ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య మా బంధువు ఒకాయన తరచుగా మీ సేవ కేంద్రానికి వెళుతున్నారు. ఎందుకు? అని అడిగితే.. ఆయన చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించింది. తన పొలం, స్థలాల వంటివి తన పేరనే ఉన్నాయా?లేవా? అన్నది చూసుకోవడానికి అని చెప్పారు. ఈసీ తీసుకోవడానికి వెళ్తున్నా అని అన్నారు. అలా ఎందుకు ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక ఎక్కడి వెళతాయని అన్నాను. ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యం వేసింది.
ప్రభుత్వం ఏదో చట్టం తెచ్చిందట. మా భూములు మాకు ఉండవట. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని కాపీలు ఇస్తారట!.. ఇలా చెబుతూ పోయాడు. అదంతా విని ‘అలా ఎందుకు జరుగుతుంది?’ అని అడిగా. దానికి అతను వివరణ ఇచ్చాడు. అప్పుడు అర్ధం అయింది. ఆయన ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన అబద్దపు వార్తల ప్రభావానికి లోనయ్యాడని. ఒక మంచి పని చేయాలంటే ఒప్పించడానికి చాలా కష్టపడాలి. అదే ఒక వదంతి సృష్టించడం ఎంత తేలికో చూడండి. దేశంలో కాని, ప్రపంచంలోకాని ఏ ప్రభుత్వం అయినా ఎవరి ప్రైవేటు ఆస్తులను లాక్కోవడానికి చట్టం తీసుకు వస్తుందా? విద్యాధికుడు అయిన ఆయనే ఇంత అపోహపడితే ,సామాన్య ప్రజలు ఇంకెత అపార్ధం చేసుకుంటారు.
టైటిలింగ్ చట్టం వస్తే ఎవరి భూములు ఉండవని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా నీచమైన అబద్దాలు రాయడానికి సిగ్గు పడడం లేదు. టీడీపీ మేనిఫెస్టోని జనం నమ్మడం లేదని, ఇలాంటి అబద్దాలు ప్రచారంచేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే పదో తరగతి మాత్రమే చదివిన వ్యక్తి కనుక ఆయన జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారులే అని అనుకోవచ్చు. కానీ ఎమ్.ఎ. చేసిన చంద్రబాబు నాయుడు వంటివారు కూడా ఇలా ప్రచారం చేయడం ఏమిటి?ఆయన నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీ ఈ అసత్యాలను ప్రజలలో ఎందుకు విస్తరిస్తోంది. సుమారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదహారు ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలు చేయవచ్చా? అంటే ఏమి చెబుతాం. ఔ
ఆయనది ఎప్పుడూ కుట్ర స్వభావమే. తాను అధికారంలో ఉంటే అన్ని సంస్కరణలు తనవే అంటారు.ప్రతిపక్షంలో ఉంటే ఏ సంస్కరణ చేపట్టకూడదని అంటారు.తన వ్యతిరేక ప్రభుత్వం ఉంటే ,ఆ సంస్కరణలపై విషం కక్కుతారు. ఈయన రాజకీయ నేత, కుట్రలకు అలవాటుపడిన మనిషి కనుక ఇలా చేస్తున్నారులే అని అనుకోవచ్చు. కానీ, ఏభై ఏళ్లుగా ప్రజలకు తమ పత్రికల ద్వారా ,ఆ తర్వాత రెండు దశాబ్దాలుగా టీవీల ద్వారా విజ్ఞానం అందిస్తున్నామని ప్రచారం చేసుకునే ఈనాడు అధినేత రామోజీరావు ఇలాంటి దరిద్రపు ప్రచారం చేస్తున్నారు? అబద్దం అని తెలిసి కూడా ఇలాంటి చెత్త వార్తలు రాయవచ్చా? అంటే ఆ విజ్ఞతను రామోజీ ఎప్పుడో కోల్పోయారు. ఏపీ ప్రజలలో జగన్‌పై ఉన్న అభిమానాన్ని ఎలాగొలా మార్చాలని, జగన్ కు అనుకూలంగా ఉన్న ప్రజాభిప్రాయాన్ని మార్చాలన్న దుర్మార్గపు ఆలోచనే రామోజీరావులో ఉండడమే ఇందుకు కారణం. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడూ అలాంటి నీచపు ఆలోచనలతో ఉంటారు కనుక చెప్పుకోనవసరం లేదు.
