరేసుకుని చెప్పడం మాట దేవుడెరుగు.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు కనిపిస్తే దొడ్డిదారిన పారిపోవాల్సి వస్తుంది.  

గ్రామాల్లో సమూల మార్పులు
ఇవాళ గ్రామాల్లోకి అడుగుపెట్టి నాలుగు అడుగులు ముందుకు వేస్తే సచివాలయం కనిపిస్తోంది. 600 రకాల సేవలు, 60 – 70 ఇళ్లకు ఒక వలంటీర్, వివక్ష, అవినీతి లేకుండా ఇంటికే డోర్‌ డెలివరీ చేస్తున్న సేవలు అందుతున్నాయి. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే విలేజ్‌ క్లినిక్‌ కనిపిస్తుంది. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తోపాటు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష తెచ్చాం. విస్తరించిన ఆరోగ్యశ్రీ సేవలతోపాటు ఆరోగ్య ఆసరా అందిస్తున్నాం. గ్రామాల్లో రైతన్నను చేయిపట్టుకుని నడిపించే రైతుభరోసా కేంద్రాలు, నాడు నేడుతో సమూలంగా మారిపోయిన ఇంగ్లీషు మీడియం బడులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మరో 10–15 సంవత్సరాలు కొనసాగితే ఎంత గొప్ప మార్పు వస్తుందో ఆలోచన చేయండి. 

99 శాతం హామీలు అమలు చేశాం
► 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 32,000 కాగా మనం ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి సచివాలయంలో ఆ పిల్లలు కనిపిస్తారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, స్టాప్‌లు, పారామెడికల్‌ స్టాఫ్‌ కని­పిస్తారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేని­ఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు చేశాం. 

► వలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థలు గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్ధం చెబుతున్నాయి. ఈ 58 నెలల పాలనకు ముందు ప్రభుత్వ పథకాలు లంచాలు, వివక్ష లేకుండా అందుతాయంటే ఎవరైనా నమ్మేవారా? ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్లా? మొట్టమొదటసారిగా మార్పు చేసి చూపించాం.

► ఇవాళ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే 68 శాతం మంత్రి పదవుల్లో ఉన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఆ వర్గాల వారే ఉన్నారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను ఏకంగా చట్టం చేసి మరీ  అమలు చేశాం. 175 అసెంబ్లీ, 25 ఎంపీలు కలిపి మొత్తం 200 స్ధానాలకు గానూ ఏకంగా 50శాతం అంటే 100 స్ధానాలు  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలోఎప్పుడైనా జరిగిందా? పోనీ దేశంలో ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా?. సామాజిక న్యాయానికి అర్ధం చెబుతూ మాటల్లో కాకుండా చేతల్లో చూపించాం. 

► మన పల్లెటూరి పిల్లలు, పేద పిల్లలు ఐక్యరాజ్యసమితికి వెళ్లి రెట్టించిన ఆత్మ విశ్వాసంతో ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం ఇవాళ మనమంతా చూశాం. గవర్నమెంటు బడుల్లో నాడు నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లీషు మీడియం గవర్నమెంటు బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది. మరో పదేళ్లు ఇదే పాలన కొనసాగితే ఎలాంటి పెను మార్పులు వస్తాయో ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు ఒకటో తరగతి చదువుతున్న పిల్లవాడు 2035లో టెన్త్‌ క్లాస్‌లో ఐబీ ఎగ్జామ్‌ రాస్తాడు. మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ లాంటి వర్సిటీల కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి ఆన్‌లైన్‌ ద్వారా సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకున్నాం.

2035 నాటికి ఐబీలో మన పిల్లలు పదోతరగతి సర్టిఫికెట్‌ తీసుకుంటారు. ఆ తర్వాత నాలుగైదేళ్లకు డిగ్రీ పాసవుతారు. ఆ డిగ్రీ కోర్సుల్లో దాదాపు 30 శాతం కోర్సులకు హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్‌ నుంచి సర్టిఫికెట్లు వస్తాయి. మరో 10–15 ఏళ్లలో క్వాలిటీ చదువులతో పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతూ ఉద్యోగాలు సాధిస్తారు. పేదరికం మటుమాయం అవుతుంది. విద్యారంగంలో మొదలుపెడితే వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, సామాజిక న్యాయంలో ఇవాళ విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. 

సాధ్యం కాదని తెలిసీ దొంగ హామీలు
► 2019లో మనం ప్రకటించి అమలు చేసిన స్కీమ్‌లు, సంస్కరణలు, డీబీటీ, నాన్‌ డీబీటీ ( ఇళ్ల స్ధలాలు, పిల్లలకిచ్చే ట్యాబ్‌లు, విద్యాకానుక, గోరుముద్ద లాంటివన్నీ) కలిపితే సంవత్సరానికి దాదాపు రూ.70 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా, ఎప్పుడూ చూడని మార్పులతో అడుగులు ముందుకు వేస్తే అంత డబ్బు ప్రజలకు మనం నేరుగా ఇవ్వగలిగాం.

