రాజు భికారీ పేరెప్పుడైనా మీరు విన్నారా? బీహార్‌లోని బెట్టియా రైల్వే స్టేషన్‌లో బిచ్చమెత్తుకునేవాడు ఈయన. మామూలు బిచ్చగాడైతే ఎవరూ పట్టించుకోకపోదురు కానీ... ఈయన దేశంలోనే తొలి డిజిటల్ బెగ్గర్! పాపం.. గుండెపోటుతో కాలం చేయడంతో ఈయన గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏమిటబ్బా ఈ డిజిటల్ బెగ్గర్ కథ అనుకుంటున్నారా? మరి చదివేయండి.
బెట్టియా రైల్వే స్టేషన్‌లో చాలాకాలంగా రాజు భికారీ ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు. ఎందుకంటే.. మెడలో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం క్యూర్ కోడ్‌లతో కూడిన ట్యాగ్‌లు వేలాడుతూండేవి. వచ్చి పోయే వారిని డబ్బులు అడుక్కునేవాడు. అయితే పేమెంట్ మాత్రం డిజిటల్ పద్ధతిలోనే చేయాలి. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిచ్చం వేయాలన్నమాట. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా స్ఫూర్తితో తానీ కొత్త తరహా భిక్షాటనకు పూనుకున్నానని బతికుండా రాజు భికారీ చెప్పుకునేవాడు.
డిజిటల్ పద్ధతులు రాక ముందే.. అంటే దాదాపు 32 ఏళ్లుగా రాజు భికారీకి భిక్షాటనే జీవనోపాధి. మోడీ అంటే అభిమానం ఎక్కువ. ‘మన్ కి బాత్’ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేవాడట. అంతకు ముందు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను తన తండ్రిగా చెప్పుకునేవాడు రాజు. అప్పట్లో ఆయనకు బెట్టియా రైల్వే స్టేషన్ క్యాంటీన్ నుంచే రోజుకు రెండు పూటల ఆహారం దొరికేది కూడా.
డిజిటల్ పద్ధతిలో అడుక్కోవడం మొదలుపెట్టిన తరువాత కూడా లాలూ అంటే అభిమానం పోలేదు కానీ.. మతిస్థిమితం సరిగ్గా లేకుండా పోయింది. ఆరోగ్యమూ అంతకంత క్షీణించడం మొదలైంది. చివరకు బెట్టియా రైల్వే స్టేషన్‌లో క్యూఆర్ కోడ్‌లు చూపిస్తూ అడుక్కుంటూండగానే... గుండెపోటు వచ్చింది.!!
Comments
Please login to add a commentAdd a comment