వాస్తవం ఏమిటంటే టైటిలింగ్ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ చట్టాన్ని ఆమోదించారు. కానీ ఇంకా మార్గదర్శక సూత్రాలను సిద్దం చేయలేదు. పైగా కోర్టులో స్టే ఉంది. రైతుల,భూ యజమానుల హక్కులను రక్షించి,వారికి అధునాతన టెక్నాలజీలో భూముల వివరాలను నమోదు చేయడానికి ఉద్దేశించినది ఈ చట్టం. కేంద్ర ప్రభుత్వం పలు కమిటీలు వేసి, వారు చేసిన సిఫారసుల మేరకు ఈ మోడల్ చట్టాన్ని రూపొందించింది.
దీని ప్రకారం..
- రాష్ట్రాలలో ఉన్న భూ వివాదాలు తగ్గించవచ్చు.
- ఒకసారి భూముల సర్వే జరిగి వివిధ శాఖల సమన్వయంతో రికార్డులలోకి వివరాలు ఎక్కితే భూ యజమానికి పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.
- అంతే తప్ప ఎవరి భూమి ప్రభుత్వం తీసుకోలేదు.
భూములు, రిజిస్ట్రేషన్ ల రంగంలో నిపుణులైన కొందరు దీనిని అధ్యయనం చేసి,ఈ చట్టం తీసుకురావడం దేశానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఏవైనా చిన్న,పెద్ద అనుమానాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు.అలాకాకుండా అసలు ఈ చట్టాన్నే వ్యతిరేకిస్తూ ఎన్నికల సమయంలో ప్రజలలో అపోహలు సృష్టించడానికి టిడిపి,ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు ప్రయత్నించడం అంటే ఎపి ప్రజలకు ద్రోహం చేయడమే.
ఈ చట్టం వస్తే వీరు తమ బినామీ,కబ్జా భూముల బాగోతం బయటకు సస్తుందని భయపడుతుండవచ్చు.ఒకసారి గతంలో చంద్రబాబు ఏమి చెప్పేవారో గుర్తుకు చేసుకోండి. ఆయన 1995 లో ఎన్టీఆర్‌ను పడగొట్టి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తాను సంస్కరణవాదినని ప్రచారం చేసుకున్నారు. సచివాలయంలో కంప్యూటర్లు ప్రవేశపెట్టిన వ్యక్తినని చెప్పుకునేవారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో భూముల రిజిస్ట్రేషన్ ను కంప్యూటర్ ద్వారా చేసేవారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి సంస్కరణలు తీసుకు వచ్చింది. అయితే చంద్రబాబు తన టైమ్ లో ఏమి చేసినా తన ఘనత అని,అదే ఎదుటివారు ఏమైనా చేస్తుంటే బురద చల్లుతుంటారు.
ఉదాహరణకు కేంద్రం తీసుకువచ్చిన చట్టం ప్రకారం విద్యుత్ రంగంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పుడు ఆ చట్ట సవరణ చేసిన కేంద్రం కన్నా,తానే అవన్ని కనిపెట్టానని చెప్పుకునేవారు.రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని అనేవారు.ప్రభుత్వరంగంలో కార్పొరేషన్ లు వృధా అని చెప్పేవారు. తన మనసులో మాట పుస్తకంలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. కాని అదే పెద్దమనిషి ప్రతిపక్షంలోకి రాగానే పూర్తిగా రివర్స్‌గా మాట్లాడుతున్నారు.
మరో ఉదాహరణ చూస్తే.. కేంద్రం ఆదేశాల ప్రకారం జగన్ ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టింది. ఇదే చంద్రబాబు ఏమని ప్రచారం చేశారో తెలుసా?మోటార్లకు మీటర్లు అంటే రైతులకు ఉరి వేయడమే అని అన్నారు. పోనీ దానికే కట్టుబడి ఉన్నారా అంటే అదేమి లేదు. ఆ చట్టం తీసుకు వచ్చిన కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆ ఊసు ఎత్తడం లేదు. ఎల్లో మీడియా కూడా దీని గురించి ప్రచారం ఆపేసింది.