► ఈ రోజు చంద్రబాబు చెబుతున్న సూపర్‌ సిక్స్, సూపర్‌ టెన్‌లు గమనిస్తే వాటికి ఏడాదికి రూ.1,21,619 కోట్లు అవుతుంది. వీటికి తోడు జగన్‌ అమలు చేస్తున్న కొన్ని పథకాలను ఆపడం ఎవరి వల్లా కాదు. అటువంటివి కొన్ని పథకాలున్నాయి. వసతి దీవెన, విద్యాదీవెన ఆపడం ఎవరి వల్లా కాదు. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ ఆపడం ఎవరి వల్లా కాదు. ఉచిత బియ్యం ఇస్తున్నాం. 18.50 లక్షల మంది రైతన్నలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. జగన్‌ చిన్నపిల్లలకు గోరుముద్ద ఇస్తున్నాడు. ఎవరున్నా ఇది అమలు చేయక తప్పదు. ఇటువంటి పథకాలకు మరో రూ.29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా ఖర్చు చేయక తప్పదు. ఇవన్నీ కలిపితే రూ.1,50,718 కోట్లు కావాలి. జగన్‌ ఎంతో కష్టపడితే, ఎప్పుడూ జరగని విధంగా పరిపాలన అందిస్తే రూ.70 వేల కోట్లు చాలా కష్టపడి ఇవ్వగలుగుతున్నాం.

నమ్మి ఓటేస్తే ఒక్క హామీనైనా నెరవేర్చావా బాబూ?
► టీడీపీ 2014 మేనిఫెస్టో ముఖ్యమైన హామీల్లో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని చంద్రబాబు అన్నారు. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయా?
► పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? 
► ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్‌ చేస్తాం అన్నారు. ఒక్క రూపాయి అయినా డిపాజిట్‌ చేశారా? 
► ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకి రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లు అంటే 60 నెలలు. నెలకు రూ.2,000 చొప్పున రూ.1.20 లక్షలు ఏం ఇంటికైనా ఇచ్చారా? పిల్లల జీవితాలతో ఆడుకున్నారు.
► అర్హులందరికీ మూడు సెంట్లు స్ధలం, పక్కా ఇల్లు అన్నారు. కనీసం ఒక్క సెంటు స్థలం ఎవరికైనా ఇచ్చారా?  
► రూ.పదివేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత పవర్‌ లూమ్‌ రుణాల మాఫీ అన్నారు. అయ్యాయా? ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశారా? సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తా అన్నారు.తాడేపల్లి సంగతి దేవుడెరుగు.. విజయవాడలో కూడా కనిపించడం లేదు. 
► నాడు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే ఒక్కటంటే ఒక్క హామీ అయినా  నెరవేర్చారా చంద్రబాబూ? ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? దాన్నీ అమ్మేశారు! ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? అంటూ వెటకారం చేశారు. 
► అంతవరకు అందుతున్న సున్నావడ్డీ రుణాలను కూడా రైతులకు ఎగ్గొట్టారు.
► పొదుపు సంఘాలకు రుణమాఫీ దేవుడెరుగు 2016 అక్టోబరు వరకు అందుతున్న సున్నావడ్డీని సైతం రద్దు చేశారు. దీంతో పొదుపు సంఘాలు ఓవర్‌ డ్యూస్, ఎన్‌పీఏలు 18 శాతానికి వెళ్లిపోయాయి. ఏ గ్రేడ్, బి గ్రేడ్‌ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌గా మారిపోయాయి. పొదుపు సంఘాలన్నీ రోడ్డున పడ్డాయి.

రిపీటెడ్‌గా.. హేబిట్యువల్‌ అఫెండర్‌లా
చంద్రబాబు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చయ్యే సూపర్‌ సిక్స్, సూపర్‌ టెన్‌ పేరుతో ప్రజలను అడ్డగోలుగా మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాడు. మనం చెబుతున్న రూ.70 వేల కోట్లకు అదనంగా మరో రూ.80 వేల కోట్లు ఇస్తామంటున్నాడు. సాధ్యం కాదని తెలిసినా నమ్మబలుకుతున్నాడు. సాధ్యం కాదని తెలిసీ ఒక రాజకీయ నాయకుడు రిపీటెడ్‌గా.. హేబిట్యువల్‌ అఫెండర్‌లా.. 2014లో మాదిరిగా సాధ్యం కాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. సాధ్యం కాని హామీలతో ఇలా మోసం చేసేందుకు అడుగులు వేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420 కాదా? చీటింగ్‌ కాదా? ఆలోచన చేయండి. మీ మనసులకే విడిచిపెడుతున్నా. 

Advertisement
Advertisement