అలాగే ఇప్పుడు కేంద్రం తీసుకు వచ్చిన ఈ చట్టం ఇంకా ఏపీలో అమలులోకి రాకముందే పచ్చి అబద్దాలను వీరంతా కలిపి ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తు చంద్రబాబు చెప్పేవాటిని ప్రజలు నమ్మడం లేదు కాబట్టి సరిపోయింది. రామోజీ , రాధాకృష్ణలు రాసే వార్తలను జనం విశ్వసించడం లేదు కనుక సరిపోయింది. లేకుంటే ఏపీ సమాజం అంతా తీవ్ర అలజడికి గురి అయ్యేది. అయినా వీరు రాసే అబద్దాలను నమ్మేవారు కొద్ది మంది ఉండకపోరు. ఒక చదువుకున్న వ్యక్తి అనుభవాన్ని గమనిస్తే,ఇలాంటి వారు కూడా ఉండవచ్చన్న భావన కలుగుతుంది. వీరిలో అత్యధికులు తెలుగుదేశం వారే. వారే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రాసే చెత్తవార్తలు రాసి నమ్మి టెన్షన్ పడుతున్నారు.
31 లక్షల ఇళ్ల స్థలాలు, కొన్ని లక్షల ఎకరాల చుక్కల భూములు.. తదితరాలను చట్టబద్దం చేసి పేద ప్రజలకు, అర్హులైన వాళ్లకు అందించిన జగన్ భూములు లాక్కొంటారని ఎంత దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారో చూడండి.
ఏ సంస్కరణ అయినా, ఏ టెక్నాలజీ అయినా ప్రజలకు మంచి చేయడానికే ప్రభుత్వాలు తీసుకు వస్తాయి. అంతే తప్ప వారికి నష్టం చేయాలని ఎందుకు అనుకుంటాయి?. ఒకప్పుడు పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చినప్పుడు వామపక్షాలు సీపీఐ, సీపీఎం వంటివి తీవ్రంగా వ్యతిరేకించేవి. బీజేపీ కూడా విమర్శలు చేసేది. కానీ బీజేపీ ఆధ్వర్యంలోని వాజ్ పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ సంస్కరణలు అనుసరిస్తున్నట్లు ప్రకటించింది. మోదీ ప్రభుత్వం అయితే ఏకంగా భారతరత్న బిరుదును ఇచ్చింది.
ఒకప్పుడు కంప్యూటర్లు లేని రోజుల్లో తెల్ల కాగితాల మీద పెన్నుతో ఏ విషయం అయినా రాయవలసి వచ్చేది. కంప్యూటర్లు వచ్చాక మొత్తం జన జీవితాలే మారిపోయాయి. కంప్యూటర్‌లనే అంతా వాడడం ఆరంభం అయింది. మొదట్లో ఈ కంప్యూటర్లను వ్యతిరేకించినవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ కంప్యూటర్ లేని జీవితాన్ని ఊహించగలమా? ఉమ్మడి ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పౌరులు రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్లన్నిటీ స్కాన్ చేసి కంప్యూటర్ లోకి ఎక్కిస్తున్నారు.దీనివల్ల రికార్డులకు భద్రత పెరిగింది.అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ లలో మోసాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి ఒకసారి రిజిస్టర్ అయిన భూమిని సంబంధిత యజమానికి సంబంధం లేకుండా మరెవరూ రిజిస్టర్ చేయడానికి వీలులేని విధంగా టైటిలింగ్ చట్టం ఉపయోగపడుతుంది.
ప్రతి భూమికి ఒక నెంబర్ ఇస్తారు.దాని ఆధారంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఇందుకోసం ఇప్పటికే ఏపీలో భూముల సర్వే జరుగుతోంది. ఇదంతా అయిన తర్వాత కాని టైటిలింగ్ చట్టం అమలు చేయవలసి ఉంటుంది. అయినా ప్రజలలో అనవసర అనుమానాలను విపక్షం, ఎల్లో మీడియా కల్పిస్తున్నందున ,అసలు ఈ చట్టాన్ని ఇప్పట్లో అమలు చేయబోమని,దేశం అంతటా దీనిపై అన్ని రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి వచ్చాక అమలు చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాలి.
గతంలో బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే, ఆ డిపాజిట్లకు సర్టిఫికెట్ లు ఇచ్చేవారు. వాటిని మనం భద్రపరుచుకోవల్సి ఉండేది. ఇప్పుడు బ్యాంకులు సర్టిఫికెట్ ల బదులు రశీదులు ఇస్తున్నాయి. అవి కేవలం మన సంతృప్తి కోసమే. ఎందుకంటే మనం డిపాజిట్ మెచ్యూర్ అయ్యే డేట్ మర్చిపోయినా, బ్యాంకుల నుంచి ఆటోమాటిక్ గా మెస్సేజ్ రావడం, మనం ఆ డిపాజిట్ తీసుకోవడం జరుగుతోంది. ఎంత మార్పో ఆలొచించండి. ఒకప్పుడు ఏ కంపెనీ షేర్లను అయినా అప్లై చేసుకుంటే అవి సర్టిఫికెట్ రూపంలో వచ్చేవి. ఆ షేర్లను మనం అమ్మితే వాటిని కొనుగోలుదారుకు పంపవలసి ఉండేది. కాని ఇప్పుడు అసలు షేర్లు ఎలా ఉంటాయో కూడా ఎవరూ చూడనక్కర్లేదు. అన్ని డిజిటల్ లాకర్ లలోనే ఉంటున్నాయి. కొన్ని ట్రేడింగ్ కంపెనీలు వీటిని నిర్వహిస్తున్నాయి. మరి నా షేర్ సర్టిఫికెట్ ను ఇవ్వకుండా కాపీ ఇస్తారా? అని ఎవరైనా అడిగితే అతనిని అయోమయం వ్యక్తిగా చూస్తారు.
అలాగే.. ఇప్పుడు భూముల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఒరిజినల్‌వి కాదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కంపెనీల షేర్ల మాదిరి భూములు కూడా కంప్యూటర్లలో ఈ చట్టం కింద పరిరక్షణలో ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాపీ తీసుకోవచ్చు. నిరభ్యంతరంగా లావాదేవీలు జరుపుకోవచ్చు.ఇంకో ఉదాహరణ చెప్పాలి. గతంలో పత్రికలు తమ దిన సంచికలను జాగ్రత్తగా స్టోర్ చేసేవి. అవన్ని దుమ్ముకొట్టుకుపోయేవి.చెదలు పట్టి పాడైపోతుండేవి. మరి ఇప్పుడు వాటన్నిటిని డిజిటలైజ్ చేస్తున్నారు. పలు లైబ్రరీలు కూడా ఇలాగే వివిధ పత్రికలను డిజిటలైజ్ చేసి అందుబాటులో ఉంచుతున్నారు. అలాకాదు.ఒరిజినల్ పాత పేపర్లు కావాలని ఎవరైనా అడిగితే ఏమి చెబుతాం?. పాతకాలపు మనిషి అని నవ్వుకుంటారు.
కొన్ని సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకపోవడంతో భూ వివాదాలు పెరిగాయి. నకిలీలు, కబ్జాలు, రాజకీయ జోక్యం పెరిగిపోయింది..వీటన్నింటిని అరికట్టడానికి లాండ్ టైటిలింగ్ చట్టం ఉపయోగపడుతుంది.ఇక ఈ-స్టాంపింగ్ వ్యవస్థపై కూడా ఈనాడు పత్రిక దారుణమైన అబద్దాలు రాసింది. ఇప్పటికే పన్నెండు రాష్ట్రాలలో ఈ-స్టాంపింగ్ వ్యవస్థ అమలులో ఉంది. తెల్గీ స్టాంప్ కుంభకోణం తర్వాత కేంద్రం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రత తో ఈ-స్టాంపింగ్ వ్యవస్థను కేంద్రం తెచ్చింది.ఈ ప్రభుత్వం కూడా దీనిపై ప్రయోగాలు చేస్తుంటే ,కొందరు స్వార్ధపరులు దీనికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ స్టాంపులు జిరాక్స్ కాపీలు కావని ,నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ సేఫ్ అని వారు అంటున్నారు.
ఏపీలో ఏ అభివృద్ది జరిగినా, ఏ సంస్కరణ తెచ్చినా ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాటికి వ్యతిరేకంగా పచ్చి అబద్దాలు రాయడం,దానిని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అందుకోవడం నిత్యకృత్యం అయింది. వలంటీర్ల వ్యవస్థపై వీరంతా ఎంత విషం చిమ్మారో చూశాం. ఇప్పుడు అదే వ్యవస్థ తాము కొనసాగిస్తామని,ఇంకా ఎక్కువ జీతాలు ఇస్తామని చెబుతున్నారు. గ్రామ ,వార్డు సచివాలయాలతో గ్రామ పంచాయతీలకు నష్టం అని ప్రచారం చేశారు. ఇప్పుడు వృద్దుల పెన్షన్లు వారి ద్వారానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏ సంస్కరణ తెచ్చినా విషం కక్కుతున్న వీళ్లిద్దరి పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి ఇలాంటివారిని నమ్మి మోసపోయారు. మరోసారి మోసపోతే కోలుకోవడం కష్టమే అవుతుందని చెప్పక తప్పదు.
::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment